వ్యవస్ధ పరువు తీసేస్తున్న ఐఎఎస్ లు
ముఖ్యమంత్రి కాళ్ళకు ఐఏఎస్ అధికారి మొక్కటంతో వేదికమీద ఉన్న వాళ్ళందరు ఒక్కసారిగా విస్తుపోయారు;
అఖిల భారత సర్వీసుల్లోని కొందరు అధికారులు వ్యవస్ధ పరువును తీసేస్తున్నారు. వ్యక్తిగత హోదాలో కొందరి ఓవర్ యాక్షన్ వల్ల మిగిలిన వాళ్ళందరు తలొంచుకోవాల్సోస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే నాలుగురోజుల క్రితం సంక్షేమ శాఖ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి శరత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth) కాళ్ళకు మొక్కటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అచ్చంపేట నియోజకవర్గంలోని మాచారం గ్రామంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని పూర్తిచేసుకుని వేదికనుండి దిగిపోయేటపుడు సడెన్ గా రేవంత్ కాళ్ళకు ఐఏఎస్ అధికారి శరత్(IAS officer Sarath) మొక్కాడు. ముఖ్యమంత్రి కాళ్ళకు ఐఏఎస్ అధికారి మొక్కటంతో వేదికమీద ఉన్న వాళ్ళందరు ఒక్కసారిగా విస్తుపోయారు.
ముఖ్యమంత్రి దృష్టిలో పడటానికో లేకపోతే తాను మీవాడినే అని చెప్పేందుకే ఇలా రేవంత్ కాళ్ళకు మొక్కాడన్న విషయం అర్ధమైపోతోంది. శరత్ చేసిన పనితో రేవంత్ కూడా బాగా ఇబ్బందిపడ్డాడు. అందుకనే మంగళవారం చీఫ్ సెక్రటరీ కే. రామకృష్ణారావు పెద్ద సర్క్యులర్ జారీచేశారు. అందులో అఖిలభారత సర్వీసు(ఏఐఎస్) అధికారులకు సీరియస్ వార్నింగ్ ఉంది. హుందాగా వ్యవహరించని అధికారులపై సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సుంటుందని చీఫ్ సెక్రటరీ గట్టి వార్నింగిచ్చారు. ఏఐఎస్ అధికారులకు, ఉద్యోగులకు వేర్వేరుగా మెమోలు జారీచేశారు. ఏఐఎస్ అధికారుతో పాటు ఇతర అధికారులు ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా వ్యవహరించాలి తప్ప చీపుగా వ్యవహరించవద్దని గట్టిగా చెప్పారు. శరత్ వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకునే చీఫ్ సెక్రటరీ ఈ సర్క్యులర్ జారీచేసినట్లు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.
సభలు, సమవేశాల్లో ఉన్నతాధికారులు ప్రవర్తించే తీరు ప్రజల్లో చెడుసంకేతాలను పంపకూడదని చీఫ్ సెక్రటరీ సూచించారు. ఏఐఎస్(కాండక్ట్)రూల్స్-1968లోని రూల్3(1) ప్రకారం ప్రతి ఏఐఎస్ అధికారి సంపూర్ణ సమగ్రతతో, విధిపట్ల అంకితభావంతో ఉండాలని సర్క్యులర్ గుర్తుచేసింది. నిబంధనలను ఉల్లంఘించిన వారు క్రమశిక్షణ చర్యలకు బాధ్యత వహించాల్సుంటుందని రామకృష్ణారావు మెమోలో స్పష్టంచేశారు. రేవంత్ కాళ్ళకు ఐఏఎస్ అధికారి మొక్కటమన్నది మొత్తం ఏఐఎస్ అధికారుల హోదాను కించపరచటం తప్ప మరోటికాదు. తనకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వ్యక్తిగత లబ్ది వస్తుందనో లేకపోతే రావాలనో ముఖ్యమంత్రి కాళ్ళకు శరత్ మొక్కటమన్నది వ్యవస్ధ హుందాతనాన్ని దిగజార్చటమనే చెప్పాలి. ఇలాంటి వాళ్ళ వల్ల మిగిలిన వారిపైన చులకనభావం ఏర్పడటం ఖాయం. ఈ ఎపిసోడ్ పైన బీఆర్ఎస్ నేతల నుండి ఎలాంటి కామెంట్లు రాలేదు.
ఎందుకు రాలేదంటే బీఆర్ఎస్(BRS) హయంలో కూడా వెంకట్రామరెడ్డి అనే ఐఏఎస్ అధికారి కలెక్టర్ గా పనిచేస్తున్నపుడు కేసీఆర్(KCR) కాళ్ళకు మొక్కారు కాబట్టే. మెదక్ లో జరిగిన ఓ కార్యక్రమం పూర్తవ్వగానే కేసీఆర్ కాళ్ళకు వెంకట్రామరెడ్డి మొక్కటం అప్పట్లో సంచలనమైంది. తర్వాత కేసీఆర్ కాళ్ళకు మొక్కినందకు తగిన ప్రతిఫలాన్ని వెంకట్రామరెడ్డి అందుకున్నారు. కొద్దిరోజుల తర్వాత వెంకట్రామరెడ్డి ప్రభుత్వ సర్వీసుకు రాజీనామా చేసి ఎంఎల్సీ అయ్యారు. తనకాళ్ళకు ఐఏఎస్ అధికారి మొక్కినందుకే కేసీఆర్ ఎంఎల్సీ పదవి ఇచ్చారా లేకపోతే ఇంకేదైనా కారణముందా అన్నది వాళ్ళే చెప్పాలి. ఎంఎల్సీ అయిన తర్వాత 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ ఎంపీగా బీఆర్ఎస్ తరపున పోటీచేసి ఓడిపోయారు. ఏఐఎస్ అధికారులు తమ వ్యక్తిగత అజెండాతోనే బహిరంగంగా ముఖ్యమంత్రుల కాళ్ళమీద పడుతున్నారన్నది వాస్తవం. అయితే తాము ముఖ్యమంత్రుల కాళ్ళమీద పడటంవల్ల మొత్తం ఆల్ ఇండియా సర్వీసు వ్యవస్ధ పరువును రోడ్డునపడేస్తున్నారు.
సర్వీసులో ఉంటూనో లేకపోతే రిటైర్ అయిన తర్వాతో కొందరు ఏఐఎస్ అధికారులు పార్టీల్లో చేరటం, టికెట్లు సాధించుకుని పోటీలు చేయటం చాలాసహజమే. ఈవ్యవహారమంతా తెరవెనుక చక్కబెట్టుకుని టికెట్లు సాధించుకున్నారు. దీనివల్ల మిగిలిన ఏఐఎస్ అధికారులకు జరిగే నష్టమేమీలేదు. కాని ఇలా బహిరంగంగా ముఖ్యమంత్రుల కాళ్ళకు ఏఐఎస్ అధికారులు మొక్కటమే చాలా అభ్యంతరకరం. అప్పట్లో వెంకట్రామరెడ్డి తన కాళ్ళకు మొక్కటాన్ని కేసీఆర్ బాగా ఎంజాయ్ చేసినట్లున్నారు. అందుకనే ఎలాంటి అభ్యంతరాలు లేదా హెచ్చరికలు చేయలేదు. కాని ఇపుడు శరత్ చేసిన పనికి రేవంత్ ఇబ్బందిపడినట్లున్నాడు అందుకనే చీఫ్ సెక్రటరీ నుండి మార్గదర్శకాలతో పెద్ద సర్క్యులర్ జారీఅయ్యింది.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రాజకీయనేతగా లేకపోతే ఎంఎల్ఏ, మంత్రి, ముఖ్యమంత్రి అవటానికి ప్రత్యేకించి విద్యార్హతలు ఏమీలేవు. కానీ ఏఐఎస్ అధికారి అవ్వాలంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కాని అవలేరు. కొందరు మొదటి అటెంప్ట్ లోనే ఏఐఎస్ అధికారులుగా ఎంపికైతే మరికొందరు కొన్నిసార్లు ప్రయత్నించిన తర్వాత కాని ఆల్ ఇండియా సర్వీసుకు ఎంపికకాలేరు. మొదటిసారే ఎంపికైనా, కొన్ని అటెంప్టుల తర్వాత ఎంపికైనా కష్టపడక తప్పదు. యూపీఎస్సీ(UPSC) పరీక్షలు పాసై ఇంటర్వ్యూను ఫేస్ చేసి సర్వీసుకు ఎంపికవ్వటానికి చాలామంది ఒక తపస్సులాగ కష్టపడతారు. అంతకష్టపడి చదివి, అన్నిరౌండ్లలో పరీక్షలను దాటుకుని ఫైనల్ ఇంటర్వ్యూలో ఎంపికైన తర్వాత కొందరు వ్యక్తిగత లబ్దిని ఆశించో లేకపోతే ఇంకదేనికైనా సరే ముఖ్యమంత్రుల కాళ్ళకు దణ్ణంపెట్టడం అన్నది మిగిలిన వాళ్ళకు చాలా ఇబ్బందికరమైన అంశమనే చెప్పాలి. అంతకష్టపడి చదివి ఏఐఎస్ సాధించింది చివరకు ముఖ్యమంత్రుల కాళ్ళకు మొక్కటానికా ? అని అందరు ఆశ్చర్యపోతున్నారు.