ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉత్తరాంధ్ర.. అప్రమత్తం చేసిన చంద్రబాబు..

Govt Put Focus On Noth AP Cyclone Situation

Update: 2024-09-10 10:17 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఉత్తరాంధ్ర అంతటా భీకర వర్షాలకు కురుస్తున్నాయి. ఈ వర్షాల దెబ్బకు ఉత్తరాంధ్ర జిల్లాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనకాపల్లి పాయకరావు పేటలోని తాండవ, వరాహ నదులు ఉగ్రరూపం దాల్చి పరవళ్లు తొక్కుతున్నాయి. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎస్ రాయవరం మండలం దగ్గర ఇందేసమ్మ వాగు ఉద్ధృతికి ఘాటు రోడ్డు కొట్టుకుపోయింది. సత్యవరం వద్ద తాండవ నది ప్రవాహంలో వంతెన మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఆయా ప్రాంతాల్లో హోం మంత్రి అనిత పర్యటించారు. అక్కడి పరిస్థితులపై అధికారులకు ఆరా తీశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా పునరావాసం ఏర్పాటు చేయాలి, ఆహారం, మంచినీరు అందించాలని ఆదేశాలిచ్చారు. అదే విధంగా వరద ఉద్ధృతిపై కూడా అధికారులతో సమీక్షించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వరదలు తగ్గుముఖం పట్టేవరకు ప్రతి అధికారి అప్రమత్తంగా ఉండాలని, విధుల విషయంలో ఏమాత్రం అలసత్వం, నిర్లక్ష్యం కనబరిచినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

బాధితులను ఆదుకుంటాం..

వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన హోం మంత్రి వంగలపూడి అనిత.. వరద బాధితులకు భరోసా ఇచ్చారు. వరద బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని, వారికి అడుగడుగా అండగా నిలుస్తుందని అన్నారు. వరదలు తగ్గి ప్రతి ఒక్కరూ తమ నివాసంలోకి వెళ్లే వరకు ప్రభుత్వం వారి వెంటే ఉంటుందని, అధికారులు కూడా 24 గంటలు అందుబాటులో ఉంటూ అన్ని సమస్యలు పరిష్కరిస్తారని, వరద కారణంగా దెబ్బతిన్న రహదారుల మరమ్మతులను కూడా తక్షణమే ప్రారంబించాలని ఆమె ఆదేశించారు. అంతేకాకుండా వరదల కారణంగా విషజ్వరాల ప్రభావం అధికంగా ఉన్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు హోంమంత్రి.

వ్యూహం సిద్ధం చేయాలి: సీఎం

‘‘ఉత్తరాంధ్ర తుఫాన్లు అధికంగా సంభవించే ప్రాంతం. అక్కడ తుఫాన్లను ఎదుర్కొనెలా వ్యూహాలను రూపొందించాలి. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాలకు ముందుగానే అప్రమత్తం చేయాలి. ప్రాణ నష్టాన్ని సున్నాగానే ఉంచేలా ప్రయత్నించాలి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలి. వారికి నిత్యావసరాలను సమకూర్చాలి’’ అని అధికారులకు చెప్పారు చంద్రబాబు. కాగా తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో ముందస్తు చర్యలు తీసుకున్నామని, అవన్నీ సజావుగా సాగుతున్నాయని ఆయా జిల్లాల కలెక్టర్లు.. సీఎం చంద్రబాబుకు వివరించారు.

Tags:    

Similar News