అనంతపురం : ఊరి కోసం ఇటుకలు, రాళ్లు మోసిన ఎమ్మెల్యే సునీత

రాప్తాడు మండలం నసన్నకోట దుర్గమ్మ తిరునాళ్లకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. చాలా ఏళ్ల తరువాత ఘనంగా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-04-26 10:28 GMT

నిత్యం రాజకీయలు, అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కూలీగా మారారు. ఎండను కూడా లెక్క చేయకుండా ఇటుకలు మోశారు. ఇసుక తట్టలు మోస్తూ శ్రమదానం చేశారు.

"నసన్నకోట.. నా ఊరు. ఇక్కడ జరిగే ఉత్సవాలకు పని చేయడం నా బాధ్యత. అని ఎమ్మెల్యే పరిటాల సునీత భావోద్వేగంతో అన్నారు. ఆమె భర్త దివంగత ఎమ్మెల్యే పరిటాల రవి తండ్రి శ్రీరాములయ్య ఈ తిరునాళ్ల బాధ్యతలు చూసేశారు. చాలా ఏళ్ల తరువాత గ్రామస్తులు ఐక్యంగా నిర్వహించే దుర్గమ్మ తిరునాళ్ల కు చాలా పెద్ద చరిత్ర ఉంది.

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం నసనకోట వద్ద ఉన్న పురాతన దుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు ఈ ఏడాది మే నెల 14వ తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన అమ్మవారి తిరునాళ్ల చాలా సంవత్సరాల తరువాత నిర్వహిస్తున్నారు.

దీంతో కొండగుట్టపై వెలసిన అమ్మవారి ఆలయం వద్దకు నడిచి వెళ్లడానికి వీలుగా మట్టిరోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే పరిటాల సునీత రాళ్లు మోశారు. కూలీలు, గ్రామస్తులతో కలిసి ఇసుక తట్టలు కూడా అందించారు. ఆలయం వద్దకు వెళ్లడానికి వీలుగా ఉన్న రాతి మడిగలు (మెట్లు) శుభ్రం చేయడంతో పాటు మరమ్మతు పనులు చేయడంలో గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే సునీత శ్రమదానం చేయడానికి ఉత్సాహం చూపారు. అనంతరం గ్రామస్తులతో కలిసి మధ్యాహ్నం భోజనం కూడా చేశారు.
అనంతపురం జిల్లాలో పెద్దగా పరిచయం అవసరం లేనిది పరిటాల కుటుంబం. ఎమ్మెల్యే పరిటాల సునీత భర్త పరిటాల రవీంద్ర దివంగత ఎమ్మెల్యే.
"పరిటాల రవి తండ్రి శ్రీరాములయ్య కాలం నుంచి కూడా కొండగుట్టపై వెలసిన నసనకోట దుర్మమ్మ ఆలయ నిర్వహణ, ఉత్సవాలు నిర్వహించే వారు" అని రాప్తాడు ప్రాంతానికి చెందిన ఎం. సతీష్ బాబు చెప్పారు. అత్యంత పురాతన ఆలయంలో తిరునాళ్లు ఏటా మే నెలలో నిర్వహిచడం ఆయనవాయితీగా పాటిస్తున్నారని సతీష్ బాబు తెలిపారు. ఇదిలాంటే, దాదాపు 68 ఏళ్ల తరువాత 2022లో తిరునాళ్లకు ఏర్పాట్లు చేశారు. ఆ తరువాత ఈ ఏడాది భారీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
చాలా ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్నారు.
ఎమ్మెల్యే ప్రమేయంతో..
రామగిరి మండలం నసనకోట వద్ద ఉన్న పురాతన దుర్గమ్మ తిరునాళ్లు భారీగా నిర్వహించడం. సమీప గ్రామాల నుంచి వచ్చే వారికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడానికి పెద్ద ఎత్తన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వీటిలో పంచాయతీలోని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే సునీత కూడా వారితో కలిసి శ్రమదానం చేశారు. సిమెంట్ ఇటుకలు మోస్తూ.. అలాగే ఇసుక గంపలు అందుకుంటూ పనులు చేశారు. మండుటెండలో కూడా ఆమె ఈ పనులు చేశారు. అనంతరం గ్రామస్థులతోనే కలిసి గుడి మెట్ల వద్ద భోజనం చేశారు.
ఇది నా ఊరు..

నసన్నకోట నా ఊరు. నేను ఇక్కడ పనుల్లో పాలుపంచుకోవడం నా బాధ్యత. ఆనందంగా ఉంది అని ఎమ్మెల్యే సునీత వ్యాఖ్యానించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..
"మే నెల 14,15,16 వ తేదీల్లో అమ్మవారి ఉత్సవాల నిర్వహణకు కార్యక్రమాలు ఖరారు చేశారు. తిరునాళ్ల పెద్దఎత్తున నిర్వహిస్తాం. ఉత్సవాల కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి" అని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. గ్రామస్తులు ఐక్యంగా నిర్వహించే ఈ ఉత్సవాల కోసం శ్రమదానం చేయడం నా బాధ్యత" అని ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ వ్యాఖ్యానించారు.

Similar News