కృష్ణమ్మకు కుంకుమ సమర్పించిన చంద్రబాబు
మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద స్విచ్ఛాన్ చేసి హంద్రీ–నీవా కాల్వలకు నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.;
ప్రస్తుతం నంద్యాల జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు హంద్రీనీవా ఫేజ్–1 కాల్వల విస్తరణ పనులు పూర్తి కావడంతో నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్‌లో రెండ మోటార్లను ఆన్ చేసి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు హంద్రీ–నీవా కాల్వ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని ఆయన సందర్శించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు వివిధ కాల్వలకు.. రిజర్వాయర్లకు విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించుకునేలా ప్రణాళిక బద్దంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. ఇరిగేషన్ శాఖ అంటే ప్రాజెక్టులు.. కాల్వలే కాకుండా.. భూగర్భ జలాల వినియోగం వంటివి కూడా చూసుకోవాలని పేర్కొన్నారు. తిరుపతి వద్ద గాలేరు–నగరి, హంద్రీ–నీవా, సోమశిల–స్వర్ణముఖి కలిసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ సందర్భంగా మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద చంద్రబాబు పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమను సమర్పించి వేద మంత్రోచ్ఛారణల మధ్య కృష్ణమ్మకు జలహరతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజా ప్రతినిధులు, నంద్యాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.