తిరుమల: 31న దీపావళి ఆస్థానం.. ఆ రోజు ఆర్జిత సేవలు రద్దు

శ్రీవారి సన్నిధిలో 31న దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ఆ ముందు రోజు వీఐపీ లేఖలు అనుమతించరు. ఆర్జిత సేవలు రద్దు చేశారు. దీపావళి ఆస్థానం విశిష్టత ఏమిటంటే...

Update: 2024-10-28 04:53 GMT

తిరుమలలో సామాన్య భక్తులకు మాత్రమే ఒక రోజు శ్రీవారి దర్శనం పరిమితం కానుంది. దీపావళి పండుగ నేపథ్యంలో నిర్వహించనున్న ఆస్థానం వల్ల ఈ నెల 31వ తేదీ వీఐపీ (VIP) బ్రేక్‌ దర్శనాలను టీటీడీ (TTD)రద్దు చేసింది. ఆర్జీత సేవలను కూడా రద్దు చేశారు. ఆ రోజు ప్రొటోకాల్ (Protocal) ప్రముఖులను మినహాయించి, వీఐపీ సిఫారసు దర్శనాలకు అవకాశం ఉండదు. దీంతో 30వ తేదీ సిఫారసు లేఖలను అనుమతించరు. టీటీడీ ఈ విషయం స్పష్టం చేసింది. తోమాల, అర్చన సేవలను కూడా ఏకాంతంగా నిర్వహిస్తారు.

తిరుమలలో ఉదయం నుంచి ప్రారంభమయ్యే శ్రీవారి దర్శనానికి ఒక రోజు ముందు దరఖాస్తు చేసుకోవాలి. దీనివల్ల మరుసటి రోజు వేకువజాము నుంచి ప్రారంభమయ్యే దర్శనాలకు టికెట్లు జారీ చేయడం సాధారణంగా జరిగే కార్యక్రమం. అయితే, 31వ తేదీ తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామి సన్నిధిలో దీపావళి (Divali) ఆస్థానం నిర్వహించనున్న కారణంగా అంతకుముందు రోజు అంటే 30 తేదీ సిఫారసు లేఖలను స్వీకరించడం లేదని టీటీడీ స్పష్టం చేసింది. దీంతో వీఐపీ సిఫారసు కోటాలో లేఖలపై టికెట్లు జారీ చేయరు. ప్రొటోకాల్ అధికారులు, వీఐపీలకు మాత్రమే నిర్దిష్ట సమయంలో శ్రీవారి దర్శనానికి అవకాశం ఉంటుంది. ఆ మేరకు టీటీడీ పౌర సంబంధాల విభాగం ప్రకటన కూడా జారీ చేసింది. ఏటా నాలుగు సందర్భాల్లో మాత్రమే తిరుమలలో శ్రీవారి దర్శనం కేవలం సామాన్య భక్తులకు పరిమితం అవుతుంది. అందులో తాజాగా ఈ నెల 31వ తేదీ దీపావళి పర్వదినం సందర్భంగా సామాన్య భక్తులకు మాత్రమే ఆ అవకాశం కలిసి వచ్చింది.
దీపావళి ఆస్థానం అంటే....
దీపావళి పండుగ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో 31వ తేదీ విశిష్ట దీపావళి ఆస్థానం టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి (Golden driveway) ముందు ఘంటా మండపంలో అర్చకులు దీపావళి ఆస్థానం నిర్వహిస్తారు. ఆలయ ప్రధాన అర్చకులు, జీయంగార్లు టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో ఆ కార్యక్రమం నిర్వహిస్తారు. దీంతో ఆ రోజు ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు.
అంతకుముందు...
శ్రీవారి మూలమూర్తి, ఉత్సవమూర్తులను కొత్త పట్టువస్త్రాలతో అలంకరిస్తారు. అనంతరం శ్రీవారికి రూపాయి హారతి, ప్రత్యేక, నిత్య హారతులు సమర్పిస్తారు. తరువాత ఉభయదేవేరులతో పాటు మలయప్పస్వామివారిని అలంకరించి వేంచేపు చేస్తారు. బంగారు వాకిలికి అభిముఖంగా ఉన్న ఘంటా మండపం వద్ద ఏర్పాటు చేసే సర్వభూపాల వాహానంపై గరుడాళ్వారుకు అభిముఖంగా స్వామివారి ఉత్సవ మూర్తులను (Festival idols) ఆశీనులను చేస్తారు. స్వామివారి సేనాధిపతి విష్వక్సేనుడు కూడా ఎడమపక్క మరో పీఠంపై అర్చకులు ఆశీనులను చేస్తారు. ఆ తరువాత స్వామివారి ఉత్సవ విగ్రహాలకు అర్చకులు ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలు సమర్పిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది. తరువాత భక్తులను ఆలయంలోని శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.
అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఉభయ దేవేరులతో కలిసి మలయప్పస్వామి సహస్రదీపాలంకరణ సేవలో సేదదీరుతారు. ఆ తరువాత ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ, భక్తులను కటాక్షిస్తారు. ఈ పర్వదినం నేపథ్యంలో టీటీడీ ఆర్జిత సేవలను కూడా రద్దు చేసింది.
"దీపావళి పండుగ విశిష్టతను వివరించడం ప్రత్యేకత. సర్వమానవాళి శ్రేయస్సు కోసం ప్రార్ధించడం ఈ ఆస్థానం ఉద్దేశం" ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రధాన అర్చకులతో పాటు, జీయంగార్లు, ఉన్నతాధికారులు భక్తులు, మనవాళి సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ, దీపావళి ఆస్థానంలో శ్రీవారిని వేడుకుంటూ పూజాలు చేస్తారు.
Tags:    

Similar News