Pulse Polio | 'తిరుమల కొండంత' స్పందన

2129 మంది పిల్లలకు పోలియో చుక్కలు మందు పంపిణీ.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-12-21 14:02 GMT
శ్రీవారి ఆలయం ముందు పిల్లలకు పోలియో చుక్కల మందు వేస్తున్న టీటీడీ వైద్యాధికారులు

తిరుమల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాలేదు. సామాజికహిత కార్యక్రమాల్లో ప్రజల ఆరోగ్య రక్షణకు కూడా టీటీడీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. దేశవ్యాపితంగా ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల మందు కార్యక్రమం ఓ యజ్ణంలా నిర్వహించింది.

తిరుమల శ్రీవారి ఆలయం ముందు పిల్లలకు టీటీడీ ఆరోగ్యశాఖ సిబ్బంది చుక్కల మందు వేశారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 2129 మంది పిల్లలకు పోలియో చుక్కలు మందు పంపిణీ చేశారు. తిరుమల శ్రీ‌వారి ఆల‌యం వ‌ద్ద టిటిడి ముఖ్య వైద్యాధికారి డాక్ట‌ర్ బి.కుసుమకుమారి పిల్లలకు పోలియో నివారణ చుక్కల మందు వేశారు.

1995 నుంచి నిరాటంకంగా..
దేశంలో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మొదటిదశ కార్యక్రమాన్ని 1995 డిసెంబర్ నెలలో ప్రారంభించింది. ఈ కార్యక్రమలో వైద్య ఆరోగ్య శాఖతో పాటు స్వచ్ఛంద సంఘాలు, విద్యార్థులు, జర్నలిస్టులు, అనేక ప్రభుత్వ శాఖల యంత్రాంగం మమేకం అయింది. మారుమూల గ్రామాలకు కూడా ప్రత్యేక బృందాలను పంపించడం ద్వారా ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో నివారణకు రెండు చుక్కల మందు పంపిణీ చేశారు. దీని ప్రధాన లక్ష్యం ఒకటే, దేశాన్ని పోలియో రహితంగా తీర్చిదద్దడమే.
యాత్రా స్థలాల్లో..
రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల పరిస్ధితి వేరు. తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, మహానంది తోపాటు మిగతా ఆధ్యాత్మిక క్షేత్రాల పరిస్ధితి ప్రత్యేకం. దేశం నుంచే కాకుండా, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి తీర్థయాత్రల కోసం వచ్చే యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
తిరుమలకు వచ్చే వారిలో చంటిబిడ్డల తల్లులు, ఐదు సంవత్సరాల లోపు పిల్లలతో వచ్చే యాత్రికుల సంఖ్య కూడా ఏమాత్రం తక్కువ కాదు. దేశంలో పల్స్ పోలియో చుక్క పంపిణీ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ నర్సింగ్ సిబ్బంది తమ వద్ద ఉన్న జాబితా ఆధారంగా పిల్లలకు చుక్కల మందు వేస్తారు. కేంద్రాలకు రాని వారి పిల్లలను గుర్తించి, సోమవారం ఇళ్ల వద్దకు వెళ్లి, చుక్కల మందు పంపిణీకి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. పట్టణాలు, గ్రామాల్లో ఈ కార్యక్రమం ద్వారా తమ పిల్లలకు చుక్కల మందు వేయించడం సాధ్యం కాదు.
తిరుమలలో కూడా..
తరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన తల్లిదండ్రుల వెంట వచ్చిన పిల్లలకు వారి ప్రాంతాల్లో అవకాశం లేకుండా పోతుందని గ్రహించిన టీటీడీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగానే ఆదివారం ఉదయం శ్రీవారి ఆలయం ఎదుట ఈ కార్యక్రమాన్ని టీటీడీ ప్రధాన వైద్యాధికారి డాక్ట‌ర్ బి.కుసుమకుమారి పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించారు.
"తిరుమలలో యాత్రికుల పిల్లల తోపాటు స్థానికులకు కూడా 2129 మంది పిల్లలకు పోలియో చుక్కలు మందు పంపిణీ చేశాం" అని డాక్ట‌ర్ బి.కుసుమకుమారి తెలిపారు.

తిరుమలలో 25 ప్రాంతాల్లోలో పల్స్‌పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో శ్రీవారి ఆలయంతో కలిపి 21 ప్రాంతాలలో యాత్రికుల పిల్లల కోసం, నాలుగు ప్రాంతాలలో తిరుమల నివాసితుల పిల్లలకు ప్రత్యేకంగా శిబిరాలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పల్స్‌పోలియో కార్యక్రమంలో ఐదేళ్ల లోపు పిల్లలకు చుక్కల మందు వేశామని డాక్ట‌ర్ బి.కుసుమకుమారి తెలిపారు.
తిరుమలలోని టీటీడీ అశ్విని ఆసుపత్రి, జియన్‌సి, ఆర్‌టిసి బస్టాండ్‌, సిఆర్‌ఓ, పిఏసి-1, 2, ఎంబిసి-34, వైకుంఠం-1, 2, హెల్త్‌ ఆఫీసు, ఏటీసీ సర్కిల్, మేదరమిట్ట, వరాహస్వామి, రాంభగీఛ అతిధి గృహలవద్ద, శ్రీవారి ఆలయం లోపల, కల్యాణకట్ట, బాలాజీ నగర్, టిటిడి ఉద్యోగుల డిస్పెన్సరి ఎస్‌.వి. హైస్కూల్‌, పాపావినాశనం, అలిపిరి కాలినడక మార్గంలో పల్స్‌ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో కలిపి మొత్తం 2129 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్.కుసుమకుమారి, అశ్వినీ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటసుబ్బారెడ్డి, తిరుపతి సెంట్రల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుహర్లత, అశ్వినీ ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ కృష్ణకుమారి, డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బంది పాల్గొన్నారు.
తిరుపతి జిల్లాలో.. 

తిరుపతి జిల్లాలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వి. బాలకృష్ణ నాయక్ తెలిపారు. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎంఆర్. పల్లి పట్టణ పీహెచ్సీలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. జిల్లాలోని 2011 పోలియో కేంద్రాలలో ఐదేళ్లలోపు ఉన్న 2,59,843 మంది పిల్లలకు 2,46,974 మందికి పోలియో చుక్కలు వేసినట్టు డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వి. బాలకృష్ణ నాయక్ తెలిపారు.  22 వ తేదీ నుంచి రెండు రోజుల పాటు జిల్లాలో 3,736 బృందాలు ఇంటింటికి వెళ్లి మిగిలిన ఐదు శాతం మంది పిల్లలకు చుక్కల మందు వేస్తారని ఆయన తెలిపారు.
Tags:    

Similar News