తిరుమల:23.50 లక్షల మంది ఆకలి తీర్చిన అన్నదాన సత్రం

16 రకాల ఆహారపదార్థాల పంపిణీ. టీటీడీలో మరో రికార్డు.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-09-30 14:47 GMT
తిరుమల మాడవీధి గ్యాలరీల్లో అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్న శ్రీవారి సేవకులు

తిరుమలలో ఆకలి అనే పదానికి తావు లేదు. ఎంతమంది వచ్చిన ఫరవాలేదు. వారందరికీ నాణ్యమైన అన్నప్రసాదాలు అందుబాటులో ఉంటాయి. నిత్య కల్యాణం పచ్చ తోరణంగా ఉన్న తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటి వరకు 23.50 లక్షల మందికి ఏ కొరత రాకుండా అన్నప్రసాదాలు పంపిణీ చేయడం ద్వారా మెరుగైన సేవలు అందించిన ఘనత టీటీడీ మరోసారి తన ఖాతాలో వేసుకుంది.

గత ఏడాది బ్రహ్మోత్సవాలతో పోలిస్తే ఈ సంవత్సరం 33 శాతం అధికంగా అన్నప్రసాదాలు పంపిణీ చేశామని అన్నదానం ప్రత్యేకాధికారి జీఎల్ఎన్. శాస్త్రి వెల్లడించారు. యాత్రికుల రద్దీని అంచనా వేసి, 16 రకాల అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు 1,300 మంది అన్నదానంలో నిరంతరాయంగా పని చేశారు.


మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ 1లోని 20, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరిలోని 9 కంపార్ట్ మెంట్లు, ఏటీసీ, ఎంబీసీ, టీబీసీ, పీఏసీ - 2, పీఏసీ 4 కేంద్రాలు, శిలాతోరణం, కృష్ణతేజ వరకు బయటి క్యూలైన్ల వరకు నిత్యం అన్నప్రసాదాలు, పాలు, నీరు, మజ్జిగ, కాఫీ, పాలు నిరంతరాయంగా అందిస్తుంటారు. శ్రీవారి బ్రహ్మెవ్సాల్లో కూడా ఈ నెల 24వ తేదీ నుంచి మంగళవారం వరకు 23,48,337 మంది యాత్రికులకు అన్నప్రసాదాలు పంపిణీ చేసిన రికార్డు టీటీడీకి మరోసారి దక్కింది.

"అన్నప్రసాదాల పంపిణీపై 99 శాతం మంది యాత్రికుల నుంచి సంతృప్తికర సమాధానం రావడం ఆనందంగా ఉంది" అని అన్నదానం డిప్యూటీ ఈఓ ఎం.రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.
తిరుమ‌ల‌లోని రాంభ‌గీచా- 2 యాత్రికుల వసత సముదాయంలో మంగళవారం అన్నప్ర‌సాద విభాగం ప్ర‌త్యేక అధికారి జీఎల్ఎన్. శాస్త్రితో క‌లిసి రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడారు.

తిరుమలకు సాధారణ రోజులకు ఎక్కువగానే బ్రహ్మోత్సవాల సమయంలో యాత్రికులు రావడం సహజం. శ్రీవారి దర్శనంతో పాటు ఆలయ మాడవీధుల్లో మలయప్పస్వామివారి వాహనసేవలను చూసేందుకు యాత్రికులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
తిరుమలకు గతంతో పోలిస్తే యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరుగడం తోపాటు విలువైన కానుకలు సమర్పించే పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు వచ్చారు అదే సమయంలో టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టుల్లో ప్రధానంగా ప్రాణదానం, అన్నదానం ట్రస్టులకు రూ.కోట్లలో కానుకలు సమర్పించారు. దీనిపై టీటీడీ చైర్మన్ బిఆర్. నాయుడు ఏమంటున్నారంటే.
"ఈసారి పాలక మండలి ఏర్పడడానికి ముందే ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం లడ్డూ తయారీకి స్వచ్ఛమైన నెయ్యి వాడడం, నిత్యాన్నదానంలో మేలురకం వస్తువుల వినియోగంతో నాణ్యత పెంచాం" అని చైర్మన్ నాయుడు చెప్పారు. ఈ పరిస్థితుల్లో లడ్డూ తయారీ కేంద్రంలో పరిశుభ్రత వాతావరణం మరింత పెంచడం, అన్నదాన సత్రంలో సరుకుల నాణ్యత పరీక్షలకు యంత్రాలు అమర్చడం వంటి కారణాల నేపథ్యంలో అన్నప్రసాదాల రుచి మెరుగైందని బిఆర్. నాయుడు విశ్లేషించారు.
"ఈసారి బ్రహ్మెత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశాం. గ్యాలరీల్లో యాత్రికులకు సేవలు అందించడానికి టీటీడీ సిబ్బందితో పాటు3,500 మంది శ్రీవారి సేవకుల స్వచ్ఛంద సేవలు వాడుకునేందుకు చేసిన ఫలితం కూడా మంచి ఫలితాలు ఇచ్చింది" అని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. సచ్ఛంద సేవకులు నిర్ణీత గంటలకంటే ఎక్కువగానే యాత్రికులకు సేవలు అందించానిక అవిశ్రాంతంగా పనిచేయడం వారి అంకితభావానికి నిదర్శనం అని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అభినందించారు.
అన్నదాన సిబ్బంది సేవలు...
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ అన్నదాన సత్రంలో సిబ్బంది సేవలు అందించడంలో ఏమాత్రం రాజీ పడలేదనిఅన్నదానం డిప్యూటీ ఈఓ ఎం. రాజేంద్రప్రసాద్ చెప్పారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన‌ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ అన్నప్రసాదం, అల్పాహారం, పాలు, మజ్జిగ భక్తులకు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. దాత‌లు అందించిన 23 ర‌కాల కూర‌గాయ‌ల‌తో ఆహార పదార్థాలు తయారీలో నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చామని ఆయన వివరించారు.
"బ్రహ్మత్సవాల్లో ఈ 24వ తేదీ నుంచి 29వ తేది వ‌ర‌కు 23,48,337 మంది భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాదాలు అందించాం. 11,32,160 మంది భ‌క్తుల‌కు పాలు, మజ్జిక, మంచినీటి బాటిళ్లు అందించాం" అని రాజేంద్రప్రసాద్ వివరించారు.
గరుడోత్సవంలో...

తిరుమల శ్రీవారి బ్రహ్మత్సవాల్లో అత్యంత రద్దీగా ఉండే గరుడసేవ రోజు యాత్రికులు పోటెత్తారు. దీనిని ముందుగానే అంచనా వేసిన టీటీడీ అధికారులు పాలక మండలి ముందస్తు ఏర్పాట్లతో సంసిద్ధమైంది. రెండు లక్షల మందికి సేవలు అందించడానికి కూడా ఏర్పాట్లు చేశారు. గరుడోత్సవం రోజ అందించిన సేవలపై అన్న‌ప్ర‌సాదం ప్ర‌త్యేకాధికారి జీఎల్ఎన్. శాస్త్రి మాట్లాడుతూ ..
"విశేష‌మైన గ‌రుడ వాహ‌నం రోజున నాలుగ మాడ వీధుల్లోని గ్యాల‌రీలతో పాటు హోల్డింగ్ పాయింట్ల వ‌ద్ద 9,28,000 మంది భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాదాలు పంపిణీ చేయించగలిగాం. దీనికి తరిగొండ వెంగమాంట అన్నదాన సత్రంలోని సిబ్బంది అందించిన సహకారంతోనే సాధ్యమైంది" అని శాస్త్రి చెప్పారు.
గరుడసేవ రోజు తోపాటు బ్రహ్మెత్సవాల వాహన సేవల సమయంలో గ్యాలరీల్లోని 6,27,200 మంది యాత్రికులకు పానీయాలు పంపిణీ చేశామ‌ని శాస్త్రి తెలిపారు.
శాస్త్రి ఇంకా ఏమి చెప్పారంటే..
"వాహనసేవల సమయంలో యాత్రికులకు 4,36,994 మందికి భ‌క్తుల‌కు బిస్కెట్ ప్యాకెట్లు, సుండ‌లు పంపిణీ చేశాం. మొత్తం 16 ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసి గ్యాల‌రీల్లోని భ‌క్తుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ప్ర‌తి గంట‌కు ఒక్కొ ర‌క‌మైన ప్ర‌సాదాన్ని పంపిణీ చేశాం. దాదాపు 30వేల మంది భ‌క్తుల‌కు బాదం పాలు పంపిణీ చేశాం" అని శాస్త్రి వివరించారు.
సిబ్బంది సేవలు
బ్రహ్మత్సవాల వేళ యాత్రికుల రద్దీకి తగినట్లుగా అన్నదాన కేంద్రంలో దాదాపు 1300 మంది సిబ్బంది నిరంతరాయంగా పనిచేశారు. యాత్రికులకు ఎప్ప‌టిక‌ప్పుడు అన్న ప్ర‌సాదాలు అందించడానికి శ్రద్ధ తీసుకున్నారు.
"ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండ‌టంతో పోలీసుల సాయంతో మాడ‌వీధుల్లోకి అన్న ప్ర‌సాదాల‌ను తీసుకెళ్లేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకున్నాం" అని అన్నదానం ప్రత్యేకారి జీఎల్ఎన్. శాస్త్రి చెప్పారు. గ‌త సంవ‌త్స‌రంతో పోల్చితే ఈ ఏడాది 33శాతం అధికంగా అన్న ప్ర‌సాదాలు పంపిణీ చేసిన‌ట్లు తెలియ‌జేశారు. భక్తులకు అన్నప్రసాదాలు అందించడంలో శ్రీవారి సేవకులు విశేషంగా సేవలు అందించారన్నారు.
తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో యాత్రికులకు కల్పించిన సదుపాయాలు సంతృప్తి మిగిల్చాయని టీటీడీ అధికారులు కూడా వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News