రండి బాబూ రండీ.. ఒక్కో ఉద్యోగం రూ.3 లక్షలే!

బందరు ఎంపీ బాలశౌరీ మనిషినంటూ ఉద్యోగాల పేరిట నగదు వసూలు, బాలశౌరి ఇంటి ఎదుట బాధితుల ధర్నా;

Update: 2025-08-02 12:51 GMT
బాలశౌరి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్న బాధితులు
కృష్ణా జిల్లా, మచిలీపట్నం లోక్ సభ సభ్యుడు బాలశౌరి మనిషినంటూ ఉద్యోగాలకు 'వేలం పాట' పెట్టారు. తీరా ఆ విషయం బయటపడే సరికి పరారయ్యాడు. ఆగస్టు 2న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఎంపీ బాలశౌరి కార్యాలయంలో గోపాల్ సింగ్ అనే వ్యక్తి ఉన్నారు. ఆయన మహా తెలివైన వాడు, అందరికీ తల్లో నాలుకలా ఉండేవారనే పేరుంది. ఆ నమ్మకాన్నే పెట్టుబడిగా మార్చి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఓ వందమందిని వంచించి పారిపోయినట్టు మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు అందింది. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
గోపాల్‌ సింగ్‌ దాదాపు 100 మంది నుంచి నగదు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.3 లక్షల చొప్పున 3 కోట్ల రూపాయలు వసూలు చేసుకుని పరారయ్యారు. తాను బాలశౌరి పీఏనని, మచిలీపట్నంలోని మెడికల్‌ కళాశాల, కృష్ణ యూనివర్సిటీ, విద్యుత్ ‌శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశాడు.
డబ్బులు ఇచ్చినవారికి అనుమానం రాకుండా గోపాల్‌ సింగ్‌- నకిలీ (ఫేక్‌) అపాయింట్‌మెంట్‌ లెటర్లు కూడా బాధితులకు ఇచ్చాడు. లెటర్లు వచ్చినా, ఉద్యోగం రాకపోవడంతో అనుమానం వచ్చి.. బాలశౌరి కార్యాలయానికి చేరుకొని అక్కడున్న మిగతా వారిని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది.
బాధితులు ఎక్కువ మంది అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, గుడివాడ ప్రాంతాలకు చెందిన వారే. దీంతో బాధితులు అందరూ- తమకు న్యాయం చేయాలంటూ మచిలీపట్నంలోని బాలశౌరి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో తాము సంపాదించిన డబ్బులు గోపాల్‌ సింగ్‌కు ఇచ్చామని బాధితులు చెబుతున్నారు. ఎంపీయే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News