ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సహా పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంటు స్థానాలకు సోమవారం (మే 13) ఎన్నికలు జరుగనున్నాయి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సహా పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంటు స్థానాలకు సోమవారం (మే 13) ఎన్నికలు జరుగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల నాలుగో విడతలో భాగంగా ఈ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దశ పోలింగ్ తో మొత్తం 379 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగినట్టవుతుంది. పార్లమెంటు నాలుగో దశలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలోని 147 అసెంబ్లీ స్థానాలకు కూడా సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు జరుగుతుండగా ఒడిశా అసెంబ్లీకి తొలి విడత ఎన్నికలు పూర్తి కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హోరాహోరిగా ప్రచారం చేశాయి. గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల ప్రచారంలో తిట్లు, దీవెనలు, రాజకీయ నాయకుల కుటుంబాలలో చీలికలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. ప్రతిపక్షం అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే అధికార పక్షం సంక్షేమం పాట పాడింది. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకేసారి పోలింగ్ జరుగుతోంది.
కంకిపాడులో ఓటు వేసిన శ్రీరెడ్డి. స్థానిక పంచాయతీలోని బూత్‌లో తన కుటుంబ సభ్యులతో కలసివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న నటి శ్రీరెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, ఇప్పటికి కూడా 13 నుంచి 14 వందల పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరుగుతుందని సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు. శాంతిభద్రతల్లో ఎటువంటి సమస్య రాలేదని తెలిపారు. ఈవీఎంలలో సమస్య వస్తే వెంటనే వాటిని పరిష్కరించామని తెలిపారు. ‘‘సాయంత్రం 5 గంటల వరకు వచ్చిన పోలింగ్ శాతం కేవలం అంచనా మాత్రమే. కచ్ఛితమైన పోలింగ్ శాతం రావాలంటే మరో అరగంట సమయం పట్టొచ్చు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.330 స్వాధీనం చేసుకున్నాం. కేంద్ర ఆధ్వర్యంలో ఉన్న యాప్ ద్వారా 415 ఫిర్యాదులు వచ్చాయి. 225 ఫిర్యాదులు సీ-విజిల్ యాప్ ద్వారా వచ్చాయి. ఈ ఒక్కరోజు 38 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి’’అని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది.. అయితే, 6 గంటలలోపు క్యూలైన్‌లో ఉన్నవారందరికీ ఓటువేసే అవకాశం కల్పించనున్నారు అధికారులు.. ఇప్పటికీ చాలా పోలింగ్ కేంద్రాల్లో భారీగా క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి.. సాయంత్రం 5 గంటల వరకే దాదాపు 70 శాతం పోలింగ్ నమోదు కాగా.. పోలింగ్ పూర్తి అయ్యే సరికి ఓటింగ్ శాతం మరింత పెరగనుంది.
కదలని క్యూ లైన్‌లు
కర్నూల్ నగరంలో బుధరపేట ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన 108, 109 పోలింగ్ కేంద్రాల్లో కదలని క్యూ లైన్‌లు.
వినుకొండ శావల్యాపురం మండలం కారుమంచిలో అధికారుల నిర్వాకం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. దాదాపు 200 ఓట్లు మిగిలి ఉన్నా పోలింగ్‌ను నిలిపివేశారు. వీవీ ప్యాట్లు అయిపోయాయని, ఛార్జింగ్ లేదంటూ కుంటి సాకులు చెప్పారని ఓటర్లు వెల్లడించారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు గొడవపడ్డారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని టీడీపీ కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుపై దాడి చేశారు. చదలవాడ అరవింద్ బాబు కార్లు ధ్వంసం చేశారు వైసీపీ కార్యకర్తలు. దీంతో ఒక్కసారిగా వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై దాడి చేశారు టీడీపీ వర్గీయులు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి ఇరువర్గాలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
రాష్ట్రంలో ఓటరు చైతన్యం వెల్లివిరిసిందని, ఉదయం 7గంటల నుంచే పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్‌లకు తరలి వచ్చి ఓట్లు వేసిన వారికి అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఇప్పుడు సాయంత్రం 5 గంటలైంది.. ఉదయం 7 గంటలకు ఎంత పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నారో.. పోలింగ్ ముగిసే ఈ సమయంలో కూడా అంతే ఉత్సాహంగా ఓట్లు వేస్తున్నారు. ప్రజలు ఓటింగ్‌పై ఇంత ఉత్సాహం చూపడం ప్రజాస్వామ్యానికి శుభపరిణామం. ఆ వర్గం ఈ వర్గం అని తేడా లేకుండా అందరూ వచ్చి ఓటేస్తున్నారు.
అల్లూరి జిల్లాలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లను ఆర్మీ హెలికాప్టర్‌తో స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. ఏజెన్సీలోని రంపచోడవరం నియోజకవర్గంలో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాలైన వై రామవరం మండలంలోని.. గుర్తేడు, పాతకోట, బొడ్డగండి పోలింగ్ కేంద్రాల నుంచి హెలికాప్టర్‌తో రంపచోడవరానికి ఈవీఎంలు తీసుకొచ్చారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ స్ట్రాంగ్ రూమ్‌కు ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను తీసుకొచ్చారు ఎన్నికల అధికారులు.
విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వీ. శ్రీనివాసరావు
ఆంధ్రలో అసెంబ్లీ స్థానాల్లో అత్యధికంగా జీడీ నెల్లూరులో అత్యధికంగా 79.90శాతం, అత్యల్పంగా కురుపాలంలో 52శాతం నమోదైంది.
అదే విధంగా లోక్‌సభ స్థానాల్లో అత్యధికంగా చిత్తూరులో 75.60 శాతం, అత్యల్పంగా అరకులో 58.20శాతం పోలింగ్ నమోదయింది.