అనంతపురం: మినీమహానాడులో టీడీపీ ఎస్సీసెల్ నేత ఆత్మహత్యాయత్నం

ఎమ్మెల్యే దగ్గుపాటి కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ దళిత నేత విషం కలిపిన ద్రావణం తాగారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-05-20 12:55 GMT
అనంతపురం : మినీమహానాడులో మాట్లాడుతున్న ఎంపీ అంబికా లక్ష్మినారాయణ

అనంతపురం జిల్లా టిడిపి మినీ మహానాడులో తీవ్ర కలకలం చెలరేగింది. ఆ పార్టీ దళిత విభాగం సీనియర్ నాయకుడు ఆత్మహత్యయత్నం చేశారు. అనంతపురం పట్టణంలో ప్రైవేటు వైద్యుడిగా ఉన్న సాకే వెంకటేశ్వర్లు పార్టీలో సీనియర్ నాయకుడు. దళిత విభాగం నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.


కడపలో మూడు రోజులపాటు నిర్వహించనున్న టిడిపి మహానాడు నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో మినీ మహానాడులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా, అనంతపురం జిల్లాలో టిడిపి నియోజకవర్గ మహాసభలు ఉత్సాహంగా జరుగుతున్నాయి.

ఎస్సీ సెల్ నేత ఆత్మహత్యాయత్నం
అనంతపురం నియోజకవర్గం టిడిపి మినీమహానాడు మంగళవారం ఉత్సాహంగా ప్రారంభమైంది. నియోజకవర్గంలోని పార్టీ ప్రజా ప్రతినిధులతో పాటు నాయకులు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి  ప్రసాద్ ప్రసంగిస్తున్నారు.

అదే సమయంలో టీడీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు సాకే వెంకటేశ్వర్లు  విషం తాగి, నోటి నుంచి నురగలు కక్కుకుంటూ పడిపోయారు. దీంతో సభలో తీవ్ర కలకలం చెలరేగింది. వెంటనే ఆయన నుంచి విషం కలిపిన సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నాయకులు ఆయనను ఆస్పత్రికి తరలించారు.
కష్టించే వారికి గుర్తింపు లేదు..

రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కష్టపడిన వారికి గుర్తింపు లేకుండా పోయిందనీ ఆ పార్టీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు వెంకటేశులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన అప్పటినుంచి ద్వితీయ శ్రేణి నాయకులను కూడా పట్టించుకోవడంలేదని వెంకటేశ్వర్లు ఆరోపించారు.
"కష్టపడిన ఎందరికో న్యాయం జరగడం లేదు. ఎమ్మెల్యే దగ్గుపాటిని ఎన్నిసార్లు కలిసినా పట్టించుకోవడం లేదు" అని బిగ్గరగా కేకలు వేస్తూ ఎస్సి సెల్ నగర అధ్యక్షుడు  నోటి నుంచి నురగలు కక్కుకూంటూ పడిపోవడంతో వేదికపై ఉన్న ఎమ్మెల్యే దగ్గపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తోపాటు సీనియర్ నాయకులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే వెంకటేశ్వర్లును అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకుని వెళ్లారని తెలుస్తోంది. 

Similar News