గంజాయి మీద ఆంధ్రా పోలీసుల యుద్ధం : సక్సెస్ అవుతుందా?

ఎపి ప్రభుత్వం భీషణ ప్రతిజ్ఞ చేసింది. నార్కోటిక్స్‌ కంట్రోల్‌కు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటైన ఈ వ్యవస్థ ప్రతిజ్ఞ ఏ మేరకు నెరవేరుతుందో?

Update: 2024-10-19 04:50 GMT

ఇప్పుడు ఆంధ్ర ప్రజల దృష్టి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ సిబ్బందిపై ఉంది. ఎవరు ఈ సిబ్బంది? ఎప్పుడూ లేని వారు ఎక్కడి నుంచి వచ్చారు? వీరి విధులు ఏమిటి? అనే చర్చ ఆంధ్రప్రదేశ్‌లో మొదలైంది. ఎప్పుడు ఎవరిని వీరు అదుపులోకి తీసుకుంటారో... అదుపులోకి తీసుకున్న వారు ఎలాంటి వారో... ఎందుకు వారిని అదుపులోకి తీసుకున్నారో... అసలు ఈ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ ఏమి చేస్తుంది? అనే అంశం చర్చనియాంశంగా మారింది.

ఇటీవల ఎవరి నోట విన్నా ఒకటే మాట గంజాయి బ్యాచ్‌లు ఎక్కువయ్యాయి. దారుణాలు జరుగుతున్నాయి. కారకులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. కళ్లముందే గంజాయి బ్యాచ్‌లు దారుణాలకు పాల్పడుతున్నాయి. నిన్నకాక మొన్న ఒక వ్యక్తి గంజాయి మత్తులో లోకో పైలెట్‌ను డబ్బుకోసం విజయవాడ రైల్వే స్టేషన్‌లో రైల్వే ట్రాక్‌పై కొట్టి చంపాడు. పైలెట్‌ డ్యూటీ ఎక్కేందుకు వెళుతుండగా ఈ దారుణ సంఘటన జరిగింది. ఇందుకు ప్రధాన కారణం గంజాయి. రాష్ట్రంలో విచ్చల విడిగా అమ్ముతున్నారు. ప్రధానంగా పట్టణాల్లో అమ్మకాలు ఎక్కువయ్యాయి. తాగే వారి సంఖ్య లెక్కలేనంతగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. అయినా గత పదేళ్లుగా పట్టీపట్టనట్లు ప్రభుత్వాలు వ్యవహరించాయి. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న దారుణాలు కేవలం గంజాయి మత్తులోనే జరుగుతున్నాయనే నిర్థారణకు ప్రభుత్వం వచ్చింది. గంజాయి అమ్మకాలు, అందుకు బానిసలవుతున్న వారి గురించి ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసింది.
నార్కోటిక్స్‌ బృందాలు
రాష్ట్ర వ్యాప్తంగా 450 మందితో ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. వీరంతా టీములుగా విడిపోయి. రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తారు. వీరిలో స్థానిక పోలీసులే ఉంటారా? ప్రత్యేక పోలీసులు కూడా ఉంటారా? అనే క్లారిటీ డీజీపీ నుంచి రాలేదు. కానీ 450 మంది సిబ్బందిని కేవలం నార్కోటిక్స్‌ నిరోదానికి కేటాయించినట్లు వెల్లడించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడేందుకు దేశంలో నార్కోటిక్స్‌ బ్యూరో కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంది. మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్‌ పదార్థాల ముప్పును తొలగించేందుకు, సమాజ ఆరోగ్యం, భద్రతను కాపాడేందుకు కట్టుబడి ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థ లక్ష్యం ఒక్కటే... ఇంటెలిజెన్స్‌ ద్వారా సమాచార సేకరణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకొని వారికి పునరావాస ప్రయత్నాలు, ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు చేపడుతుంది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 47లో ఉన్న ఆదేశిక సూత్రాలపై ఆధారపడింది నార్కోటిక్‌ డ్రగ్స్, సైకోట్రోపిక్‌ పదార్థాలపై జాతీయ విధానం అమలు చేయడం జరుగుతుంది. ఆరోగ్యానికి హాని కలిగించే మత్తు మందులను, ఔషధ ప్రయోజనాల కోసం మినహాయించి, సాదారణ వినియోగాన్ని నిషేధించడానికి ప్రయత్నించాలని రాష్ట్రాలకు కేంద్రం నిర్దేశిస్తుంది.
నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అపెక్స్‌ కోఆర్డినేటింగ్‌ ఏజెన్సీ జోన్‌లు, సబ్‌ జోన్‌ల ద్వారా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీగా కూడా పనిచేస్తుంది. దేశంలోని అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గౌహతి, ఇండోర్, జమ్ము, జోధ్‌పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పాట్నాలో ఉన్న జోన్‌లు. అమృత్‌సర్, అజ్మీర్, భువనేశ్వర్, డెహ్రాడూన్, గోవా, హైదరాబాద్, ఇంఫాల్, మదురై, మండి, మందసౌర్, రాంచీ, కొచ్చిన్‌లలో ఉప జోన్‌లు ఉన్నాయి. జోన్‌లు, సబ్‌ జోన్‌లు మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్‌ పదార్థాల స్వాధీనం, అధ్యయనం, కార్యనిర్వహణ, ఇంటిలిజెన్స్‌ ద్వారా సమాచారం సేకరించడం, కస్టమ్స్, రాష్ట్ర పోలీసులు, ఇతర చట్ట అమలు సంస్థలతో సన్నిహిత సహకారంతో పని చేయడం వంటి వాటికి సంబంధించిన డేటాను సేకరించి విశ్లేషిస్తాయి.
ఆంధ్ర రాష్ట్రంలోని పలు పట్టణాల్లో గంజాయి విచ్చల విడిగా అమ్ముతున్నారు. ఎక్కువగా విశాఖ ఏజెన్సీ ఏరియాలో పండించి అమ్మకాలు చేస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగరాల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆర్టీసీ బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, స్లమ్‌ ఏరియాల్లోని సామాజిక భవనాలు, ఇతర ఖాళీ స్థలాలు, పాడు పడిన భవనాలు గంజాయి తాగే వారికి వేదికలుగా మారాయి. విజయవాడ నగరంలోని కృష్ణలంక, అజిత్‌ సింగ్‌ నగర్‌ ఏరియాల్లో ఆట్లోల్లో కూర్చుని గంజాయి ఎక్కువ మంది తాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు రోడ్డుపై వెళ్లే వారిని కామెంట్‌ చేస్తుంటారు. మత్తు ఎక్కువైతే ఎవరిపైనైనా దాడికి తెగబడుతున్నారు. డబ్బులు అడుగుతున్నారు. ఇవ్వకుంటే కొట్టి చంపడానికి కూడా వెనుకాడటం లేదు.
బ్రీత్‌ ఎనలైజర్లు ఎందుకు పెట్టకూడదు...
మద్యం సేవించిన వారిని చెక్‌ చేసేందుకు బ్రీత్‌ ఎనలైజర్లు పెడుతున్నారు. అదే విధంగా గంజాయి తాగి వాహనాలు నడిపే వారిని గుర్తించాలంటే బ్రీత్‌ ఎనలైజర్లు పెడితే బాగుంటుందని కొందరు పౌర సంఘాల వారు అభిప్రాయ పడుతున్నారు. ఎన్‌జీవోలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వారు, యాక్టివిస్ట్‌లు మాట్లాడుతూ గంజాయి తాగి వాహనాలు నడపడం వల్ల కూడా యాక్సిడెంట్స్‌ చోటు చేసుకుంటున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. బైకులను యమా స్పీడుతో నడిపే కుర్రాళ్లు ఎక్కువ మంది గంజాయి తాగే వారేనని పోలీసులు సైతం చెబుతున్నారు. కొన్ని చోట్ల గంజాయి సిగరెట్లు కూడా విజయవాడ నగరంలో అమ్ముతున్నట్లు పోలీసుల నోటీస్‌కు వచ్చింది. ఆ షాపులను గుర్తించే పనిలో పోలీసులు ప్రస్తుతం ఉన్నారు.
శుక్రవారం సాయంత్రం విజయవాడలోని రామవరప్పాడు సెంటర్‌లో సాధారణ తనిఖీలు పోలీసులు నిర్వహిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు గంజాయితో పాటు ఒక తుపాకీ తీసుకుని కారులో ప్రయాణిస్తున్నారు. వీరిద్దరూ చెన్నైకి చెందిన వారు ఒకరిపేరు దినేష్‌ కుమార్‌ కాగా మరో వ్యక్తిపేరు ముత్తుగా పోలీసులు చెబుతున్నారు. వీరు 148 కేజీల గంజాయిని చెన్నైకి తరలిస్తున్నారు. దీని విలువ సుమారు రూ. 10లక్షలు పైన ఉంటుందని విజయవాడ పోలీసులు తెలిపారు. వీరు పాట్నాలో రూ. 75వేలు చెల్లించి తుపాకీ కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఎవరైనా వాహనాన్ని అడ్డగించి తమ నుంచి గంజాయి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే కాల్చేయాలనే ఉద్దేశ్యంతోనే తుపాకీ కొనుగోలు చేసినట్లు పోలీసుల వద్ద వారు వెల్లడించారు. అంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గంజాయి ఏ స్థాయిలో విక్రయం అవుతోందో అర్థం చేసుకోవచ్చు. వేరే రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌కు గంజాయి వస్తోన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. గంతలో విశాఖ పోర్టు నుంచి వందల కేజీల గంజాయి, ఇతర మత్తు పదార్థాలు దిగుమతి అయినట్లు పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంతవరకు నిందితులు మాత్రం దొరకలేదు.
Tags:    

Similar News