కాంగ్రెస్ నుంచి ప్రధాని మోదీ ప్రాణాలకు ముప్పు: కిరణ్ రిజుజు
ఓట్ చోరీ ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు ఇలాంటి నినాదాలు చేశారన్న కేంద్రమంత్రి, ఇది ఇక్కడితో ఆగబోదని ఆందోళన
By : Praveen Chepyala
Update: 2025-12-15 09:26 GMT
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రాణాలకు కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ప్రమాదం పొంచి ఉందని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు నిన్న రాంలీలా మైదానంలో మోదీని చంపేస్తామని నినాదాలు చేశారని, దీనికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో రిజుజు మాట్లాడారు. దేశ రాజధానిలో నిన్న కాంగ్రెస్ ‘ఓట్ చోర్, గద్దీ చోడ్’ అని నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కొంతమంది కార్యకర్తలు ప్రధానికి సమాధి తవ్వుతామని నినాదాలు చేశారని అన్నారు. ఇది భారత ప్రజాస్వామ్యానికి తీవ్ర దురదృష్టకరం, విషాదకరం అని ఆయన అభివర్ణించారు.
‘‘ప్రధాని ప్రాణాలకు ముప్పు తెస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు బెదిరింపులకు పాల్పడినందుకు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి.
వారు పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ క్షమాపణ చెప్పాలి. ప్రధాని మోదీకి సమాధి తవ్వుతామని కాంగ్రెస్ కార్యకర్తలు బహిరంగంగా ప్రకటించడం అత్యంత దురదృష్టకరం, విషాదకరం’’ అని కేంద్ర మంత్రి అన్నారు.
పార్లమెంట్ లోనూ లేవనెత్తిన రిజుజు..
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిన్న కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన నినాదాలను కేంద్ర పార్లమెంట్ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు లోక్ సభలో లేవనెత్తారు. ఆయన సూచన మేరకు ట్రెజరీలోని ఎంపీలందరూ కాంగ్రెస్ ను విమర్శించడానికి తమ తమ స్థానాల నుంచి లేచారు. దాంతో సభ మధ్యాహ్నం వరకూ వాయిదా పడింది.
రాజ్యసభలో సభా నాయకుడు జేడీ నడ్డా కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. కాంగ్రెస్ ఎల్పీ మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వారి ఆదేశం మేరకే ఇలాంటి నినాదాలు జరిగాయని, ఈ నినాదాలు వారి మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇరుపక్షాల వాదనల వల్ల రాజ్యసభ వాయిదా పడింది.
కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు, నాయకులు రాజకీయ ప్రత్యర్థులని, శత్రువులు కారని పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి అన్నారు. ‘‘మేము వేర్వేరు సిద్దాంతాలను ప్రచారం చేస్తాము. కానీ ప్రధాని మోదీ కలలుగన్న అభివృద్ది చెందిన భారత్ కోసం పనిచేస్తాము’’ అని ఆయన అన్నారు.
రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటున్నప్పటికీ అనేక సందర్భాల్లో శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారని రిజుజు గుర్తు చేశారు.
‘‘మేము ఈ నినాదాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము ఒకరికొకరు చంపుకోవాలని ఎప్పుడూ ఆలోచించలేదు. దాని గురించి మాట్లాడము. ఇది ఎలాంటి మనస్తత్వం? కొంతమంది రాజకీయ ప్రత్యర్థులను బహిరంగంగా చంపుతామని బెదిరిస్తున్న ఈ ఆచారం ఏమిటీ?’’ అని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
140 కోట్ల మందికి ప్రధానిగా మోదీ ఉన్నారని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడని రిజుజు అన్నారు. ‘‘ప్రపంచం మొత్తం ప్రధాని మోదీని గౌరవిస్తుంది.
భారత్ మొత్తం ప్రధాని మోదీని గౌరవిస్తుంది. కానీ ప్రతిపక్షంలోని కొంతమంది మాత్రం చంపేస్తామని వారు బెదిరిస్తున్నారు. ఈ సంఘటన ఇక్కడితోనే ముగియదు’’ దీనికి వారు కచ్చితంగా క్షమాపణ చెప్పాలని రిజుజు డిమాండ్ చేశారు.
ప్రధానమంత్రికే బెదిరింపు..
కాంగ్రెస్ లో మానవత్వం మిగిలి ఉంటే దేశ ప్రజలను గౌరవిస్తే, వారు పార్లమెంట్ ఉభయసభలలో వెంటనే క్షమాపణ చెప్పాలని రిజుజు కోరారు. ‘‘ఇలా చేస్తేనే వారు తమ తప్పును అంగీకరించారమని మేము అంగీకరిస్తాం.
మంచి సమాజంలో ప్రధానమంత్రిని దుర్వినియోగం చేయడం ఆమోదయోగ్యం కాదు. ప్రతిపక్షాలను మనం ఎప్పుడూ శత్రువులుగా పరిగణించమని, రాజకీయ ప్రత్యర్థులుగా పరిగణించమని ప్రధానమంత్రి ఎప్పుడూ చెబుతూనే ఉన్నారు’’
‘‘మనమందరం దేశం కోసం పనిచేస్తున్నాము. కానీ గౌరవీయ ప్రధానమంత్రి ప్రాణాలు తీయమని బహిరంగంగా ప్రకటించడం, మోదీ జీ సమాధిని తవ్వడం భారత రాజకీయ చరిత్రలో మనం చూసిన అత్యంత దురదృష్టకర విషయం’’ అని ఆయన అన్నారు.
ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నిన్న రాంలీలా మైదానంలో భారీ కార్యక్రమం నిర్వహించింది. ఎన్నికల కమిషనర్లు బీజేపీకి దాసోహం అయ్యారని, ప్రజల ఓటు హక్కులను హరించడానికి కుట్ర పన్నుతున్నారని, బీజేపీని అధికారం నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.