కృష్ణా జలాలతో చెరువుల అనుసంధాన రాగం..

రేపు కుప్పం రానున్న సీఎం చంద్రబాబు. శనివారం జలహారతి సమర్పణ.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-08-28 14:06 GMT
కుప్పం వద్ద హంద్రీనీవా కాలువలో ప్రవహిస్తున్న కృష్ణా జలాలు. ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారులు

కుప్పం బ్రాంచ్ కాలువలో కృష్ణా జలాలు బిరబిరా ప్రవహిస్తున్నాయి. ఇవి హంద్రీనీవా కాలువకు కొత్త కళ తెచ్చింది. శాంతిపురం మండలంలోని పరమసముద్రం చెరువు కృష్ణా జలాలతో తొణికిసలాడుతోంది.

కృష్ణాజలాలకు హారతి, సారె సమర్పించడానికి రెండు రోజుల పర్యటన కోసం సీఎం ఎన్. చంద్రబాబు శుక్రవారం కుప్పం చేరుకుంటారు. పరమసముద్రం చెరువు వద్ద శనివారం జలహారతి ఇస్తారు.  ఈ చెరువు నుంచి కుప్పం, పలమనేరులోని 110 చెరువులను అనుసంధానం చేయడానికి మార్గం ఏర్పడిందని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు.

హంద్రీనీవా కాలువ వెంబడి అధికారులు, ప్రజల సందడి

కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం తుమ్మిసి గ్రామం సమీపంలో కాలువ వద్ద ప్రత్యేకంగా ఘాట్ ఏర్పాటు చేశారు. దీనికి దగ్గరలోనే 18 అడుగుల చిరస్మరణీయ జ్ణాపకంగా పైలాన్ నిర్మిస్తున్నారు. కాలువలో నీటి లోతు పరిశీలించడం, పరిసర ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చదిద్దడానికి జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

"తన నియోజకవర్గ ప్రజలతో ఆ ఆనందం పంచుకోవడానికి రెండు రోజుల పర్యటనకు సీఎం ఎన్. చంద్రబాబు శుక్రవారం కుప్పం వస్తున్నారు" అని టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు.
రాయలసీమ వరప్రసాదినిగా భావించే హంద్రీ- నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ ఎస్ఎస్) కాలువకు నంద్యాల సమీపంలోని మల్యాల ఎత్తిపోతల కతకం వద్ద జూలై 17వ తేదీ కృష్ణా జలాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 23వ తేదీ కుప్పం నియోజకవర్గం పరిధిలోని రామకుప్పం మండలం వర్ధికుప్పం వద్దకు చేరిన కృష్ణా జలాలు చివరి మజిలీగా పరమసముద్రంలోకి 25వ తేదీ చేరాయి. ప్రస్తుతం ఈ చెరువుల కృష్ణా జలాలతో కళకళలాడుతోంది. టీడీపీ నేతలు, రైతులు ఈ చెరువుకు మంగళవారం జలహారతి కూడా సమర్పించారు.
25 ప్రదేశాల్లో పూజలు
సీఎం ఎన్. చంద్రబాబు జలహారతి ఇచ్చే సమయానికే హంద్రీనీవా కాలువ వెంబడి నియోజకవర్గంలోని 25 ప్రదేశాల్లో రైతులతో పూజలు చేయించడానికి కార్యక్రమం ఖరారు చేశారు. దీనిపై కుప్పం పట్టణంలోని కడా  ( Kuppam Development Authority Kada ) కార్యాలయంలో అధికారులతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ సమీక్షించారు.
"జలహారతి కార్యక్రమానికి రైతులు హాజరు కావడానికి శ్రద్ధ తీసుకోండి" అని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. రామకుప్పం, శాంతిపురం, కుప్పం, గుడిపల్లి మండలాల పరిధిలో 59 కిలోమీటర్లు ప్రవహించే కాలువ వెంట, రైతులతో జలపూజ చేయించడానికి 25 పాయింట్లు గుర్తించారు.
"ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు బాధ్యతలు తీసుకోవాలని" ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరారు. ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించాలని ఆయన సూచించారు.

కాలువ వద్ద పరిశీలిస్తున్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, అధికారులు

సీఎం చంద్రబాబు పర్యటన ఇలా...
కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం. ఎన్. చంద్రబాబు రెండు రోజుల పర్యటన కోసం శుక్రవారం కుప్పం రానున్నారు విజయవాడ నుంచి ఆయన విశాఖపట్టణం వెళతారు. అక్కడి కార్యక్రమాలు ముగిసిన తరువాత విశాఖ విమానాశ్రయం నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హోలికాప్టర్ లో శాంతిపురం మండలం తుమ్మిసి వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు చేరుకుంటారు. రాత్రికి ఈ గ్రామానికి సమీపంలోనే సొంత ఇంటిలో శుక్రవారం బసచేస్తారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివరించారు.

ఆగస్టు 29 బెంగళూరు విమానాశ్రమ నుంచి బయలుదేరి సాయంత్రం ఆరు గంటలకు శాంతిపురం మండలం తుమ్మిసి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుంటారు.

శాంతిపురం మండలంలో కడపల్లి వద్ద నిర్మించుకున్న సొంత ఇంటిలోనే రాత్రికి సీఎం చంద్రబాబు బస చేస్తారు. 

ఆగస్టు 30 ఉదయం పది గంటలకు కడపల్లెలోని స్వగృహం నుంచి బయలుదేరుతారు.

ఉదయం 10 . 30 గంటలకు హంద్రీనీవా కాలువ ప్రవహించే పరమసముద్రం గ్రామ సమీపంలోని చెరువు వద్దకు చేరుకుంటారు. అక్కడ జలహారతి సమర్పిస్తారు.

ఉదయం 11 .15 గంటలకు పరమసముద్రం చెరువు సమీపంలో బహిరంగ సభలో మాట్లాడతారు.

మధ్యాహ్నం 11.20 గంటలకు అవగాహన ఒప్పందాల కార్యక్రమం.

మధ్యాహ్నం 11.50 గంటలకు బహిరంగ సభ

మధ్యాహ్నం రెండు గంటలకు పారిశ్రామిక వేత్తలు, విశిష్ట అతిథులతో సమావేశం.

మధ్యాహ్నం 3.45 గంటలకు రోడ్డు మార్గంలో బహిరంగ సభ నుంచి పరమ సముద్రం గ్రామం సమీపంలోని హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు.

మధ్యాహ్నం  3.55 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరుతారు.

సాయంత్రం 4.40 గంటలకు బెంగళూరుకు చేరుకుంటారు. 

కాలువవద్ద స్నానఘట్టం తరహా ఏర్పాట్లు

చెరగని గుర్తుగా...

కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో సీఎం చంద్రబాబు కృష్ణా జలాలకు హారతి, సారె సమర్పిస్తారు. ఈ ఘట్టం చిరస్థాయిగా ఉండే విధంగా 18 అడుగుల పైలాన్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.

శాంతిపురం మండలం పరమసముద్రం చెరువు వద్ద నిర్మిస్తున్న పైలాన్

కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన రెండు రోజలు సాగుతుంది. దీనికోసం చిత్తూరు కలెక్టర్, ఎస్పీ మణికంఠ చందోలు అధికారులతో గురువారం సమీక్షించారు. అడ్వాన్స్ లైజనింగ్ సెక్యూరిటీ వంటి భద్రతా చర్యలను సమీక్షించారు.
Tags:    

Similar News