లిక్కర్ స్కాంలో పట్టుబడిన కరెన్సీ నోట్ నెంబర్లను ఎందుకు నోట్ చేయాలేదు? అని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం సృష్టించిన లిక్కర్ స్కాంలో తాజాగా పట్టుబడినట్లు చెబుతున్న రూ.11 కోట్లు స్వాధీనం చేసుకున్న విషయంలో సిట్ అధికారులు వ్యవహరించిన తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని ఆయన ఆరోపించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పట్టుబడిన రూ. 11 కోట్ల సొమ్ముకు, కూటమి ప్రభుత్వం తెరపైకి తెచ్చిన లిక్కర్ స్కాంకు సంబంధాన్ని చూపించడంలో సిట్ అధికారులు పంచనామా రికార్డులో సరైన ప్రొసీజర్స్‌ను పాటించలేదని విమర్శించారు.
లేని స్కాంలో ఆధారాలను సృష్టించే క్రమంలో సిట్ అధికారులు తప్పుపై తప్పు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సిట్ స్వాధీనం చేసుకున్న సొమ్ముకు సంబంధించి కరెన్సీ నెంబర్లను రికార్డు చేయాలని, ఆ డబ్బును బ్యాంక్‌లో మిగిలిన కరెన్సీతో కలపకుండా ప్రత్యేకంగా ఉంచాలంటూ ఏసీబీ కోర్ట్ ఉత్తర్వులు జారీ చేయడంతో సిట్ అధికారుల్లో కలవరం మొదలైందని విమర్శించారు.
హైదరాబాద్‌లోని సులోచనా ఫార్మ్ ఫాంహౌస్‌లో 2024 జూన్‌లో రాజ్ కసిరెడ్డి దాచిపెట్టిన లిక్కర్ స్కాంకు సంబంధించిన రూ. 11 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా సిట్ అధికారులు ప్రకటించారు. పట్టుబడిన నగదును కోర్ట్‌కు సమర్పించారు. సిట్ ఆరోపణలపై ఈ కేసులో నిందితుడుగా ఉన్న రాజ్ కసిరెడ్డి ఈ సొమ్ము తనకు చెందినది కాదని న్యాయస్థానానికి స్పష్టం చేశారు. సదరు ఫాం హౌస్ యజమానులుగా ఉన్న తీగల విజయేందర్‌రెడ్డికి ఇంజనీరింగ్ కాలేజీలు, దేశ వ్యాప్తంగా డయాగ్నసిస్ సెంటర్లు, ఆసుపత్రులు ఉన్నాయి.
అంతేకాకుండా వారికి వందల కోట్ల రూపాయల టర్నోవర్ చేసే వ్యాపారాలు ఉన్నాయి. వారు తనకు బినామీలు అని సిట్ ఆరోపించడం అన్యాయమంటూ ఆయన కోర్ట్ దృష్టికి తీసుకువచ్చారు. నలబై అయిదేళ్ళకు పైగా వారు వ్యాపారాలు నిర్వహిస్తుంటే, నలబై ఏళ్ళ వయస్సు ఉన్న నాకు వారు బినామీలు అని చెప్పడం ఎంత వరకు సమంజసమని రాజ్ కసిరెడ్డి ప్రశ్నించారు. వారి ఆస్తులను కూడా నావిగా చిత్రీకరించడం బాదాకరణమని తన ఆవేదనను న్యాయస్థానం ముందుంచారని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.
ఒక పక్క హైదరాబాద్‌లో పట్టుబడిన రూ.11 కోట్లు కూడా వరుణ్‌కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పట్టుకున్నామని సిట్ అధికారులు చెబుతున్నారు. లిక్కర్ స్కాంపై 23.9.2024న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వరుణ్ కుమార్ అనే వ్యక్తిపై 21.12.2024న కేసు నమోదు చేశారు. విట్‌నెస్ కింద నోటీస్ ఇచ్చి వాగ్మూలం రికార్డు చేశారు. దీనినే కోర్ట్‌కు సమర్పించారు. దీనిలో తీగల విజయేందర్‌రెడ్డి, తీగల బాల్ రెడ్డిని కూడా 17.4.2025న సాక్షులుగా పిలిచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఆరోజు విచారించిన దర్యాప్తు అధికారులే నేటికీ సిట్ లో కొనసాగుతున్నారు.
మరో పక్క ఆ నాడు విచారణ సందర్భంగా ఈ డబ్బు విషయం ఎక్కడా సిట్ రికార్డుల్లో ప్రస్తావించలేదని, అదే దర్యాప్తు అధికారి వరుణ్ కుమార్‌ను విచారిస్తే ఈ సొమ్ము బయటపడిందని తాజాగా చెప్పడం వెనుక కుట్ర కోణం ఉందని, గతంలో అదే వ్యక్తులను విచారించినప్పుడు ఈ డబ్బు ప్రస్తావన ఎందుకు రాలేదు? రాజ్ కసిరెడ్డి బెయిల్ విచారణ దశలో ఉండగా ఇది ఎలా బయటపడింది? అని ఆయన నిలదీశారు. ఏ4 కాగితాలు పెట్టే బాక్స్‌ల్లో కొత్తకొత్త నోట్లతో ఈ సొమ్ము దొరికిందని చెబుతున్నారు. అయితే ఏసీబీ కేసుల్లో ఎవరినైనా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటే.. ప్రతి నోట్‌పైనా ఉన్న నెంబర్‌ను రికార్డు చేయడంతో పాటు వాటిని కోర్ట్‌కు సమర్పిస్తారు. కానీ ఈ కేసులో మాత్రం అలా చేయలేదు.
పట్టుబడిన కరెన్సీ నోట్ నెంబర్లను ఎందుకు నోట్ చేయాలేదు? వీడియో ఫుటేజీని ఎందుకు రికార్డు చేయలేదు? అలాగే సులోచనా ఫార్మ్ ఫాంహౌస్‌లో 2024 నుంచి సీసీకెమేరా ఫుటేజీని ఎందుకు సేకరించలేదు? అని ఆయన ప్రశ్నించారు. వీటిపైన అనేక అనుమానాలు కలుగుతున్నాయని, ఈ కేసులో నిందితులకు బెయిల్ రానివ్వకుండా చేయడానికి చేస్తున్న కుట్ర అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆయన వ్యాఖ్యలు చేశారు.
విజయేందర్ రెడ్డిని బెదిరించి వారికి చెందిన వ్యాపార సంస్థల నుంచి తెచ్చిన డబ్బును పట్టుకున్నారా? లేక ప్రభుత్వమే ఒక ప్లాన్ ప్రకారం ఆ సొమ్మును సమకూర్చి కేసును పక్కదోవ పట్టిస్తోందా? వంటి అనేక అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. బ్యాంక్ వద్ద పోలీసులు రాత్రి నుంచే భారీ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారని, రాత్రే బ్యాంకుకు జమ చేసినట్లుగా కూడా తెలుస్తోందని, ఆ కరెన్సీపై విచారణ జరిగితే నిజాలు బయటకు వస్తాయని సిట్ అధికారులు కంగారు పడుతున్నారా? అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటిల్లోను సిట్ బృందం వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.