కుప్పంలో ఎయిర్ క్రాఫ్ట్ తయారీ యూనిట్

కుప్పంలో 12 పరిశ్రమల ఏర్పాటు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-08-30 14:39 GMT
సభలో మాట్లాడుతున్న సీఎం ఎన్. చంద్రబాబు

కుప్పంలో భారీ పరిశ్రమల ఏర్పాటు కోసం శనివారం ఎంఓయూలు కుదిరాయి. సీఎం ఎన్. చంద్రబాబు నుంచి ఆ సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలు అందుకున్నారు. ప్రధానంగా ఆపెల్ ఐఫోన్ ఛాసిస్ తయారు చేయడానికి హిండాల్కో 586 కోట్ల రూపాయలతో పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. దీనికి తోడు..

కుప్పంలో టూ సీటర్ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ యూనిట్ 150 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసేందుకు పయనీర్ క్లీన్ యాంప్స్ లిమిటెడ్ ఒప్పందం కుదిరింది. ఈ పరిశ్రమ వల్ల 250 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కుప్పంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటనలో శాంతిపురం మండలం పరమసముద్రం వద్ద హంద్రీనీవా కాలువలో ప్రవహిస్తున్న కృష్ణా జలాలకు హారతి ఇచ్చారు. ఆ తరువాత జరిగిన బహిరంభ సభలో ఆయన మాట్లాడారు.

"కుప్పంను పారిశ్రామిక చిత్రపటంలో అగ్రగామిగా నిలుపడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నా" అని సీఎం ఎన్. చంద్రబాబు చెప్పారు.
"నా నియోజకవర్గంలోని యువత, మహిళలకు విద్యావంతులుగా తీర్చిదిద్దడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగు పరచడానికి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నాను. తద్వారా ఎనిమిదిసార్లు గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటున్నా" అని ఆయన వ్యాఖ్యానించారు.
కుప్పం నియోజకవర్గానికి 12 పరిశ్రమలు తీసుకుని వచ్చినట్లు సీఎం చంద్రబాబు వివరించారు. ఈ పరిశ్రమల ప్రతినిధులు 3908 కోట్ల రూపాయలు పెట్టుబడులుపెడుతున్నారని ఆయన తెలిపారు. ఈ పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించిన తరువాత 15,600 మందికి ప్రత్యక్ష్యంగా ఉద్యోగాలు లభిస్తాయి. పరోక్షంగా 26, 581 మందికి ఉపాధి లభిస్తుందని ఆయన వివరించారు. పరిశ్రమలకు పునాది వేసే నాటి నుంచి పనులకు కూడా కొరత ఉండదని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
కుప్పం అభివృద్ధికి ఎంఓయూలు

1. కుప్పం పరిధిలో వ్యర్ధాల నుంచి సంపద కార్యక్రమం అమలు కోసం ఏజీఎస్- ఐటీసీతో ఒప్పందం
2. వ్యర్ధాల సుస్థిర నిర్వహణపై ఇంటింటి ప్రచారం, పాఠశాలల్లో అవగాహనా కార్యక్రమాలను 15 ఏళ్ల పాటు నిర్వహించేలా ఒప్పందం
3. కుప్పంలో మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయటం, మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్ అంశాలపై షీలీడ్స్ సంస్థతో ఒప్పందం
4. కుప్పం నియోజకవర్గంలో 10వేల మంది మహిళల్ని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయటంతో పాటు గ్రామీణ మార్కెట్లను అందిపుచ్చుకునేలా శిక్షణ ఇచ్చేందుకు ఎంఓయూ
6. కుప్పంలో ఫైబర్ బోర్డు ఉత్పత్తి కోసం కింగ్స్ వుడ్ డెకార్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఎంఓయూ కుదిరింది. ఈ సంస్థ రూ.1,100 కోట్ల పెట్టుబడితో మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డును కింగ్స్ వుడ్ సంస్థ ఉత్పత్తి చేయనున్నది. ఈ యూనిట్ ఏర్పాటు వల్ల 2,012 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
7. కుప్పంలో టూ సీటర్ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు పయనీర్ క్లీన్ యాంప్స్ లిమిటెడ్ ఒప్పందం కుదిరింది. రూ.150 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 70 నుంచి వంద మందికి శిక్షణకు ఉపయోగించే టూ సీటర్ విమానాలను పయనీర్ యాంప్స్ లిమిటెడ్ సంస్థ తయారు చేయనున్నది. ఈ పరిశ్రమ వల్ల 250 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.
8. బెంగుళురుకు చెందిన స్పేస్ టెక్నాలజీ సంస్థ ఎత్రెయాల్ ఎక్ప్ ప్లోరేషన్ గిల్డ్ సంస్థతో అవగాహనా ఒప్పందం కుదిరింది.
9. మీడియం లిఫ్ట్ లాంచింగ్ రాకెట్ రేజర్ క్రెస్ట్ ఎంకె-1 తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎత్రెయాల్ సంస్థ అవగాహనా ఒప్పందం చేసుకున్నది. 500 కోట్ల పెట్టుబడితో చేపట్టే ఈ ప్రాజెక్టు మూడు దశల్లో పనులు పూర్తి చేసి, 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆస్కారం ఉంది.
10. అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ ఏర్పాటు చేసేందుకు రెడ్ బెర్రీ ఫుడ్ లాజిస్టిక్స్ తో ఒప్పందం కుదిరింది. రూ. 300 కోట్ల పెట్టుబడితో 15 వేల మందికి ఉపాధి కల్పించేందుకు రెడ్ బెర్రి ఫుడ్ లాజిస్టిక్స్ సంస్థ ప్రతినిధులు ప్రతిపాదన సమర్పించారు. ఈ సంస్థ ద్వారా కుప్పం ప్రాంతంలో మామిడి, జామ, టమాట పల్పింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులకు ఈ పరిశ్రమల వల్ల మేలు జరుగుతుందని సీఎం చంద్రబాబు వివరించారు.
Tags:    

Similar News