కాన్వాయ్ వాహనాల ఏర్పాటుపై చేతులెత్తేసిన ఏజెన్సీ

రవాణా శాఖకు 'ప్రొటోకాల్' కష్టాలు..

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-12-15 10:35 GMT
తిరుపతిలోని అలిపిరి టోల్ గేటు వద్ద తనిఖీలు చేస్తున్న ఆర్టీఏ అధికారులు

ప్రముఖులు (వీవీఐపీలు) వచ్చినపుడు వారి కాన్వాయ్ లో వాహనాలు ఏర్పాటు చేయడం ప్రొటోకాల్ అధికారుల విధి. అయితే ఇప్పుడా పని తమ తలకు మించిన భారమైందని ప్రోటోకాల్ విభాగం అధికారులు వాపోతున్నారు. కాన్వాయ్ లో వాహనాల కోసం అడ్డదారులు తొక్కాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఎలా తెలిసిందంటే...
తిరుపతి నగరంలోని అనేక ప్రదేశాలతో పాటు అలిపిరి వద్ద రవాణా శాఖ (Road Transport Authority RTA) అధికారులు సోమవారం అలిపిరి వద్ద ట్యాక్సీలను స్వాధీనం చేసుకోవడం కనిపించింది. యాత్రికుల వాహనాలకు జరిమానా విధిస్తున్నట్టు భావించారు. ఈ విషయంపై వాకబు చేసిన 'ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి రవాణా శాఖ అధికారులకు ఎదురైన కొత్త కష్టాలు వెలుగులోకి వచ్చాయి.
"ప్రముఖుల పర్యటనల కాన్వాయ్ కోసం వాహనాలు అద్దెకు పంపించే ట్రావెల్ ఏజెన్సీకి ప్రొటోకాల్ యంత్రాంగం 3 కోట్ల రూపాయలు బకాయి పడింది. ఆ సొమ్ము చెల్లించనిదే వాహనాలు ఏర్పాటు సాధ్యం కాదు" అనే సమాధానంతో రవాణా శాఖ అధికారులకు కష్టాలు ప్రారంభమైంది.
ప్రముఖుల తాకిడితో..
రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో విశాఖపట్టణం తరువాత తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రానికి ప్రముఖుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందులో ముఖ్యమంత్రి, గవర్నర్, ప్రధానమంత్రి, రాష్ట్రపతి తోపాటు అత్యంత భద్రత కలిగిన వీఐపీలు, వీవీఐపీలు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. దేశంలోని అనేక రాష్ట్రాలు ప్రధానంగా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రుల పర్యటనలు కూడా ఉంటాయి. వారితో పాటు శ్రీలంక, సింగపూర్, మలేషియా నుంచి కూడా ప్రొటోకాల్ వీఐపీల పర్యటనలు సాగిస్తుంటారు.
రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత
అత్యంత భద్రత కలిగిన ప్రముఖులు వస్తే, రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆతిథ్యం ఇవ్వడం అనేది ప్రొటోకాల్. ప్రముఖుడు ప్రయాణించే వాహనం తోపాటు ఆ కాన్వాయ్ లో వారి స్థాయి, భద్రతకు తగినట్లు 25 నుంచి 30 వరకు తిరుపతి జిల్లా నుంచి వాహనాలు సమకూర్చాల్సి ఉంటుంది. అధికారులు ప్రభుత్వ వాహనంలో ప్రయాణించినా, కాన్వాయ్ లో పోలీసులు, భద్రతా సిబ్బంది, మెడికల్ ఇతర అత్యవసర సర్వీసులకు సంబంధించిన సిబ్బంది కూడా ప్రముఖుడి వెంట వాహనాల కాన్వాయ్ లో ఉండాల్సిందే.
తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రొటోకాల్ యంత్రాంగం డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో పనిచేస్తుంది. రాష్ట్ర ప్రొటోకాల్ విభాగం నుంచి ప్రముఖుల పర్యటనలకు సంబంధించి మెసేజ్ అందిన వెంటనే వాహనాల ఏర్పాటు కోసం జిల్లా ప్రొటోకాల్ అధికారులు విధులు ప్రారంభిస్తారు.
ప్రముఖుల పర్యటనలో కాన్వాయ్
రాష్ట్రపతి పర్యటనకు 58 వాహనాలు
గవర్నర్ పర్యటనలో 14 వాహనాలు
ముఖ్యమంత్రి పర్యటనకు 24 వాహనాలు
విదేశీ ప్రముఖులు వస్తే.. 14 నుంచి 15 వాహనాలు.
అత్యంత భద్రతలో ఉన్న ప్రముఖులకు కూడా ఇదే ప్రొటోకాల్ వర్తిస్తుంది.
ఇక్కడే చిక్కు..
తిరుమల లేదా తిరుపతి జిల్లాలో ప్రముఖుల పర్యటన నేపథ్యంలో జిల్లా ప్రొటోకాల్ అధికారులకు సమాచారం అందిన వెంటనే రవాణా శాఖ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తారు. అంటే ప్రముఖుడి కాన్వాయ్ లో వాహనాలు సమకూర్చే బాధ్యత ప్రయివేటు ట్రావెల్స్ కాంట్రాక్టర్ కు అప్పగించడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఆ కోవలో ప్రముఖుడి పర్యటనకు 24 గంటల ముందు కండీషన్ లో ఉన్న ప్రయివేటు వాహనాలు ప్రొటోకాల్ యంత్రాంగానికి అప్పగించాల్సి ఉంటుంది. ఆ వాహనాలను పోలీసు ఇంటెలిజెన్స్, భద్రతా సిబ్బంది తనిఖీ చేయడంతో పాటు, వాహన డ్రైవర్ల సమాచారం ముందస్తుగా సేకరించడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. మళ్లీ ఆ ప్రముఖుడు తిరిగి వెళ్లే వరకు ఆ ప్రయివేటు వాహనాలు పోలీసులు ప్రధానంగా ప్రోటోకాల్ అధికారుల ఆధీనంలోనే ఉంటాయి. అంటే ఈ లెక్కన కనీసం రెండు రోజుల పాటు వారికి అద్దె చెల్లించాల్సి ఉంటుంది.
రూ. మూడు కోట్ల బకాయిలు
తిరుపతి జిల్లా పర్యటనకు ప్రముఖుల పర్యటనలకు వచ్చిన సమయంలో కాంట్రాక్టర్ ద్వారా ఇప్పటి వరకు రవాణా శాఖ ప్రయివేటు వాహనాలు కాన్వాయ్ కోసం ఏర్పాటు చేసింది. ఈ ఏడాదిలోనే రవాణా శాఖ ప్రయివేటు కాంట్రాక్టర్ కు రూ. మూడు కోట్ల రూపాయలు బకాయి పడింది. ఈ పరిస్థితుల్లో మరో రెండు రోజుల్లో వీవీఐపీ పర్యటన నేపథ్యంలో కాన్వాయ్ కోసం రవాణా శాఖ వాహనాల కోసం సంప్రదించినట్లు సమాచారం. దీంతో
"పాత బకాయిలు చెల్లించలేదు. ఈ స్థితిలో మళ్లీ అద్దెకు ఇవ్వడానికి వాహన యజమానులు అంగీకరించడం లేదు. వాహనాలు ఏర్పాటు చేయడం తన వల్ల కాదు" అని ప్రయివేటు కాంట్రాక్టర్ తిరస్కరించినట్టు ఓ అధికారి ద్వారా తెలిసింది.
ప్రముఖుల కాన్వాయ్ లో ప్రయివేటు వాహనాలకు అద్దె చెల్లించడంలో జాప్యం వెనుక బడ్జెట్ కేటాయించడంలో ఇబ్బందుల వల్ల ప్రొటోకాల్ అధికారులతో పాటు రవాణా శాఖ అధికారులకు ఈ కష్టాలు సర్వసాధారణంగా మారినట్లు కనిపిస్తోంది. తిరుపతి, తిరుమల పర్యటనకు ప్రతి రోజూ ప్రముఖుల తాకిడి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రయివేటు వాహనాలు ఏర్పాటు చేయడానికి బడ్జెట్ సమస్యగా మారిందనే అంశంపై తిరుపతి జిల్లా ప్రొటోకాల్ డిప్యూటీ కలెక్టర్ శివశంకర్ నాయక్ మాట్లాడారు.
అధికారుల వివరణ ఇలా...
"ప్రొటోకాల్ పాటించడం అధికారులుగా మా బాధ్యత. బడ్జెట్ సమస్య ఏమీ లేదు. ప్రముఖులు వచ్చినప్పుడు ప్రభుత్వం ద్వారా వారికి వాహనాలు ఏర్పాటు చేయడం అనేది మా విధుల్లో భాగం" అని శివశంకర్ నాయక్ స్పష్టం చేశారు. ఏజెన్సీ నుంచి వాహనాలు అద్దెకు తీసుకుంటాం. నిధులు రాగానే వారికి చెల్లింపులు చేయడంలో జాప్యం చేయడం లేదని శివశంకర్ నాయక్ స్పష్టం చేశారు.
"కాన్వాయ్ లో వాహనాల ఏర్పాటుకు రవాణాశాఖ అధికారులు ఆ విధులు నిర్వహిస్తుంటారు" అని ప్రొటోకాల్ డిప్యూటీ కలెక్టర్ నాయక్ అన్నారు.
ప్రముఖుల పర్యటనలో..
జిల్లాలో ప్రముఖులు పర్యటనకు వస్తే రెండు రకాల వాహనాలు కాన్వాయ్ లోకి ప్రాధాన్యత ఇస్తారు. అందులో ఇన్నోవా వాహనానికి రోజుకు రూ.2500, ఇన్నోవా కృష్టాకు రూ.2,900 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ప్రొటోకాల్ అధికారుల ద్వారా ఆర్డర్ తీసుకునే తిరుపతిలోని ఓ ట్రావెల్స్ ఏజెన్సీ వాహనాలు ఏర్పాటు చేస్తోంది. పాత బకాయిలు చెల్లించని స్థితిలో వీవీఐపీల పర్యటనకు వాహనాలు ఏర్పాటు చేయడం సాధ్యం కావడం లేదని ఆ ట్రావెల్స్ ఏజెన్సీ కాంట్రాక్టర్ అసహాయత వ్యక్తం చేసిన నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు శాపనార్థాలు పెడుతూ, ప్రయివేటు వాహనాలు స్వాధీనం చేసుకునేందుకు రంగంలోకి దిగినట్టు కనిపించింది.
Tags:    

Similar News