తిరుమలలో వెన్నెల పంచిన మలయప్ప
చంద్రప్రభ వాహనంపై నవనీత కృష్ణుడిగా దర్శనం.
Byline : SSV Bhaskar Rao
Update: 2025-09-30 15:53 GMT
వర్షప్రభావంతో చల్లటి వాతావరణం. ఆకాశం మేఘావృతమై ఉంది. ఈ వాతావరణంలో తిరుమల క్షేత్రంలో యాత్రికులు పండువెన్నెలను తలపించిన అనుభూతికి లోనయ్యారు. దేదీప్యమైన లైట్ల వెలురు ఉన్నా, చంద్రప్రభ వాహనంపై మలయప్ప విహరించే సమయంలో మంగళవారం రాత్రి ఆహ్లాదకరంగా మారింది. చంద్రప్రభ వాహనంపై నవనీత కృష్ణుడి అలంకారంలో శ్రీమలయప్ప విహరిస్తూ, గ్యాలరీల్లోని యాత్రికులకు దర్శనం ఇచ్చారు.
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఏడో రోజు మంగళవారం రాత్రి శ్రీమలయప్పస్వామివారి వాహనసేవ కనువిందుగా సాగింది. ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీల్లో కూర్చున్న యాత్రికులు స్వామివారికి కర్పూర హారతులు, డ్రైఫ్రూట్లు, తీపిపదార్థాలు కూడా హారతి పళ్లాల్లో ఉంచి నివేదించారు.
చంద్రప్రభ వాహనం – సకలతాపహరం
వార్షిక బ్రహ్మత్సవాల్లో రోజూ సాయంత్రం, రాత్రి ఒకో వాహనం, ఒకో అలకారంలో దర్శనం ఇస్తుంటారు. దశావతారాల్లో మలయప్పస్వామివారు పల్లకీపై ఊరేగుతూ, యాత్రికులకు దర్శనం ఇస్తుంటారు. అందులో మంగళవారం రాత్రి చంద్రప్రభ వాహనంపై విహరించడం వెనుక కూడా చారిత్రక నేపథ్యంతో కూడిన కథనం ఉంది.
"చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది" అనేది ఓ అనుభూతి. కాగా, ఈ వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, ర్డు సభ్యులు, సివిఎస్వో మురళికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.