తిరుచానూరు: బంగారుచీరలో మెరిసిన పద్మావతి అమ్మవారు

ఆకట్టుకున్న అష్టలక్ష్మీ మండపం. శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-08-08 12:16 GMT
తిరుచానూరు పద్మావతీ అమ్మవారు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో వరలక్ష్మీ వ్రతం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వేకువజామున పద్మవతి అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపారు. సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన అమ్మవారు బంగారు చీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.


అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి సాంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని ఆరాధించారు.

అమ్మవారి ఉత్సవమూర్తిని 9 గ్రంథులతో(నూలుపోగు) అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు.
ఈ వ్రతానికి టీటీడీ అధికారులు హాజరయ్యారు. ముందుగానే టికెట్లు తీసుకున్న వివాహితులు కూడా ఈ వ్రతంలో పాల్గొన్నారు. టీటీడీ అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి, టిటిడి బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ, జి.భానుప్రకాష్ రెడ్డి, టిటిడి ఎక్స్ అఫిషియో మెంబర్ దివాకరరెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీ హరీంధ్రనాథ్ తోపాటు అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

వ్రతం ప్రాధాన్యత ఇదీ...
వరలక్ష్మీవ్రతం ప్రత్యేకతను ఆలయ అర్చకులు శ్రీ శ్రీనివాస ఆచార్యులు వివరించారు.

భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు వరలక్ష్మీ వ్రతం పూజావిధానాన్ని, మహత్యాన్ని తెలియజేశారని ఆలయ అర్చకులు శ్రీ శ్రీనివాస ఆచార్యులు తెలిపారు. పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత, ఆచరించవలసిన విధానాన్ని తెలియ చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. త్రేతాయుగంలో కుండలినీ నగరంలో నివసించిన చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మీ నోము ఆచరించి పొందిన ఫల ప్రదాన్ని ఈ సందర్భంగా వివరించారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ప్రీతితో తిరుచానూరులో శ్రీ పద్మావతీ అమ్మవారు అవతరించారని, వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న మహిళలకు సత్సంతానం, దీర్ఘమాంగల్యసౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. ఆరువాత 12 రకాల వివిధ నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది.
పసుపు, కుంకుమ గాజులు పంపిణీ

వరలక్ష్మీవ్రతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని టీటీడీ ఆలయాల్లో ఘనంగా నిర్వహించినట్లు ఈఓ జే. శ్యామలరావు మీడియాకు తెలిపారు.
"టిటిడి ఆధ్వర్యంలోని 52 ఆలయాల్లో 8 లక్షల గాజులు, 1.60 లక్షల కంకణాలు, 1.60 లక్షల పసుపు దారాలు, 1.60 లక్షల కుంకుమ ప్యాకెట్లు, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పుస్తక ప్రసాదాలను అందించాం" అని తెలిపారు.
"ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడికి అమ్మవారి ప్రసాదాలు అందించడానికి ఏర్పాట్లు చేశాం" అని ఈఓ వివరించారు.
పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలకు ఇబ్బంది లేకుండా, ప్రత్యేక క్యూ ఏర్పాటు చేసి, అన్నప్రసాదాలు, మంచినీరు, మజ్జిగ సరఫరా చేయించడానికి సిబ్బంది సేవలు అందించారన్నారు.
ఆకట్టుకున్న మండపం

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన మండపం విశేషంగా ఆకట్టకుంది. అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, వ్రత మండపాన్ని ఫల, పుష్పాలతో చేసిన అలంకరణ కనువిందు చేసింది.
బత్తాయి, ఆపిల్ వంటి ఫలాలు, వివిధ సంప్రదాయ పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా రూపొందించారు. మండపం
పైభాగంలో గజ లక్ష్మీ అమ్మవారు, కింది భాగంలో రెండు వైపుల ఐరావతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆస్థాన మండపాన్ని అష్టలక్ష్మి మూర్తులతో, రోజాలు, తామరపూలు లాంటి రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు.
టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్యర్యంలో40 మంది సిబ్బంది మూడు రోజులు పనిచేశారు. మూడు ట‌న్నుల సంప్రదాయ పుష్పాలు, ఆరు రకాల 30 వేల కట్ ఫ్లవర్స్ వినియోగించారు.
"చెన్నైకి చెందిన దాత విరాళంతో పుష్పాలంకరణ చేశాం" అని టీటీడీ ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు తెలిపారు.
వ్రతాన్ని చూసేందుకు వీలుగా ఆస్థాన మండపంలో, పుష్కరిణి వద్ద, వాహన మండపం వద్ద, ఫ్రైడే గార్డెన్స్, తొలప్ప గార్డెన్ వద్ద కలిపి 5 ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

స్వర్ణరథంపై విహారం
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో హెడిపిపి సెక్రటరీ శ్రీరాం రఘునాథ్, విజివోలు సురేంద్ర, రాంకుమార్ , ఏఈఓ దేవరాజులు, ఆలయ అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ రమేష్, శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Tags:    

Similar News