గ్రూప్–1 మెయిన్స్‌లో 1:100 పద్దతిని పాటించాలి
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గ్రూప్స్ పరీక్షల గురించి స్పందించారు. అభ్యర్థుల ఆవేదనను అర్థం చేసుకోవాలని సీఎంను కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే గ్రూప్–1 మెయిన్స్ అభ్యర్థుల ఎంపికలో 1:100 పద్ధతిని అనుసరించాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీ సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. గ్రూప్–2, డిప్యూటీ ఈవో పోస్టుల ఎంపికలో అనుసరించిన 1:100 విధానాన్నే, గ్రూప్–1 మెయిన్స్ అంశంలోను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ విషయంమీద అభ్యర్థులు గత కొద్ది రోజులుగా తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారని, దీనిపైన అభ్యర్థులకు భరోసా ఇవ్వాలని ఆమె కోరారు. జీవో ఎంఎస్ నంబర్ 5 ప్రకారం 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసే అధికారం ఏపీపీఎస్సీకి ఉంది. ఆ అధికారాన్ని ఉపయోగించి 1:100 రేషియో ప్రకారం అవకాశం ఇవ్వమని అభ్యర్థులు అడగడంలో న్యాయం ఉందని తెలిపారు.
గ్రూప్–1లో 89 పోస్టులకు మీరు ఇచ్చిన 1:50 రేషియో ద్వారా 4450 మంది మెయిన్స్‌కి అర్హత పొందారు. అదే 1:100 రేషియో లెక్కన పిలిస్తే మరో 4450 మందికి అవకాశం దక్కుతుందని, ఆ ప్రకారం ఎంపిక చేయాలని అభ్యర్థులు ఆశ పడుతున్నారని వెల్లడించారు. గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షల మధ్య సమయం తక్కువగా ఉండటం, సిలబస్ మధ్య వ్యత్యాసం ఉండటం, కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్‌లోనే పరీక్షలు నిర్వహించడం వంటి అనేక కారణాలతో నష్టపోయామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్ 1 ఉద్యోగాలు పోతే, ఇప్పట్లో ఇక నోటిఫికేషన్ ఉండదని అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌ను కలిసి విజ్ఞప్తి చేసినా ప్రభుత్వానికి పట్టింపు లేదంటూ ఆవేదన చెందుతున్నారని, మెయిన్స్ షెడ్యూల్ విడుదల కాకముందే అభ్యర్థుల విజ్ఞప్తులను పరిశీలించి, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.