నెరవేరిన బాబు ప్రతిజ్ఞ.. సీఎంగానే అసెంబ్లీలోకి...

సభలో జరిగిన అవమానాన్ని భరించలేని చంద్రబాబు "సీఎం అయ్యాకే.. అసెంబ్లీలో అడుగుపెడతా" అని చేసిన భీషణ ప్రతిజ్ఞ సాకారమైంది. ఓట్ల లెక్కింపులో ఫలితాలు ఏకపక్షంగా వారికి లభిస్తున్నాయి.

Update: 2024-06-04 06:52 GMT

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞకు సవాల్‌గా మిగిలాయి. "మళ్లీ సీఎం అయ్యే వరకు అసెంబ్లీలో అడుగు పెట్టను" అని టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ నుంచి, ఓటర్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచి రాష్ట్రంలో టిడిపి కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు అనే ఫలితాలు వెలువడుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో

అవమానాల భారాన్ని భరించిన చంద్రబాబు నాయుడును ఆంధ్రరాష్ట్ర ప్రజానీకం అక్కున చేర్చుకున్నారు. భారీ మెజార్టీ ఇవ్వడంతో పాటు అసెంబ్లీ స్థానాలను కూడా ఆయన పార్టీకే అంకితం చేశారు. దీంతో ఆయన ప్రతిజ్ఞ సహకారం అవుతున్న నేపథ్యంలో సీఎంగా మళ్ళీ అసెంబ్లీలోకి పాదం మోపనున్నారు. గతంలో ఏం జరిగింది.

అది 2021 నవంబర్ 19

రాష్ట్ర శాసనసభలో "మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. " రిప్లై స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా అనుమతించరా? ఇది గౌరవ సభ కాదు. కౌరవ సభ. మళ్లీ సీఎం అయ్యేవరకు సభలో అడుగుపెట్టను" టిడిఎల్పీ నాయకుడు ఎన్ చంద్రబాబు నాయుడు చేసిన భీషణ ప్రతిజ్ఞ ఇది. ప్రస్తుత ఎన్నికల్లో విజయం సాధించడానికి మీద పడిన వయసును కూడా ఖాతరు చేయని స్థితిలో టిడిపి అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు అవిశ్రాంతంగా ప్రచారం సాగించారు.

చంద్రబాబును కుప్పంలో ఓడించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుచర గణాన్ని కుప్పంలో మోహరింపజేశారు. కుప్పంలో చంద్రబాబును విపరీతంగా ఆదరించే ఓటర్ల ముందు అధికార పార్టీ నాయకుల ఎత్తులు ఏమాత్రం పారలేదన్న విషయం ఓట్ల లెక్కింపులో తేలిపోయింది. 

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 175 స్థానాలు ఉంటే మ్యాజిక్ ఫిగర్ సాధించడానికి 86 సీట్లు అవసరం అవుతాయి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైఎస్సార్సీపీ 175 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసింది. కూటమిలో భాగస్వామి అయిన టిడిపి 144 అసెంబ్లీ స్థానాల్లోనూ, జనసేన పార్టీ 21, బిజెపి 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది.

హోరాహోరీగా ప్రచారం

2024 సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా మారాయి. బిజెపి - జనసేన - టిడిపి కూటమికి అధికారంలోకి రావడానికి 74 వయసులోనూ.. చంద్రబాబు నాయుడు చురుగ్గా ప్రచార ఘట్టాన్ని సాగించారు. " జగన్ అహంకారానికి- తెలుగు ప్రజల ఆత్మ అభిమానానికి మధ్య జరుగుతున్న ఘర్షణ ఇది" అని టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రజలు, యువతకు కర్తవ్య బోధ చేశారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడమే లక్ష్యం

ఇదే నేపథ్యంలో... సహచర మిత్రపక్షం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ " మిత్రపక్షంగా మారిన తర్వాత అంతకుముందు " ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే నా ముందున్న లక్ష్యం. అరాచక ప్రభుత్వాన్ని సాగనంపడానికి జనసేన ఓట్లను చీలనివ్వను" అని పవన్ కళ్యాణ్ విస్పష్టంగా ప్రకటించారు. అసెంబ్లీలోకి అడుగుపెట్టడమే కాదు. ప్రజల ఈతి బాధలను నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పని చేస్తాం" అని కూడా ఆయన చెప్పారు. వీరిద్దరి ప్రకటనలు ఐక్యతను చాటాయి. ఇందుకు బలమైన కారణం.. రాష్ట్ర శాసనసభలో అధికార పక్ష సభ్యులు మంత్రులుగా ఉన్న కొడాలి నానితోపాటు ఆ పార్టీకి అసోసియేట్ మెంబర్ గా ఉన్న వల్లభనేని వంశీ తదితరులు టిడిపి విపక్ష నేత ఎన్. చంద్రబాబు నాయుడును వ్యక్తిత్వ హననం చేసే విధంగా మాటలతో తూలనాడారు.

చివర చివరికి ఆయన సతీమణి నారా భువనేశ్వరి పేరును కూడా ప్రస్తావించి మాట్లాడడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. దీంతో ఆయన " ఇది గౌరవ సభ కాదు కౌరవుల సభ" ఇంతటి అవమానాలు భరించడం నేను ఊహించలేదు. " ఛాలెంజ్ చేసి చెబుతున్నా, మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలోకి అడుగు పెడతా" అని సహచర సభ్యులతో కలిసి బయటికి వెళ్లిపోయిన చంద్రబాబు నాయుడు మాటకు కట్టుబడే ఉండిపోయారు. ఆ మరుసటి రోజు కూడా టిడిపి ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయిన ఆయన వెక్కివెక్కి ఏడ్చారు. ఇది బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత కూడా ఆయనను స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో కుంభకోణం జరిగిందని అరెస్టు చేసి జైలు పాలు చేశారు. దీంతో టీడీపీ గ్రాఫ్ బాగా పెరిగింది. "రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న అవినీతి ఆరోపణలు, మంత్రులు ఎమ్మెల్యేలు సహజ వనరుల దోపిడీకి పాల్పడ్డారు. అక్రమ కేసుల్లో ఇరికించారు" అని టిడిపి ప్రధాన నాయకులతో పాటు శ్రేణులు కూడా ప్రచార ఘట్టంలో బలంగా ప్రజలకి తీసుకువెళ్లారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. పోలింగ్ ఘట్టం కూడా హోరాహోరీ గానే జరిగింది. దీంతో ప్రతిపక్ష టిడిపి కూటమి రాష్ట్రంలోని ఓటర్లకు పరిస్థితి విడమరచడంలో సఫలమయ్యారు. అనే విధంగా కౌంటింగ్లో వెలబడుతున్న ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. ఇదిలా ఉండగా,

ఆంధ్రను తాకిన తమిళ చాలెంజ్...

తమిళనాడు అసెంబ్లీలో జరిగిన సంఘటన యావత్ దేశాన్ని కదిలించివేసింది. 1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో ఓ అంశంపై చర్చ జరిగే సమయంలో అప్పటి సీఎం ఎం కరుణానిధి సభలో లేరు. ఈ విషయాన్ని అప్పటి ప్రతిపక్ష నాయకురాలు అధ్యక్షురాలు జే. జయలలిత నిలదీశారు. దీంతో ఆగ్రహానికి గురైన డిఎంకె సభ్యుల్లో ఒకరు జయలలిత కొంగు పట్టుకుని లాగడం దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో ఆమె" మళ్లీ సీఎం అయ్యేవరకు అసెంబ్లీలో పాదం మోపను" అని జయలలిత ప్రతిజ్ఞ చేశారు. ఆ మాటపై నిలబడిన ఆమె 19 96 ఎన్నికలు అఖండ విజయం సాధించి సీఎంగా అసెంబ్లీలో పాదం మోపారు.

2014లో జరిగిన విభజిత రాష్ట్ర ఎన్నికల్లో టిడిపి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 67 సీట్లతో వైఎస్ఆర్సిపి ప్రతిపక్షానికి పరిమితమైంది. వివిధ రాజకీయ కారణాలు వ్యవహారాలతో 23 మంది వైఎస్ఆర్సిపి సభ్యులు టిడిపిలో చేరారు. వారిలో కొందరు మంత్రులు కూడా అయ్యారు. ఆ ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు చర్యలు తీసుకోకపోవాదాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష నేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి 2017 నవంబర్ 25న " మళ్లీ సీఎం అయ్యేవరకు శాసనసభలోకి అడుగుపెట్టను" అంటూ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన ఆయన పాదయాత్ర నిర్వహించారు. 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో 151 స్థానాలతో సంచలన విజయం సాధించి సీఎం అయ్యారు.

అవమానాల భారం భరించలేక...

2019 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ప్రతిపక్షానికి పరిమితమైంది. ఆరంభం నుంచి అధికారపక్ష సభ్యులు టిడిపిని, చంద్రబాబునాయుడుని టార్గెట్ చేస్తూ మాట్లాడిన తీరు, హద్దులు దాటి చంద్రబాబు నాయుడు సతీమణినీ వదలకుండా చేసిన వ్యాఖ్యలతో ఆయన తీవ్ర మనస్థాపం చెందారు. "ఇది గౌరవ సేవ కాదు. కౌరవుల సభగా మారింది" ప్రజా తీర్పుతో మళ్లీ గౌరవంగా సీఎం హోదాలో అడుగు పెడతా"నంటూ ప్రతిజ్ఞ చేసి ఆయన, మూడేళ్ల నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో సీఎం హోదాలో మళ్లీ అసెంబ్లీ కి వెళ్ళాలి. అనేది టిడిపి చీఫ్ ఎన్. చంద్రబాబునాయుడు పట్టుదల. ఆయన పట్టుదలతో ఎన్నికల్లో శ్రమించిన తీరు కు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఆదరించినట్లు వెలువడుతున్న ఓట్ల లెక్కింపు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. టిడిపి కూటమి ఇప్పటివరకు 129 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, అధికార వైఎస్ఆర్సిపి 20 సీట్లలో సాగుతోంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగి, టిడిపి అధికారంలోకి రాబోతుందని సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సీఎంగా అసెంబ్లీలోకి..

శాసనసభలో భీష్ణ ప్రతిజ్ఞ చేసి వెలుపలికి వచ్చేసిన ఎన్ చంద్రబాబు నాయుడు, ప్రజలు అందించిన తీర్పుతో మళ్లీ ముఖ్యమంత్రి హోదాలోనే పాదం మోపనున్నారనే విషయం స్పష్టమైపోయింది. రాయలసీమ జిల్లాలోనే కాకుండా కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా టిడిపి కూటమి ఆధిక్య దిశలో దూసుకుపోతోంది. దీంతో కూటమి అధికారంలోకి వస్తుందనే విషయం తేలిపోయింది. ఈ ఫలితాలు ఎన్ చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా పట్టం కట్టడానికి తీర్పు ఇస్తున్నారనే విషయం తేట తెల్లమవుతోంది.

Tags:    

Similar News