నూజివీడు ట్రిపుల్ ఐటి ఫుడ్ కాంట్రాక్టర్ల పై క్రిమినల్ చర్యలు

నూజివీడు ట్రిపుల్ ఐటిలో ఫుడ్ కాంట్రాక్టర్ల తొలగిచాలని, ఫుడ్ కోర్టు మూసేయాలని, బయట ఆహారాన్ని అనుమతించరాదని అధికారులకు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశం

By :  Admin
Update: 2024-09-02 04:51 GMT


అమరావతి: కలుషితాహారం ఘటనపై విచారణ కమిటీ సిఫారసుల మేరకు నూజివీడు ట్రిఫుల్ ఐటిలో ప్రస్తుతం కేటరింగ్ సేవలు అందిస్తున్న M/S. పైన్ క్యాటరింగ్ సర్వీసెస్, M/S. అనూష హాస్పటాలిటీ సేవలను తక్షణమే రద్దుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వారిపై క్రిమినల్ చర్యలకు విద్య, ఐటి శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆ సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా మరే ఇతర టెండర్లలో పాల్గొనకుండా బ్లాక్ లిస్టు చేయాలని నిర్ణయించింది. కొత్త కాంట్రాక్టర్లను నియమించే వరకు విద్యార్థులందరికీ ఆహారాన్ని అందించడానికి తాత్కాలికంగా M/S KMK క్యాటరింగ్ సేవలను ఉపయోగించుకోవాలని నూజివీడు ట్రిపుల్ ఐటి అధికారులకు ప్రభుత్వం సూచించింది. క్యాటరింగ్ కోసం కొత్త టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వం పేర్కొంది.
కమిటీ సిఫారసు మేరకు నూజివీడు ట్రిపుల్ ఐటిలోని ఫుడ్ కోర్టును తక్షణమే మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పెండింగ్‌లో ఉన్నఫుడ్ కోర్టు అద్దెను రెండు వారాల్లోగా ఏజెన్సీ నుంచి వసూలు చేయాలని, చెల్లించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బయటి ఆహారాన్ని క్యాంపస్‌లోకి అనుమతించవద్దని మంత్రి లోకేష్ ట్రిపుల్ ఐటి అధికారులను ఆదేశించారు. ఫుడ్ కోర్టుకు సంబంధించిన కొత్త టెండర్ల ప్రక్రియను వారంరోజుల్లో ప్రారంభించాలని మంత్రి లోకేష్ ట్రిపుల్ ఐటి అధికారులకు సూచించారు. అప్పటి వరకు రాష్ట్రంలోని ప్రముఖ ఫుడ్ చెయిన్ల నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

విచారణ కమిటీ నివేదికలో కీలకాంశాలు

నూజివీడు ట్రిపుల్ ఐటిలో ఆగస్టులో కలుషితాహారం తిని పెద్దసంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కమిటీ సభ్యులు మెస్, హాస్టల్ ప్రాంగణాలను తనిఖీలు చేశారు. ట్రిపుల్ ఐటిలో క్యాటరింగ్ సేవలు నిర్వహిస్తున్న M/S. పైన్ కేటరింగ్ సర్వీసెస్, M/S.అనూష హాస్పటల్ సర్వీసెస్ సంస్థలు కళాశాలలో ఆరు డైనింగ్ హాళ్లలో ఆహారాన్ని అందిస్తుండగా, వారిపై గతంలోనే పలు ఫిర్యాదులు అందాయి. ఇప్పటికే ఆహార నాణ్యతపై M/s ఫైన్ క్యాటరర్స్‌కు మూడు నోటీసులు జారీ చేసినా తీరు మారలేదు. మెస్ కమిటీలు సూచించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించినా నిర్వాహకులు వాటిని పెడచెవిన పెట్టారు.

కమిటీ తనిఖీల్లో బయటపడ్డ అపరిశుభ్రత

ట్రిపుల్ ఐటిలో పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రభుత్వంచే నియమితులైన విచారణ కమిటీ సభ్యులు కళాశాలలోని ఆరు డైనింగ్ హాళ్లను సందర్శించారు. M/s ఫైన్ క్యాటరింగ్ సర్వీసెస్, M/s అనూష హాస్పిటాలిటీ సర్వీసెస్ అనే రెండు క్యాటరర్లు ఒకే యాజమాన్యం ద్వారా నిర్వహిస్తున్నారని తేలింది. అధికారుల విచారణలో 7 ముఖ్యమైన సమస్యలను గుర్తించారు. 1. నాలుగు డైనింగ్ హాళ్లకు ఒకే వంటగదిని వాడుతున్నారు. 2. వంటశాలలో స్థల వినియోగం సరిగా లేదు. వంటశాలను స్టీమ్ కుకింగ్ తోపాటు వాషింగ్ కూడా వినియోగిస్తున్నారు. పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. 3. వంటగది ప్రాంతం బొద్దింకలతో నిండి ఉండి, నిర్వహణ సరిగా లేదు. 4. ప్లేట్లు , పాత్రలను శుభ్రం చేయడానికి సరైన పద్ధతులు అనుసరించడం లేదు, దీనివల్ల ఆహార భద్రతకు ప్రమాదం పొంచి ఉంది. 5. వంటగది గోడలు, కిటికీలు గ్రీజు, ఫంగస్ తో కప్పబడి అపరిశుభ్రంగా ఉన్నాయి. 6. బియ్యం, వేరుశెనగ, మినపప్పు వంటి వంటసరుకులు పురుగు పట్టి ఉన్నాయి. 7. వంటశాలలో కుళ్ళిన గుడ్లు ఉన్నాయి. ఇవన్నీ ఆహార నాణ్యత విషయంలో ఆందోళనకరమైన అంశాలుగా కమిటీ సభ్యులు గుర్తించారు. కమిటీ సభ్యులు తమ తనిఖీల్లో భాగంగా క్యాంపస్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. అక్కడ ఔట్ పేషెంట్లు (OP), అడ్మిట్ అయిన విద్యార్థులతో మాట్లాడారు.

విద్యార్థుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు

భోజనశాలల పరిశీలన అనంతరం కమిటీ సభ్యులు ఆడిటోరియంలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థుల నుంచి పలు ఫిర్యాదులు అందాయి. నిర్ణీత సమయాల్లో మాత్రమే నీటి సదుపాయం అందుబాటులో ఉందని, వాష్‌రూమ్‌ల నిర్వహణ సరిగా లేదని విద్యార్థులు తెలిపారు. ఎగ్జామినేషన్ సెల్‌లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మిస్టర్ జాన్‌పై పలు ఫిర్యాదులు అందాయి. విద్యార్థులకు అందించిన మాత్రలు నాసిరకమైనవని, క్యాంపస్ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు సరిగా లేవని చెప్పారు. బాలికలకు పరుపుల కొరత ఉందని, వ్యర్థ ఆహారాన్ని పారవేసేందుకు తగినన్ని డస్ట్ బిన్ లు లేవని విద్యార్థులు తెలిపారు. ఫుడ్ కోర్ట్ లో ఆహార నాణ్యత, పరిశుభ్రత లేమికి సంబంధించి పలు ఫిర్యాదులు అందాయి. కమిటీ పర్యటనలో పరిశీలనల ఆధారంగా అక్కడ పరిస్థితిని మెరుగుపరచడానికి, సంస్థ పనితీరుపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విశ్వాసం కలిగించడానికి పలు చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వానికి పలు సిఫారసులను కమిటీ నివేదించింది.

ఉన్నత విద్యశాఖ అధికారుల కమిటీ సిఫారసులు

విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను మెరుగు పర్చాల్సి ఉంది. ఇందులో భాగంగా ప్రస్తుతం కేటరింగ్ సేవలు నిర్వహిస్తున్న M/s ఫైన్ క్యాటరింగ్ సర్వీసెస్, M/s అనూష హాస్పిటాలిటీ సర్వీసెస్ సేవలను తక్షణమే రద్దు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. ఆ కేటరింగ్ సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా భవిష్యత్తులో మరోమారు టెండర్లలో పాల్గొనకుండా పాల్గొనకుండా బ్లాక్ లిస్టులో పెట్టాలి. వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
కొత్త ఫుడ్ కాంట్రాక్టర్లను నియమించే వరకు విద్యార్థులకు ఆహారాన్ని అందించడానికి తాత్కాలికంగా M/s. కెఎంకె క్యాటరింగ్ సర్వీసెస్ సేవలను ఉపయోగించుకోవాలి. కొత్త కేటరింగ్ టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. మెస్‌లో బియ్యం, కిరాణా వస్తువులు, ప్రాసెస్ చేసిన కూరగాయలతో సహా నాసిరకం పదార్థాలు ఉన్నట్లు గుర్తించినందున వాటిని తొలగించి, కొత్త స్టాక్ తెప్పించాలి. ఆహార నాణ్యత పర్యవేక్షణకు స్టూడెంట్ మెస్ కమిటీని నియమించాలి. స్టాల్స్, భోజన ప్రాంతం, వంటగది ప్రాంతాలను విద్యార్థులతో కూడిన మెస్ కమిటీ పర్యవేక్షిస్తుంది. అంతేకాకుండా ఆహారం రోజువారీ తనిఖీ కోసం ఇద్దరు ఫ్యాకల్టీ సభ్యులను కూడా కేటాయించాలి. తక్షణమే అమలులోకి వచ్చేలా ప్రతి డైనింగ్ హాల్‌లో ఫిర్యాదు పెట్టెలను కూడా ఏర్పాటు చేయాలి. అనునిత్యం ఆహార తనిఖీల కోసం ఇద్దరు ఫుల్ టైమ్ ఫుడ్ సేఫ్టీ ఇన్ స్పెక్టర్లను నియమించాలి.

ఆర్డీఓ అధికారి ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణకు ఆదేశాలు

నూజివీడు ట్రిపుల్ ఐటి లో పరిస్థితులు చక్కపడేవరకూ ఆర్డీఓ నిరంతరం పర్యవేక్షణ చెయ్యాలని, విద్యార్థులతో నిత్యం మాట్లాడుతూ ఎటువంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తు లో ఇటువంటి ఘటనలు జరగకుండా విద్యార్థుల అస్వస్థత కు కారణం అయిన క్యాటరింగ్ సంస్థల పై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ అధికారులకి ఆదేశాలు ఇచ్చారు


Tags:    

Similar News