వరదలు వస్తున్నా 17 శాతం లోటు వర్షపాతం

సాగునీటి సంఘాలు, జిల్లా కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.;

Update: 2025-08-14 14:25 GMT

వరదలు వస్తున్నా.. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షాభావ పరిస్థితులున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నీటి వనరులను పూర్తి స్థాయిలో సంరక్షించిన్పపుడే భూగర్భజలాలు పెరుగుతాయని అన్నారు. రాష్ట్రంలో 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి సాగు నీటి సంఘాలు, జిల్లా కలెక్టర్లు, అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి నిర్వహణ, చివరి భూములకు నీరందించడం, సమర్థ నీటి వినియోగం వంటి అంశాలపై చర్చించారు.

సమర్ద నీటి నిర్వహణతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటిని నిల్వ చేసుకోగలిగాం. రిజర్వాయర్లు, బ్యారేజీల్లో మొత్తంగా కలిపి 82.29 శాతం మేర నింపుకోగలిగాం. ఎగువన నుంచి వస్తున్న వరదతో పాటు.. రాష్ట్రంలో పడుతున్న వర్షపు నీటిని సమర్ధంగా రిజర్వాయర్లకు మళ్లించడంలో ప్రభుత్వం సక్సెస్‌ అయింది. హంద్రీ–నీవా ద్వారా రాయలసీమలో ప్రాజెక్టులు నింపాం. ఇకపై వెలుగోడు, ఉత్తరాంధ్ర, గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులపై దృష్టి సారిస్తాం. నీటిని ఒడిసి పట్టి ప్రాజెక్టులను ఏ విధంగా నింపామో.. ఇదే విధంగా గ్రామాల్లోని చెరువులను కూడా నీటితో నింపుకోవాలి. సాగు నీటి కాల్వలను, పంట కాల్వలను పరిరక్షించుకోవాలి. చెరువులు, కాల్వలను పరిరక్షించే పనుల్లో సాగు నీటి సంఘాలు భాగస్వామ్యం కావాలి. రైతుల భాగస్వామ్యం కోసమే సాగునీటి సంఘాలు పెట్టామని పేర్కొన్నారు.

కృష్ణా, గోదావరి నదుల్లో పెద్ద ఎత్తున నీరు సముద్రంలోకి వెళ్తోంది. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి నీరు చేరేలా చూడాలి. ప్రతి ఎకరాకు నీరు అందించేలా నీటి నిర్వహణ చేసుకోవాలి. మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకులను పూర్తిగా నింపుకోవాలి. రాష్ట్రంలో మొత్తంగా 38 వేల మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకుల ద్వారా భారీ ఎత్తున నీటిని నిల్వ చేసుకోవచ్చు. రైతుల కోసం, నీటి నిర్వహాణ, పరిరక్షణ కోసం సాగునీటి సంఘాల వ్యవస్థను ఏర్పాటు చేశాం. దీన్ని అదే స్పూర్తితో సాగునీటి సంఘాలు పని చేయాలి అని చంద్రబాబు సూచించారు.

రాష్ట్రంలో చెరువులు, కాల్వలు, చెక్‌ డ్యాముల పరిస్థితిని సాగు నీటి సంఘాలు పరిశీలించాలి. సాగునీటి సంఘాలకు ఆయకట్టు ప్రాంతాలే కాకుండా.. క్యాచ్మెంట్‌ ఏరియా బాధ్యతలను అప్పగిస్తాం. నీటి వనరుల సంరక్షణ నిమిత్తం ఏమైనా చర్యలు తీసుకోవాల్సి వస్తే.. అధికారులతో సమన్వయం చేసుకోవాలి. వచ్చే 10–15 రోజుల్లోగా చెరువలకు, కాల్వలకు, చెక్‌ డ్యాములకు మరమ్మత్తులు చేయాల్సి వస్తే త్వరితగతిన పూర్తి చేయాలి. వర్ష కాలంలో పడే నీటిని చెరువుల్లో నింపాలి. కాల్వల్లో పూడిక తీయాలి, పంట కాల్వల నిర్వహణ సరిగా ఉండాలి, వరద నీటి పారుదలకు ఇబ్బంది లేకుండా కాల్వల నిర్వహణ చేపట్టాలి అని సూచించారు.
చెరువులు, కాల్వలను ఏర్పాటు చేసుకోవడం ఎంత ముఖ్యమో.. నిర్వహరణ చేపట్టడమూ అంతే ముఖ్యం. గత ప్రభుత్వంలో కనీసం షట్టర్లు, గేట్ల నిర్వహణ కూడా సరిగా చేయలేదు. కాంట్రాక్టర్లు వాటిని సరి చేయడానికి ముందుకు రాలేదు. అలాంటి పరిస్థితి ఎప్పుడూ ఉండకూడదు. షట్టర్ల రిపేర్లు అనే మాటే ఉండకూడదు. అన్ని చెరువులు, లాకులు, కాల్వలు చెక్‌ చేసుకోవాలి. అవి సరిగా పని చేస్తున్నాయా లేదా అనేది కూడా చూడాలి. నీటి నిర్వహణపై జిల్లాల వారీగా రేటింగ్స్‌ ఇస్తాం. ఇరిగేషన్‌ శాఖలోని ఇంజనీరింగ్‌ వ్యవస్థను రీ–ఆర్గనైజ్‌ చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో మొత్తంగా 40 లక్షల ఎకరాల బోర్‌ వెల్స్‌ మీద ఆధారపడ్డాయి. రాష్ట్రంలోని 19 లక్షల బోర్లు ఉంటే.. వాటి కోసం రూ. 8250 కోట్లు విద్యుత్‌ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. భూగర్భజలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే ఇందులో 50 శాతం ఖర్చును తగ్గించుకోవచ్చు. వర్షాకాలంలో ముందు భూగర్భ జలాలు మూడు మీటర్ల లోతున అందుబాటులో ఉండాలి. వర్షాకాలం తర్వాత ఎనిమిది మీటర్లకు తగ్గకుండా చూడాలి. ఈ విధంగా నీటిని సమర్థవంతంగా నిర్వహించుకుంటే కరవు నివారణ అనేదే ఉండదు. సాగు నీటి సంఘాలు అంటే నీటిని తీసుకోవడమే కాదు.. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు వంటి అంశాల పైనా సాగునీటి సంఘాలు బాధ్యత తీసుకోవాలి అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Tags:    

Similar News