అనంతపురం: తెలుగు సైనికుడు నాయక్ వీరమరణం

'ఆపరేషన్ సింధూర్'లో ఓ జవాన్ వీరమరణం పొందారు. పెనుగొండ ప్రాంతంలో విషాదం అలుముకుంది.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-05-09 08:02 GMT
మురళీనాయక్ (ఫైల్)

పాకిస్థాన్ సైన్యంతో వీరోచితంగా పోరాడుతూ అనంతపురం జిల్లాకు  చెందిన ఓ జవాన్ శుక్రవారం వీరమరణం పొందారు. ఈ మేరకు ఆయన సమాచారం అందింది.

శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ అసెంబ్లీ స్థానం పరిధిలోని గోరంట్ల మండలం గడ్డంతాండా పంచాయతీ కళ్లి తాండాకు చెందిన మురళీనాయక్ వీరమరణం చెందారని సమాచారం అందింది. జ్యోతిబాయి, శ్రీరామనాయక్ కు మురళీనాయక్ దంపతులకు ఒక్కడే కుమారుడని తెలిసింది.

స్థానిక పోలీసుల ద్వారా మురళీ నాయక్ మరణ వార్త తెలిసింది. దీంతో తమ బిడ్డ ఇక లేడనే సమాచారంతో ఆయన కుటుంబీకులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. కళ్లి తాండా మొత్తం మురళీనాయక్ ఇంటి వద్దకు చేరుకుంది. కుటుంబీకులను ఓదార్చడానికి శతవిధాల ప్రయత్నిస్తుండడం అక్కడి వారిని కూడా కన్నీటి పర్యంతం చేసింది.
ఏడాది కిందటే సైన్యంలోకి వెళ్లి, జమ్మూ కాశ్మీర్ సెక్టార్ లో విధులు నిర్వహిస్తున్న మురళీ నాయక్ పాక్ సైన్యం జరుపుతున్న కాల్పులకు ధీటుగా సమాధానం ఇస్తూ, సహచర సైనికులతో పోరాటం సాగించాడు.
సైనికులకు సారధ్యం వహిస్తూ,
కమాండర్ ర్యాంక్ లో మురళీనాయక్ సహచరులతో కలిసి యుద్ధ భూమిలో ముందు సాగుతుండగా, పాక్ సైనికుల తూటాలు తగలడంతో తీవ్రంగా గాయపడినట్లు నాయక్ కుటుంబ సభ్యులకు మిలిటరీ అధికారుల ద్వారా సమాచారం అందింది. గాయపడిన నాయక్ ను మిలిటరీ ఆస్పత్రికి తరలించే సమయానికి తుదిశ్వాస విడిచారని మురళీ నాయక్ కుటుంబీకులకు వర్తమానం అందింది.
కాశ్మీర్ నుంచి మురళీనాయక్ పార్ధివదేహం శనివారం గ్రామానికి చేరే అవకాశం ఉంది. బెంగళూరుకు విమానంలో వచ్చే ఆయన పార్ధివదేహం పేటికను, సైనికులు కళ్లితాండాకు తీసుకుని వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చురుకైన క్యాడెట్
చదువుకునే రోజుల నుంచి కూడా మురళీ నాయక్ చురుకుగా ఉండేవారని ఆయన సహ విద్యార్థి రమేశ్ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.
ఆయన ఏమన్నారంటే..
"మాది ఉరవకొండ నియోజకవర్గం హావల్లి గ్రామం. నేను మురళీ నాయక్ అనంతపురంలోని ఓ ప్రయివేటు కాలేజీలో చదువుకునే రోజుల్లో డిగ్రీలో క్లాస్ మేట్స్. ఇద్దరం కూడా ఎన్.సీ.సీలో శిక్షణ పొందాం. నాకు ఉద్యోగం రావడంతో ఇక్కడే ఉండిపోయా " అని రమేశ్ వివరించారు.
" నా మిత్రుడు మురళీనాయక్ కమాండర్ హోదాలో సైన్యంలో ఏడాది కిందటే వెళ్లాడు. దేశం రక్షణ కోసం పోరాడుతూ, వీరమరణం పొందాడని వర్తమానం అందింది. దీనికి నేను గర్వపడున్నా. మిత్రుడిన కోల్పోయిన బాధ ఓ పక్క వేధిస్తోంది. మురళీనాయక్ జ్ఝాపకాలు మా వెంటే ఉంటాయి అని రమేశ్ గద్దగ స్వరంతో అన్నారు.
విషాధ ఛాయలు
యుద్ధంలో తమ గ్రామస్తుడు మురళీ నాయక్ వీరమరణం చెందాడనే సమాచారం ఆయన కుటుంబీకులను కన్నీటి పర్యంతం చేసింది. గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ సమాచారం తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సీఎం సంతాపం
శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ వీరమరణంపై సీఎం చంద్రబాబు స్పందించారు. దేశకోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు నాయక్ అని నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ మేరకు సీఎం ఎన్. చంద్రబాబు ట్విట్టర్ వేదికగా కామెంట్ చేశారు.
నాయక్ నీ త్యాగం అపారం

మురళీనాయక్ నీ త్యాగం ఈ దేశం మరవదు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. జనసన పార్టీ కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దేశ రక్షణలో నీ పోరాటం స్ఫూర్తిదాయకం అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. మురళీ నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
స్పందించిన మంత్రి లోకేష్
సత్యసాయి జిల్లాకు చెందిన మురళీనాయక్ పాక్ సైనికులతో పోరాడుతూ, వీరమరణం చెందిన ఘటనపై రాష్ట్ర ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. మురళీనాయక్ చూపించిన ధైర్య సాహసాలు రాష్ట్రానికి గర్వకారణం అని ట్వీట్ చేశారు. ఆయన మరణం తనను తీవ్రంగా కలచి వేసిందని మంత్రి లోకేష్ సంతాపం తెలిపారు. నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్ధివదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలకడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు.

Similar News