ఆస్ట్రేలియాలో యూదుల పండుగ లక్ష్యంగా కాల్పులు, 12 మంది మృతి

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో పర్యాటక ప్రదేశమైన బాండి బీచ్‌లో ఆదివారం సాయంత్రం కాల్పులు జరిగాయి

Update: 2025-12-14 17:23 GMT
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బాండి బీచ్‌లో ఆదివారం సాయంత్రం 6.30 (స్థానిక కాలమానం ప్రకారం) గంటలకు కాల్పులు చోటు చేసుకొన్నాయి. దీనిలో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇండియా సహా ప్రపంచ దేశాలు చాలా తీవ్రంగా స్పందించాయి. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా సహించకూడదని హెచ్చరించాయి.
పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో బీచ్‌లోకి ప్రవేశించిన ఇద్దరు గన్‌మెన్లు ఒక్కసారిగా ఫైరింగ్‌ జరపడంతో కనీసం 12 మంది చనిపోయారు. కాల్పులు మొదలు కావడంతోనే వందల మంది పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం నల్లటి ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు షాట్‌గన్స్‌తో సర్ఫ్‌ క్లబ్‌ పక్కనే ఉన్న పాదచారుల వంతెనపైకి చేరుకొని కాల్పులు జరిపారు. అక్కడ జరుగుతున్న ఒక ఈవెంట్‌ను లక్ష్యంగా చేసుకొని దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు.
ఆస్ట్రేలియా ప్రధాని దిగ్భ్రాంతి..
బాండి బీచ్‌లో జరిగిన ఉగ్రదాడిపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బానీజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్కడి దృశ్యాలు షాకింగ్‌గా, దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని చెప్పారు. పోలీసులు, ఎమర్జెన్సీ సిబ్బంది ప్రాణాలను కాపాడేందుకు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ కమిషనర్‌తో, న్యూ సౌత్ వేల్స్ (NSW) ప్రీమియర్‌తో మాట్లాడానని, NSW పోలీసులతో కలిసి పని చేస్తున్నామని తెలిపారు. మరిన్ని వివరాలు.. ధృవీకరించిన తర్వాత వెల్లడిస్తామని చెప్పారు.
ఆ ప్రాంతంలో ఉన్నవారు NSW పోలీసు సూచనలను పాటించాలని ఆస్ట్రేలియా ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ దాడిని ఉగ్రవాద దాడిగా ప్రకటించి, దర్యాప్తును వేగవంతం చేసింది.
ఈ ఘటనలో ప్రాథమిక సమాచారం మేరకు 12 మంది మృతి చెందినట్లు ఆస్ట్రేలియా పత్రికలు పేర్కొన్నాయి. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు దుండగులను అదుపులోకి తీసుకొన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో క్షతగాత్రులను కాపాడేందుకు హెలికాప్టర్లు, 30 అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకొన్నాయి.
యూదుల హనుక్కా కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకొని..
బాండి బీచ్‌లో యూదులు జరుపుకొంటున్న హనుక్కా వేడకలను దుండగులు లక్ష్యంగా చేసుకొన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో స్థానిక యూదులు హాజరయ్యారు.
ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాను ఆస్ట్రేలియా ఫెడరల్‌ పోలీస్‌ కమిషనర్‌, న్యూసౌత్‌వేల్స్‌ ప్రీమియర్‌తో మాట్లాడినట్లు వెల్లడించారు.
కాల్పులు జరుపుతున్న దుండగుడితో పోరాడిన పౌరుడు..
బీచ్‌లోకి చొరబడిన దుండగులు విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్న వేళ ఓ స్థానికుడు వారిని అడ్డుకున్నాడు. ఓ సాయుధుడిని వెనుక నుంచి వెళ్లి బలంగా పట్టుకొని అతడి చేతిలో గన్‌ను లాగేసుకొన్నాడు. ఆ తర్వాత చేతికందిన వాటితో అతడిని తరిమికొట్టాడు. దీంతో అతడితో ఉన్న మరో దుండగుడు కూడా వెనక్కి తగ్గాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
దుండగుడిని గుర్తించిన భద్రతా బలగాలు
బాండి బీచ్‌లో కాల్పులకు తెగబడిన ఇద్దరు దుండగుల్లో ఒకరిని సిడ్నీ భద్రతా బలగాలు గుర్తించాయి. నిందితుడు 24 ఏళ్ల నవీద్‌ అక్రమ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. వివిధ కోణాల్లో అతడిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. గత కొన్నేళ్లలో పలు చోట్ల జరిగిన కాల్పులపైనా ఆరాతీస్తున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. మరోవైపు సిడ్నీలోని అక్రమ్‌ ఇంట్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు.
ప్రపంచ దేశాల ఖండన..
ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్‌లో ఉగ్రమూక ఇవాళ(ఆదివారం) జరిపిన కాల్పుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో యావత్ ప్రపంచం స్పందిస్తోంది. కాల్పుల్ని తీవ్రంగా ఖండిస్తూ, ఆయా దేశాల ప్రధానులు, అధ్యక్షులు బాధితులకు తమ సంఘీభావం తెలుపుతున్నారు. కాల్పుల ఘటనపై భారత ప్రధాని నరేంద్రమోదీ, భారత విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ సోషల్ మీడియాలో స్పందించారు.
'హనుక్కా పండుగ మొదటి రోజును జరుపుకుంటున్న యూదులను లక్ష్యంగా చేసుకుని, ఆస్ట్రేలియాలోని బాండి బీచ్‌లో ఈ రోజు జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. భారతదేశ ప్రజల తరపున, తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ దుఃఖ సమయంలో మేము ఆస్ట్రేలియా ప్రజలకు సంఘీభావంగా నిలబడతాం. ఉగ్రవాదం పట్ల భారతదేశానికి ఏమాత్రం సహనం లేదు. ఉగ్రవాదపు అన్ని రూపాలు.. ప్రదర్శనలకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి తాము మద్దతిస్తాం. అని భారత ప్రధాని నరేంద్రమోదీ తన సందేశంలో పేర్కొన్నారు.
అటు, భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.
Tags:    

Similar News