ప్రభుత్వాలకు యూనివర్సిటీల భూములే దిక్కా ?
ఒకపుడు ఎక్కువగా ధరలు లేని భూములు ఇపుడు విలువలో బంగారాన్ని మించిపోయాయి.;
ప్రభుత్వం ఏదైనాసరే విద్యాలయాల భూములపైనే ఎందుకు కన్నేస్తున్నాయి ? విద్యాలయాలంటే ముఖ్యంగా యూనివర్సిటీలనే అనుకోవాలి. ఎందుకంటే దశాబ్దాల క్రితం ప్రభుత్వాలు యూనివర్సిటీలకు వేలాది ఎకరాలను కేటాయించాయి. వేలాది ఎకరాలను యూనివర్సిటీలకు ఎందుకు కేటాయించాంటే భవిష్యత్ విస్తరణను దృష్టిలో పెట్టుకుని. యూనివర్సిటీలు ఏర్పాటుచేసినపుడు పరిమిత సంఖ్యలో విభాగాలను ఏర్పాటుచేస్తాయి. కాలక్రమంలో పెరుగుతున్న విద్యార్ధుల సంఖ్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనను దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటిలు అనేక కొత్త కోర్సులను ప్రవేశపెడతాయి. అప్పుడు కొత్త విభాగాలను నిర్మించాల్సొచ్చింది. విద్యార్ధులు, విభాగాల సంఖ్య పెరిగేకొద్దీ భవనాలు, క్వార్టర్లను కూడా నిర్మించాల్సొస్తుంది. అందుకనే ఇలాంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని అప్పట్లో ప్రభుత్వాలు యూనివర్సిటీలకు వేలాది ఎకరాలను కేటాయించాయి.
సీన్ కట్ చేస్తే ప్రస్తుతం ప్రభుత్వం అవసరాలు బాగా పెరిగిపోయాయి. ప్రభుత్వాలకు ఆదాయాలు తగ్గిపోవటమే కాకుండా అప్పుల్లో ఉన్నాయి. అధికారంలోకి రావటంకోసం పార్టీలు పోటీపడి మరీ ఆచరణసాధ్యంకాని హామీలను ఇచ్చేస్తున్నాయి. అందుకనే అధికారంలోకి వచ్చిన పార్టీ ఆదాయమార్గాలను వెతుక్కుంటున్నాయి. భూముల విలువలను పెంచేయటం, ఎక్సైజ్ ఆదాయం పెంచుకోవటం ఇలా అందుబాటులో ఉన్న అన్నీమార్గాలను వెతెక్కుంటున్నాయి. ఇలాంటి మార్గాలన్నీ అయిపోయిన తర్వాత చివరకు యూనివర్సిటీల భూములపైన కన్నుస్తున్నాయి. ఒకపుడు ఎక్కువగా ధరలు లేని భూములు ఇపుడు విలువలో బంగారాన్ని మించిపోయాయి. అందుకనే ఒకపుడు యూనివర్సిటీలకు కేటాయించిన భూములను ప్రభుత్వాలు ఇప్పుడు వెనక్కు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగమే ఇపుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి(హెచ్సీయూ)లో జరుగుతున్న గొడవలు.
ఇపుడు గొడవలనే తీసుకుంటే హెచ్సీయూ(HCU Land row) 1974లో ఏర్పాటైంది. అప్పట్లో యూనివర్పిటి ఏర్పాటుకు ప్రభుత్వం 2300 ఎకరాలను కేటాయించింది. అన్ని వేలఎకరాలను ఎలాగ కేటాయించిందంటే ఇపుడున్న హెచ్సీయూ ఏరియా, గచ్చిబౌలి(Gacchibowli) గ్రామం అప్పట్లో నగరంకు చాలా దూరంగా ఉండేది. పైగా అప్పట్లో నగరంచుట్టూ వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండేది. ప్రభుత్వం దగ్గర వేలాది ఎకరాలతో కావాల్సినంత ల్యాండ్ బ్యాంక్ ఉండేది. అయితే కాలక్రమంలో నగరం పరిధి పెరుగుతుండటంతో ఒకపుడు శివారుప్రాంతాలన్నీ హైదరాబాద్ లో భాగమైపోయాయి. 1995 నుండి నగరం విస్తరణ బాగా వేగవంతమైంది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఒకపుడు నగరం శివారుప్రాంతాలుగా ఉన్న గ్రామాలు గచ్చిబౌలి, నానక్ రామ్ గూడ, కొండాపూర్, శంషాబాద్, శంకర్ పల్లి, కూకట్ పల్లి, బాచుపల్లి, కోకాపేట లాంటి అనేకగ్రామాలు ఇపుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా మారిపోయాయి.
ఎప్పుడైతే భూముల విలువలు పెరిగిపోయాయో వెంటనే భూకబ్జాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా పెరిగిపోయాయి. దాంతో భూముల ధరలకు రెక్కలొచ్చి ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి. ఇదేసమయంలో అనేక కారణాలతో భూములకు బాగా కొరతొచ్చేసింది. ప్రభుత్వాల ఆదాయాలు కూడా తగ్గిపోవటంతో పాలకుల దృష్టి భూముల అమ్మకాలపైన పడింది. చాలా భూములు ప్రభుత్వానివే అయినా కోర్టు వివాదాల్లోనో లేకపోతే బడాబాబుల కబ్జాల్లోనో ఉండటంతో పాలకులు ఏమిచేయలేకపోతున్నారు. అందుకనే గతంలో విద్యాలయాలకు కేటాయించిన వేలాది ఎకరాలపైన పాలకుల కన్నపడింది. 2015లో కేసీఆర్ అయినా ఇపుడు రేవంత్ అయినా యూనివర్సిటీల భూములు తీసుకోవాలని అనుకోవటానికి ముఖ్య కారణం వేలంద్వారా వేలాదికోట్ల రూపాయలను సంపాదించటమే.
ఇపుడు హెచ్సీయూ 400 ఎకరాల మీద పెద్ద వివాదమే నడుస్తోంది. ఈ భూములను 2003లో చంద్రబాబు(Chandrababu Naidu) ఐఎంజీ భారత్ అనే ప్రైవేటు సంస్ధకు కేటాయించారు. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్(YSR) ఐఎంజీకి భూముల కేటాయింపులను రద్దుచేశారు. దాంతో ఐఎంజీ భారత్ కోర్టులో కేసువేయటంతో వివాదం మొదలైంది. ఈ వివాదం 20 ఏళ్ళు హైకోర్టు, సుప్రింకోర్టులో నలిగి చివరకు పోయిన ఏడాది 400 ఎకరాల రద్దును సుప్రింకోర్టు సమర్ధించింది. భూమి మొత్తం ప్రభుత్వానిదే అని తీర్పిచ్చింది. దాంతో వేలకోట్లరూపాయల విలువైన భూమి ప్రభుత్వం ఖాతాలోపడింది. నిజానికి ఐఎంజీకి చంద్రబాబు కేటాయించిన 400 ఎకరాలు హెచ్సీయే భూములే. అయితే హెచ్సీయూ నుండి తీసుకున్న భూములకు ప్రత్యామ్నాయంగా చంద్రబాబు ప్రభుత్వం గోపనపల్లిలో రెండుచోట్ల 400 ఎకరాలను కేటాయించేసింది.
హెచ్సీయూ నుండి తీసుకున్న 400 ఎకరాలను ప్రభుత్వం ఐఎంజీ భారత్ అనే సంస్ధకు 2003 ఎన్నికలకు ముందు కేటాయించింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వైఎస్సార్ ముఖ్యమంత్రి అవగానే ఐఎంజీ భారత్ కు 400 ఎకరాల కేటాయింపును రద్దుచేశారు. దాంతో ఐఎంజీ యాజమాన్యం కోర్టులో కేసువేసింది. ఆ కేసుపై 2024లో ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రింకోర్టు తీర్పుచెప్పింది. సుప్రింకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి వచ్చిన భూములనే ఇపుడు రేవంత్ వేలంలో అమ్మాలని ప్రయత్నిస్తున్నాడు. భూములను చదనుచేసేందుకని జేసీబీలు, బుల్ డోజర్లు పనిమొదలుపెట్టాయి. రేవంత్(Revanth) ప్రభుత్వ ప్రయత్నాలను యూనివర్సిటి యాజమాన్యంతో పాటు విద్యార్ధులు అడ్డుకుంటున్నారు. వీళ్ళ ప్రయత్నాలకు బీఆర్ఎస్, బీజేపీలు మద్దతుగా నిలబడ్డాయి. దాంతో హెచ్సీయూ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి.
11 ఎకరాలపై కేసీఆర్ కన్ను
ఇపుడు హెచ్సీయూ భూములను రేవంత్ ప్రభుత్వం తీసుకోవటాన్ని తప్పుపడుతున్న బీఆర్ఎస్ ఒకపుడు ఉస్మానియా యూనివర్సిటి(ఓయూ) భూములపై కన్నేసింది. 2015 మేనెలలో ఓయూకు చెందిన 11 ఎకరాలను తీసుకోవాలని కేసీఆర్(KCR) డిసైడ్ అయ్యారు. పేదలకు డబుల్ బెడ్ రూము ఇళ్ళ నిర్మాణంకోసం ఓయూలోని 11 ఎకరాలను తీసుకుంటున్నట్లు స్వయంగా కేసీఆరే ప్రకటించారు. యూనివర్సిటీలకు వేలాది ఎకరాలు ఎందుకని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వ అవసరాలకు యూనివర్సిటీల భూములను తీసుకోవటంలో తప్పులేదని కేసీఆర్ అప్పట్లో వాదించారు. ఇపుడు రేవంత్ నిర్ణయాన్ని తప్పుపడుతు విద్యార్ధుల ఆందోళనలకు మద్దతిస్తున్న కేటీఆర్(KTR) ఆనాడు కేసీఆర్ నిర్ణయాన్ని సమర్ధించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉంటేమాత్రం యూనివర్సిటీల భూములను వాడుకోవచ్చు. అదే ప్రతిపక్షంలో ఉంటే యూనివర్సిటీల భూములను తీసుకోవటాన్ని తప్పుపడుతు ఆందోళనలు చేస్తుంది.
బంగారం కన్నా విలువైనదా ?
ఇపుడు రేవంత్ వేలంద్వారా అమ్మాలని అనుకుంటున్న 400 ఎకరాలు బంగారంకన్నా విలువైనవి. గచ్చిబౌలిలో ఎకరం ధర తక్కువలో తక్కువ రు. 50 కోట్లుంటుంది. వేలంలో మరింత ఎక్కువ ధరకు అమ్ముడుపోయినా ఆశ్చర్యంలేదు. అంటే 400 ఎకరాల ధర తక్కువలో తక్కువ సుమారు రు. 2 వేల కోట్లపై మాటే అనుకోవాలి. ఓయూ భూములను అమ్మాలని కేసీఆర్ ప్రయత్నించినపుడు కూడా పెద్దఎత్తున యూనివర్సిటి విద్యార్ధులు, ప్రతిపక్షాల నుండి వ్యతిరేకత వచ్చింది. దాంతో వేరేదారిలేక కేసీఆర్ తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మరిపుడు యూనివర్పిటి, విద్యార్ధులు, ప్రతిపక్షాల నుండి హెచ్సీయూ భూముల విషయంలో కూడా ఆందోళనలు మొదలయ్యాయి. మరి రేవంత్ ఏమిచేస్తారో చూడాలి.