అందుకే రాష్ట్రాల మధ్య వివాదాలు వస్తున్నాయి

చంద్రబాబు విజన్‌ గురించి గతంలో వినేవాళ్లం.. ఇప్పుడు చూస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు.;

Update: 2025-08-02 16:16 GMT

ప్రతీ ఏటా వేల టీఎంసీల గోదావరి వరద నీరు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని, భారత దేశంలో నీటి కొరత అనే సమస్య లేదని, అయితే నీటి నిర్వహణే అతి పెద్ద సమస్యగా మారిందని, అందువల్లే రాష్ట్రాల మధ్య వివాదాలు వస్తున్నాయని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం ఆయన రూ. 5,233 కోట్ల విలువైన జాతీయ రహదారులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ.. దేశ ప్రగతిలో నీరు, విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్‌ అనేవి కీలక పాత్ర పోషిస్తాయని, ఏ దేశంలో అయితే షిప్పింగ్, పోర్టులు, రోడ్లు డెవలప్‌ అవుతాయో ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు సీఎం చంద్రబాబు వంటి విజన్‌ ఉన్న నాయకుడు ఉన్నారని, ఆయన నేతృత్వంలో ఏపీ అన్ని రంగాల్లో వేగంగా దూసుకుపోతోందని అన్నారు. ఒకప్పుడు చంద్రబాబు విజన్‌ గురించి వినేవాళ్లమని, ఇప్పుడు చూస్తున్నామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఎప్పుడూ భవిష్యత్‌ గురించే ఆలోచనలు చేస్తుంటారని కితాబిచ్చారు.
భారత దేశ జీడీపీలో అగ్రికల్చర్‌ సెక్టార్‌ వాటా 12 శాతమని, అది 22 శాతానికి పెరగాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత దేశం ఎదుగుతోందని, కొద్ది కాలంలోనే జపాన్‌ను అధిగమించామని, మన కంటే అమెరికా, చైనాలు ముందున్నాయని అన్నారు. మన దేశంలోని రైతులు మోదీ ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ను తయారు చేస్తున్నారని అన్నారు. భారత దేశంలో ఇథనాల్‌ వల్ల లక్షల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయని, రానున్న రోజుల్లో రైతులు తయారు చేసే ఇంధనంతోనే విమానాలు నడుస్తాయన్నారు. ఈవీ వాహనాల తయారీ చాలా వేగంగా పెరుగుతోందని, ఇథనాల్, మిథనాల్, సీఎన్‌జీ, బయో డీజిల్‌ వినియోగం కూడా శరవేగంగా పెరుగుతోందన్నారు. భారత దేశంలో కాలుష్య రహితమే లక్ష్యంగా వంద శాతం ఇథనాల్‌తో నడిచే వాహనాలు రావాలని గడ్కరీ అన్నారు.
అభివృద్ధికి, నాగరికతకు రహదారులు ప్రధాన చిహ్నమని సీఎం చంద్రబాబు అన్నారు. నితిన్‌ గడ్కరీకి అంకితభావం, చిత్తశుద్ది ఎక్కువని, అందుకే ఆయన తలపెట్టిన ప్రతీ ప్రాజెక్టును పూర్తి చేసిన నాయకుడు నితిన్‌ గడ్కరీ అని, పోలవరం ప్రాజెక్టుకు నితిన్‌ గడ్కరీ ఇచ్చిన అండదండలు ఎన్నటికీ మర్చిపోలేను అని పేర్కొన్నారు. పొలాల్లోనే గ్రీన్‌ హైడ్రోజన్‌ను తయారు చేయాలని నితిన్‌ గడ్కరీ చెబుతుంటారని, గడ్కరీ హయాంలోనే సాగర్‌ మాలా, భారత్‌ మాలా వచ్చాయన్నారు.
ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక అడవి తల్లి బాట పేరుతో గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లను నిర్మిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మరో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం బలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. హైవే మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా దేశంలోని జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నారని నితిన్‌ గడ్కరీని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి గడ్కరీల విజన్‌తో భారత దేశం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.
Tags:    

Similar News