ఆంక్షలు లెక్క చేయని జగన్ అభిమానులు....
నెల్లూరులో ఉరకలెత్తించిన జగన్ పర్యటన;
By : SSV Bhaskar Rao
Update: 2025-07-31 11:21 GMT
నెల్లూరు జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలో అనుకున్నంత జరిగింది. ఆంక్షలు అధిగమించి వైసిపి శ్రేణులు భారీగా తరలివచ్చాయి. నెల్లూరు నగరం మొత్తం అష్టదిగ్బంధంలో ఉన్నప్పటికీ పోలీసుల ఆంక్షలు అభిమానానికి అడ్డుకట్ట వెయ్యలేకపోయారు.
భారీగా వచ్చిన జగన్ అభిమానులపై చాలా చోట్ల పోలీసులు లాఠీచార్జి కూడా చేశారు. దీనిని నిరసిస్తూ, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు ఇక్కడ కూడా లాఠీచార్జి చేసి కార్యకర్తలను చెదరగొట్టారు.
నెల్లూరు జిల్లా జైలు రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి బుధవారం మధ్యాహ్నం వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో నెల్లూరు నగరానికి చేరుకున్నారు.
పోలీసుల ఆంక్షలపై వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ ఘటుగా స్పందించారు.
"నేను జిల్లాల పర్యటనకు వస్తున్నాను అంటే చంద్రబాబుకు అంతా ఉలుకు, వణుకు ఎందుకు" అని వైఎస్. జగన్ ప్రశ్నించారు.
తనను చూడడానికి వస్తున్న అభిమానులను నిలువరించడానికి పోలీసులు ఆంక్షలు విధించడంపై జగన్ అభ్యంతరం చెప్పారు.
" ప్రభుత్వం కూడా అంతా అత్యుత్సాహం ఎందుకు చూపిస్తోంది" అని జగన్ నిలదీశారు. అక్రమ కేసులతో ఇబ్బందులు పడుతున్న మా పార్టీ నాయకులను కూడా పరామర్శించడానికి మీ అనుమతి కావాలా అని వైయస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
నెల్లూరు కేంద్ర కారాగారానికి సమీపంలోనే ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ఆయన దిగారు. అప్పటికే భారీ సంఖ్యలో చేరుకున్న పార్టీ నాయకులు. జగన్ను దగ్గరగా చూడాలని దూసుకు వచ్చారు. వెంటనే అప్రమత్తమైన జగన్ భద్రతా సిబ్బంది, జిల్లా పోలీసులు కార్యకర్తలను నియంత్రించారు.
మాజీ ఎమ్మెల్యే ప్రసన్న ధర్నా..
తమ అధినేత వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో అంచలు విధించడంతోపాటు తన నివాసం వద్ద ఎక్కువ మంది కార్యకర్తలను లేకుండా చేయాలని పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నిలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు.
రోడ్డుపైకి వచ్చి ఆయన ధర్నాకు దిగడంతో కొద్దిసేపు నెల్లూరు నగరంలో ఉద్రిక్తత ఏర్పడింది.
"జిల్లాలో కార్యకర్తలు రాకుండా నియంత్రించి, జగన్ పర్యటన విఫలమైందని చూపించడానికి పోలీసులు ప్రయత్నించారు" అని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్యే ప్రసన్న ధర్నాకు దిగడంతో కార్యకర్తలు కూడా భారీగా అక్కడికి దూసుకు వచ్చారు. దీంతో వారిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. రోప్ పార్టీ ఏర్పాటు చేసి బలవంతంగా పంపించడానికి విఫల యత్నం చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే పోలీసులు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు..
మాజీ మంత్రికి పరామర్శ
నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని మాజీ సీఎం వైఎస్. జగన్ పరామర్శించారు. ఆయన వెంట వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తోపాటు మరో నాయకుడు కూడా ఉన్నారు.
"కేసులకు భయపడవద్దు. ఈ కష్టాలు కొన్నాళ్లే. ధైర్యంగా ఉండండి" అని మాజీమంత్రి కాలానికి జగన్ ధైర్యం చెప్పారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
కొంతసేపు ఆయనతో మాట్లాడిన తర్వాత వైసిపి చీఫ్ జగన్ కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్నతో పాటు వారి కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ఆయన మాట్లాడారు.
అంత కలవరం ఎందుకు?
జిల్లా పర్యటనకు నేను వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కలవర పడుతోందని మాజీ సీఎం వైఎస్. జగన్ ఎద్దేవా చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులను తనకు దూరం చేయలేరని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులపై అక్రమంగా కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తుంది అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ ఇంకా ఏమన్నారంటే
"ఏపీ లిక్కర్ క్యాం పేరుతో టిడిపి కూటమి ప్రభుత్వం కుట్రకు తెరతీసింది" అని జగన్ ఆరోపించారు.
ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న తన ప్రకటన ఆంక్షలు విధించడం ఏంటని మీడియా వద్ద జగన్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విరుచుకోబడ్డారు.
"టిడిపి కూటమి ప్రభుత్వం విఫలమైందని ప్రశ్నించే వారి గొంతులో నొక్కుతున్నారు. ప్రతిపక్షాన్ని చూసి ఎందుకు భయపడుతున్నారు" అని జగన్ సూటిగా ప్రశ్నించారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏం తప్పు చేశారని జైల్లో పెట్టారు? ఆయనపై 14 అక్రమ కేసులు నమోదు చేశారని జగన్ ఆరోపించారు.
"నేను మీడియాతో మాట్లాడిన క్లిప్పింగులు షేర్ చేస్తే కూడా కేసు పెట్టారు" అని జగన్ గుర్తు చేశారు. ఇది కూడా కేసుకు ప్రామాణికమా? అని ఆయన ప్రశ్నించారు.
నెల్లూరు నేను వస్తున్నానని రెండు వేల మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి, ఇంతలా శ్రమించాలా అని కూడా ఆయన వ్యంగ్యంగా అన్నారు.
ఈ శ్రద్ధ రైతుల సంక్షేమం, ఇచ్చిన హామాలు అమలు చేయడంపై చూపించి ఉంటే బాగుండేదని జగన్ ప్రభుత్వానికి చురకలు వేశారు.
బలప్రదర్శన రిపీట్
రాష్ట్రంలో అనంతపురం జిల్లా రాప్తాడు తరువాత పల్నాడు, ప్రకాశం, చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో మామిడి రైతుల పరామర్శ కోసం పర్యటనలు సాగించిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతాల్లో కూడా ఆంక్షలను అధిగమించి, పార్టీ శ్రేణులు హాజరయ్యాయి. అంతకంటే ముందే పార్టీ నాయకులు జనసమీకరణకు దిగకుండా పోలీసులు కట్టడి చేశారు. అయినా, వైసీపీ నేతలు సాగించిన ఎత్తులతో జగన్ పర్యటనలు సఫలం అయ్యాయి. అదేకోవలో..
నెల్లూరులో కూడా బుధవారం జగన్ పర్యటనలో అవేసీన్లు రిపీట్ అయ్యాయి. నాయకులు తరలించడం అటుంచి, స్వచ్ఛందంగా వచ్చేవారు కూడా రాకుండా చేయాలని పోలీసులు ముళ్ల కంచెలు, మట్టి రోడ్లు తవ్వేయడం వంటి పనులు కూడా చేశారు. అయినా, పోలీసుల ఎత్తులను చిత్తు చేస్తూ, భారీగా జనాలు రావడానికి వైసీపీ నేతల చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో లక్ష్యం నెరవేరిందని సంతృప్తి చెందుతున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.