పోసానీ నిన్నొదలా..

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ పోసానికి నోటీసులు జారీ చేశారు.;

Update: 2025-04-10 06:09 GMT

ప్రముఖ సినీనటుడు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పోసాని కృష్ణమురళిని కూటమి ప్రభుత్వం వెంటాడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల మీద అనుచి వాఖ్యలు చేయడమే కాకుండా సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ పోసాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేశారు. దీంతో కేసులు నమోదైన పోలీసు స్టేషన్‌లు, కోర్టుల చుట్టూ పోసానిని పోలీసులు తిప్పారు. తర్వాత వాటి నుంచి కోర్టులు బెయిల్‌ మంజూరు చేశాయి. మార్చిలో సీఐడీ కేసుకు సంబంధించి బెయిల్‌ మంజూరు చేసిన గుంటూరు కోర్టు కొన్ని షరతులు విధించింది. ప్రతి సోమవారం, గురువారం మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి వచ్చి సంతకం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసు స్టేషన్‌లు, కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పిందని కాస్త రిలాక్స్‌ అయిన పోసానికి పిడుగు లాంటి వార్తను పోలీసులు అందజేశారు. కోర్టు ఆదేశాల మేరకు సంతకం చేసేందుకు వచ్చిన పోసాని కృష్ణమురళికి ఈ నెల 15న విచారణకు రావాలసి ఉంటుందని పోలీసులు నోటీసులు అందజేశారు.

ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు ఈ సారి పోసాని మీద మరో కేసును తెరపైకి తెచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ బీఆర్ నాయుడు అంశాన్ని తెరపైకి తెచ్చారు. టీడీపీ చైర్మన్‌ బీఆర్ నాయుడు మీద పోసాని కృష్ణమురళి సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు తెరపైకి తీసుకొచ్చారు. టీడీపీ చైర్మన్‌ గా బీఆర్ నాయుడు ఎంపికను పోసాని కృష్ణమురళి ఖండించారని, ఆయనను అవమానించే విధంగా పోసాని సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్‌ 15న విచారణకు రావాలని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ పోసానికి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోసాని మరో సారి పోలీసుల విచారణకు హాజరు కావలసి ఉంటుంది.

తొలుత ఫిబ్రవరిలో పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లోని తన నివాసానికి వెళ్లి పోసానిని అరెస్టు చేసి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని ఓబులవారిపల్లి పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ రిమాండ్‌లో ఉండగానే పీటీ వారెంట్‌ మీద పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోసానిని విచారించిన నరసరావుపేట కోర్టు రిమాండ్‌ విధించింది. దీంతో మార్చి 22న గుంటూరు కోర్టుకు తరలించారు. పోసాని మీద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 19కిపైగా కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి రాష్ట్రంలో నమోదైన పలు ప్రాంతాలకు తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడు కేసులో పోసానిని ఎన్ని పోలీసు స్టేషన్‌లకు తిప్పుతారు, ఏ కోర్టులు రిమాండ్‌లు విధిస్తాయో అనేది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చగా మారింది.

Tags:    

Similar News