కాల్పుల విరమణపై సందేహాలు ఉన్నాయంటున్న సీపీఐ

ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని సీపీఐ కోరింది. తిరుపతిలో పెరియార్ కు జరిగిన అవమానంపై సీఎం స్పందించాలని రాజా డిమాండ్ చేశారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-05-15 16:09 GMT
సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా

దక్షిణ ఆశియా దేశాలపై ట్రంప్ పెత్తనమేంటి, ఆయనకు భారత ప్రధాని తలొగ్గి వ్యవహరించడం ఏంటని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్, పాక్ కాల్పుల విరమణపై అనేక సందేహాలు ఉన్నాయని రాజ వ్యాఖ్యానించారు. పహల్గావ్ ఘటనతో పాటు కాల్పుల విరమణపై వివరణ ఇవ్వడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


తిరుపతిలో ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభల సందర్భంగా తిరుపతి ఇందిరా మైదానంలో ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు సుగ్జిందర్ సింగ్ మహేసరి అధ్యక్షతన జరిగిన సభ, అంతకుముందు మీడియాతో డి. రాజా మాట్లాడారు. అమెరికాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ తలొగ్గడం భారత ప్రజలను కించపరచడమే అన్నారు.

పెహల్గాం ఘటనపై ఇటీవల జాతిని ఉద్దేశించి మాట్లాడిన భారత ప్రధాని నరేంద్ర మోదీ అనేక అంశాలకు సమాధానం ఇవ్వలేదన్నారు. ఏప్రిల్ 22న పెహల్గాంలో జరిగిన ఘటనపై నిఘా విభాగం వైఫల్యంపై స్పందించలేదన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
"పాకిస్తాన్ ఉగ్రమూకలు అమాయక ప్రజలను చంపడం అత్యంత హేయమైన చర్య. ఉగ్రవాదాన్ని సమూలంగా రూపుమాపాలి. ఉభయ దేశాధి నేతలకు ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణపై స్పందించడంలో ఆంతర్యం ఏమిటి? ఇందులో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి" అని డి. రాజా వ్యాఖ్యానించారు. ఈ ఆపరేషన్ లో భారతసైన్యం తెగువ గర్వకారణం అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని నిరంతర సంక్షోభంగా మార్చి, మతం పేరిట బిజెపి విధ్వేషం రెచ్చగొడుతోందన్నారు.
మావోయిస్టులను సమూలంగా ఏరివేసి అటవీ సంపద, భూములు కార్పొరేట్ శక్తులు ఆదాని, అంబానీలకు అప్పజెప్పేందుకు ఆపరేషన్ కగార్ చేపడుతన్నారా? అని ఆయన ప్రశ్నించారు.
పెరియార్ కు అవమానం
"ద్రవిడ ఉద్యమం, సామాజిక న్యాయం కోసం పెరియార్ చేసిన పోరాటం సీఎం చంద్రబాబుకు బాగా తెలుసు. తిరుపతిలో ఏఐవైఎఫ్ మహాసభల కోసం పెరియార్ సిద్ధాంతాన్ని వివరించే చిత్రపటాలను పోలీసులు తొలగించడంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయమై సీఎం స్పందించాలని కోరారు.

సేవ్ ఇండియా ఛేంజ్ ఇండియా
ఈ నినాదం తో దేశవ్యాప్త ఉద్యమం దేశవ్యాప్తంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించడానికి యువత సమాయత్తం కావాలని బహిరంగ సభలో సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర వ్యవస్థగా నడవాలని దీనికి, ఇంద్రజిత్ గుప్తా కమిటీ  సిఫారసులు అమలు చేయాలన్నారు. రాజకీయ పార్టీలు విరాళాల పేరిట స్వీకరించిన ఎలక్ట్రోరల్ బాండ్స్ వల్ల బిజెపి మాత్రమే లబ్ది పొందిందని ఆరోపించారు. ఈ సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి తిరుమలై రామన్, రాష్ట్ర ప్రతినిధులు మాట్లాడారు.

కోలాహలం
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఏఐవైఎఫ్ బృందాలు సందడి చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కళాకారుల అభ్యదయ గీతాలు ఉర్రూతలూగించాయి.

వందేమాతరం శ్రీనివాస్ పాటలతో మరింత హుషారెత్తించారు.

తమిళనాడులో హత్యకు గురైన యువజన నేత ఫోటోతో ఆ రాష్ట్ర ప్రతినిధులు, హాజరయ్యారు. పంజాబ్ నుంచి పిల్లలతో సహా హాజరైన ప్రతినిధులు ప్రత్యేకంగా కనిపించారు.

Similar News