ఉచిత బస్సు ప్రయాణం తొలిరోజు అనుభవం ఎలా ఉందంటే...

3 గొడవలు 6 ఫిర్యాదులతో సాగిన తొలిరోజు ఉచిత బస్సు..;

Update: 2025-08-16 12:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో స్త్రీశక్తి పథకం కింద అమల్లోకి వచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తొలి రోజు చాలా అనుభవాలు తెలిసివచ్చాయి. ఈ పథకంపై అవగాహన లేని మహిళా ప్రయాణికులు చాలా చోట్ల కండక్టర్లతో, డ్రైవర్లతో ఘర్షణలకు దిగారు. జంగారెడ్డిగూడెం వంటి అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో మహిళా ప్రయాణీకులు డ్రైవర్లతో గొడవ పడి శాపనార్థాలు పెట్టారు. మరికొన్ని చోట్ల ప్రయాణీకులు కూటమి నేతలకు ఫిర్యాదులు చేశారు. దీంతో కొంత గందరగోళం నెలకొంది. ఏజెన్సీ ప్రాంతాలలో నడిచే బస్సులలో ఏ బస్సులో ఫ్రీ టికెట్ ఉంటుందో తెలియక ఇబ్బందులు పడ్డారు.
ఇప్పటికే అంతర్రాష్ట్ర బస్ సర్వీసులకు, తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్లే బస్సుల్లో ఫ్రీ టికెట్ లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఏలూరు ఏజెన్సీ ప్రాంతం తెలంగాణ సరిహద్దుల్లో ఉండడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారు. అలాగే తిరుపతిలో, కుప్పంలో, అనంతపురంలో కూడా మహిళా ప్రయాణీకులు ఇక్కట్లను ఎదుర్కొన్నారు. వీళ్లకి సర్దిచెప్పడానికి కండక్టర్లు ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని చోట్ల ఫలితం లేకపోయింది. రాష్ట్రం అంతటా ఉచిత ప్రయాణం అన్నప్పుడు అన్ని చోట్లకు అనుమతించాలి కదా అనేది మహిళల ఆక్రోశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల వరకే ఉచితమని, సరిహద్దు దాటితే టిక్కెట్ కొనాల్సిందేనని కండక్టర్లు చెప్పినా మహిళలు సమాధానపడలేదు.
ఉదాహరణకు జంగారెడ్డిగూడెంలో భద్రాచలం బస్సు ఎక్కితే అది కొంచెం దూరం ఏపీలో ప్రయాణించిన తర్వాత తెలంగాణలో ప్రవేశిస్తుంది. ఉచిత బస్సు ప్రయాణం అక్కడి వరకే అనుమతిస్తారు. ఆ తర్వాత టికెట్ కొనాల్సిందేనని కండక్టర్లు చెబుతున్నారు. ఈ తరహా బస్సుల్ని అంతర్రాష్ట్ర సర్వీసులుగా గుర్తించారు. దాంతో వాటిలో ఫ్రీ లేదని అధికారులు చెబుతున్నారు. జంగారెడ్డిగూడెం డిపో నుంచి వేలేరుపాడు కుక్కునూరు, మండలాలకు వెళ్లే సర్వీసులన్నీ.. తెలంగాణ నుంచే వెళ్లడంతో స్థానికల్లో అయోమయం ఏర్పడింది. జంగారెడ్డి గూడెం నుంచి భద్రాచలం వెళ్లే బస్సుకి ఫ్రీ టికెట్ లేదని జంగారెడ్డిగూడెం బస్ డిపో డీఎం తెలిపారు. ఈ విషయమే జంగారెడ్డిగూడెం బస్ డిపో డీఎంతో జనసేన నాయకుడి ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అదే విధంగా అశ్వరావుపేట షటిల్ సర్వీస్‌ ఫ్రీ టికెట్ వర్తించదని డీఎం చెబుతున్నారు. దాంతో జంగారెడ్డిగూడెం నుంచి వేగవరం, తాడువాయి, దర్భ గూడెం జీలుగుమిల్లి వెళ్లే ప్రయాణికులకు స్త్రీ శక్తి ఎలా ఉపయోగపడుతుందనే అనుమానం నెలకొంది.
మరోవైపు, రాష్ట్ర వాప్తంగా మహిళలందరికి ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీలు ఇచ్చిన కూటమి సర్కార్‌.. ఆచరణలో ఆంక్షలు పెట్టడంపై మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
తిరుపతి-తిరుమలకు వెళ్లే బస్సులో యాత్రికులకు షరతులు పెట్టారు. ఉచిత పథకం అమలు చేయాలని మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు. కుదరదని అధికారులు తేల్చిచెబుతున్నారు.
కొన్ని సందర్భాలలో పిల్లలకు ఆధార్ కార్డు విషయంలోనూ మహిళలు గొడవకు దిగారు. చిన్నప్పుడు ఎప్పుడో తీసుకున్న ఆధార్ కార్డులో ప్రస్తుతం ఆనవాళ్లు సరిగా పోల్చలేకపోవడం కూడా వివాదాలకు కారణం అవుతోంది. ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోమని సలహా ఇస్తున్నారు.
మరికొన్ని చోట్ల మహిళలు సంచుల్లో కోళ్లు తీసుకురావడం కూడా వివాదాలకు కారణమైంది. ఓ చెంచుగూడెం నుంచి ఓ మహిళ తిరుపతికి బస్సులో సంచిలో కోడిని తెచ్చుకున్నారు. కండక్టర్ అభ్యంతరం చెప్పడంతో ఆమె దిగిపోవాల్సి వచ్చింది.
ఆధార్ కార్డు, ఓటరు కార్డు, పాన్ కార్డులను బస్సుల్లో అనుమతిస్తున్నారు. పల్లె వెలుగు బస్సుల్లో, అంతర్రాష్ట్ర బస్సుల్లో, తిరుపతి-తిరుమల బస్సుల్లో ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి.
ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలకు అవగాహన కల్పించేలా కరపత్రాలు, బస్టాండుల్లో బోర్డులు పెట్టాలని ప్రయాణీకుల సంఘం కోరింది.
Tags:    

Similar News