శ్రీవారి యాత్రికులకు పుస్తక ప్రసాదం..
పది పాకెట్ సైజ్ పుస్తకాలు ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ నాయుడు.
Byline : SSV Bhaskar Rao
Update: 2025-09-30 15:37 GMT
తిరుమల శ్రీవారి వైభవం మరింత విస్తృతం చేయడానికి టీటీడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యకథ తోపాటు స్తోత్త్రాలు, సహస్ర నామాలతో ఆధ్మాత్మిక పెంపొంచడానికి టీటీడీ ప్రచురణల విభాగం పది ప్యాకెట్ సైజు పుస్తకాలు ముద్రించింది.
తిరుమలలో మంగళవారం రాత్రి చంద్రప్రభ వాహనం ముందు ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, పాలక మండలసభ్యులతో కలిసి టీటీడీ చైర్మన్ బిఆర్. నాయుడు ఆవిష్కరించారు. వాహనమండపం ముందు పుస్తకాలు ఆవిష్కరించిన చైర్మన్ బిఆర్. నాయుడు మాట్లాడుతూ,
"ధర్మప్రచారానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ పుస్తకాలను తిరుమల యాత్రకు వచ్చే యాత్రికులకు అందిస్తాం. రాష్ట్రంలో టీటీడీ కార్యక్రమాలు నిర్వహించే సమయంలో కూడా పంపిణ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం" అని చైర్మన్ బిఆర్. నాయుడు చెప్పారు.
తిరుమల శ్రీవారి నామావళితో పాటు దివ్యకథను వివరిచే పాకెట్ సైజు పుస్తకాల తయారీకి టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అభినందనీయం అని ఆయన అన్నారు.
ఇవీ పుస్తకాలు
శ్రీవారి భక్తులకు పుస్తక ప్రసాదం అందించేందుకు వీలుగా 10 ప్యాకెట్ సైజ్ పుస్తకాలు హిందూ ధర్మప్రచార పరిషత్ టీటీడీ ( Hindu Dharma Prachar Parishad TTD )ప్రెస్ లో ముద్రించింది. అందులో శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, శ్రీ శ్రీనివాసుని దివ్య కథ, భజగోవిందం, శ్రీ శంకరాచార్య కృత స్తోత్రాలు, విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, శ్రీమద్ భగవద్గీత, రథసప్తమి, మహాశివరాత్రి, కార్తీక వైభవం వివరించే పుస్తకాలు ఉన్నాయి.
"తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులకు సమాచార కేంద్రాలతో పాటు గ్యాలరీల్లో కూడా శ్రీవారిసేవకుల ద్వారా ఈ పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తాం" అని టీటీడీ చైర్మన్ బిఆర్. నాయుడు వివరించారు. చంద్రప్రభ వాహనం సేవకు వచ్చిన భక్తులకు ఆయన పుస్తక ప్రసాదాలను పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు, హెచ్డిపిపి సెక్రటరీ శ్రీరాం రఘునాథ్ , అధికారులు పాల్గొన్నారు.