ఆ.. నిర్ణయంతోనే.. ప్రభుత్వ బడులకు షాక్

నాడు-నేడు ఆదుకోలేదు. అమ్మ ఒడి పథకం అక్కరకు రాలేదు. ఈ పథకాలు అమలు చేసినా, ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గింది. గత ప్రభుత్వం తీసుకున్న ఒకే నిర్ణయం ప్రైవేటు పాఠశాలలో సంఖ్య పెరగడానికి ఆస్కారం కల్పించిందనేది ఉపాధ్యాయ సంఘాల నేత చెబుతున్న మాట.

Update: 2024-06-18 11:20 GMT

విద్యాదీవెన, అమ్మ ఒడి, నాడు-నేడు వంటి పథకాలే కాదు. వసతులు సరిగా ఉండి, తగినంత మంది టీచర్లు ఉంటే తల్లిదండ్రులకు భరోనా ఉంటుంది. విద్యార్థులు కూడా తగ్గరు. అందుకు సజీవసాక్షం చిట్వేలి చదువుల ఒడి.


అది నెల్లూరు కడప జిల్లాలకు సరిహద్దులో ఉన్న చిట్వేలి మండలంలో ఐదు జెడ్పీ హైస్కూళ్లు ఉన్నాయి. చిట్వేలిలో మూడు ప్రైవేటు స్కూళ్ల నుంచి తీవ్రమైన పోటీ ఉంది. ఆ జెడ్పీ హైస్కూల్ లో మాత్రం 1,478 మంది విద్యార్థులు ఉన్నారు. 53 మంది టీచర్ పోస్టులకు 43 మంది పనిచేస్తున్నారు. వసతులు తక్కువ అయినా, విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండదు. ఇదే పాఠశాలలో చదివిన విద్యార్థులే చాలా మంది టీచర్లుగా ఉన్నారు. పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా అదే నిబద్ధతో పాఠాలు చెబుతున్నారు.

ఈ పాఠశాల టీచర్ టీ. గీతారాణి మాట్లాడుతూ, " నా 26 ఏళ్ల సర్వీసులో ఈ బడి నాకు మూడోది. ఇక్కడ ఉన్న వాతావరణం గతంలో నాకు ఎక్కడా కనిపించలేదు. ఇక్కడ పనిచేయడం నాకు గర్వంగా ఉంది. నిజం చెప్పాలంటే మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లాలని కూడా అనిపించదు. ఆహారం అంత చక్కగా ఉంటుంది" అని వ్యాఖ్యానించారు.
"నేను ఈ పాఠశాల విద్యార్థిని, మా నాన్న (పీఈటీ మాస్టర్ ఏ. గోవిందయ్య) ఇక్కడే పనిచేస్తూ రిటైర్ అయ్యారు. ఇదే బడిలో నేను టీచర్ కావడం నా అదృష్టం" అని ఏబీఎన్. ప్రసాద్ ఫెడరల్ ప్రతినిధితో అన్నారు. ఇక్కడ చెట్ల కింద చదువుకున్న రోజులు గుర్తు ఉన్నాయి. గదులు ఉన్నా, నేను చదువుకున్న చెట్ల కింద పాఠాలు చెప్పడంలో ఉన్న అనుభూతి మాటల్లో వర్ణించలేను. విద్యార్థులు కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించి ఉపకార వేతనాలు సాధిస్తున్నారు. అని ప్రసాద్ వివరించారు.
"కండక్టర్ గా పనిచేస్తూ టీచర్ గా వచ్చిన కుమార్ వల్ల మా బడికి పెద్ద మేలు జరిగింది. అని ప్రసాద్ తెలిపారు. "వెయ్యి మంది విద్యార్థులు ఉంటే, ప్రత్యేకంగా ఉచిత ఆర్టీసీ బస్సు సదుపాయం తీసుకోవచ్చు" అనే విషయం తెలిసింది. దరఖాస్తు చేసిన వెంటనే రాజంపేట డిపో నుంచి బస్సు కేటాయించారు. ఒకే మార్గంలో రెండు ట్రిప్పుల ద్వారా 200 మంది విద్యార్థులను బడికి తీసుకుని వస్తున్నట్టు ప్రసాద్ వివరించారు.
మరో ఉపాధ్యాయుడు దొండ్లవాగు శ్రీనివాస్ మాట్లాడుతూ, "నేను ఇదే బడిలో విద్యార్థిని. ఇక్కడే టీచర్ అయ్యాను. సొంత ఇంటిలో ఉన్నట్టే ఉంటుంది. పొరుగు ప్రాంతాల టీచర్లు బదిలీపై ఇక్కడికి వస్తే, ఈ పరిస్థితులకు ట్యూన్ అవుతారు. తల్లిదండ్రుల సహకారం బాగుంది. అని చెప్పారు. "మా బడిలో ఎన్ సీసీ ఉంది. అన్ని విభాగాల్లో శిక్షణ ఉంటుందని శ్రీనివాస్ చెబుతున్నారు. అందుబాటులోని వసరులు సద్వినియోగం చేసుకుంటే, మంచి ఫలితాలు ఉంటాయనేది వారు చెప్పే మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సజీవసాక్ష్యాలు చెప్పడానికి దారితీసిన పరిస్థితుల్లోకి వెళితే...
"రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణం ఏమిటి? సమగ్ర నివేదిక ఇవ్వండి "
అని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ లెక్కల ప్రకారం 44,617 ప్రభుత్వ పాఠశాలలు, 13,249 అన్ ఎయిడెడ్ ప్రైవేటు స్కూళ్లు, 1084 మదరసాలు ఉన్నాయి. వాటిలో 2023 -24 విద్యా సంవత్సరానికి నాలుగు లక్షల మంది విద్యార్థులు తగ్గారు. గ్రామీణ ప్రాంతాల్లోని 1600 పాఠశాలలు మూత పడ్డాయి. ఇది కాస్తా ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరగడానికి ఆస్కారం కల్పిచింది.
పెరిగినట్లు కనిపించింది..
అమ్మ ఒడి పథకం వల్ల ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. తరువాత ఏడాదికి ఆ సంఖ్య చాలా వరకు తగ్గింది. 2021 -22 విద్యా సంవత్సరంలో సుమారు 42 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడిలో చదువుతుంటే, సెప్టెంబర్ నాటికి ఆ సంఖ్య 41, 38,322 సంఖ్య కాస్తా.. ప్రస్తుతం 37,50 293 మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. తగ్గిన వారంతా ప్రైవేటు స్కూళ్ల వైపు అడుగుల వేశారు. "అమ్మ బడి పథకం అన్ని పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వర్తింప చేస్తాం" అనే ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇలా జరిగిందనేది ప్రభుత్వ టీచర్లు చెబుతున్న మాట.
దీనిపై ఎస్.టీయూ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడుతూ, కోవిడ్ సమయంలో "ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు చెల్లించడం భారంగా భావించిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్చడం వల్ల సంఖ్య పెరిగింది" అని చెప్పారు. కరోనా తగ్గుముఖం పట్టగానే, మళ్లీ వారంతా తిరిగి ప్రైవేటు స్కూళ్ల వైపు వెళ్లారు అని వివరించారు. అమ్మ ఒడి పథకం ప్రభుత్వ బడుల్లో చదివే వారికే వస్తుందనే మంజూరు అవుతుందేమో అని కూడా చాలా మంది ఇటు వచ్చారు. అందరికీ వస్తుందని చెప్పడం వల్ల ప్రైవేటు నుంచి వచ్చిన పిల్లలందరూ మళ్లీ అటే వెళ్లారు అని చెప్పారు.
ప్రభుత్వ నిర్ణయంతో తగ్గిన విద్యార్థులు
పాలనపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం అత్యంత జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే ప్రతికూల ఫలితాలు తప్పవు. గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం మూడు కిలోమీటర్ల లోపు పాఠశాలల విలీనం చేయాలనే నిర్ణయం వల్ల 1,600 పాఠశాలలు మూతపడ్డాయి. దీనివల్ల ఒకటో తరగతిలో చేరే వారి సంఖ్య తగ్గడంతో పాటు, ఆపై తరగతి విద్యార్థులు కూడా ప్రైవేటు బాటపట్టడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఉసిగొల్పింది. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క ఏడాదే నాలుగు లక్షల మంది చేరినట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రీప్రైమరీ, ప్రైమరీ పేరుతో 4,200 స్కూళ్లలో రెండు క్లాసులు మాత్రమే నిర్వహిస్తున్నారు. దీనివల్ల తమ పిల్లలను ప్రైవేటు బడికి పంపించడానికి తల్లిదండ్రులు మొగ్గు చూపారు. ఫలితంగా ఒకటో తరగతిలో చేరిన వారం సంఖ్య గత ఏడాది నాలుగు లక్షలకు చేరితే, అన్ని తరగతులకు కలిపి ఆ సంఖ్య 34 లక్షలకు చేరినట్లు లెక్కలు చెబుతున్నాయి.
ఈ వ్యవహారంపై ఎస్టీయూ నేత సుధాకర్ మాట్లాడుతూ... విద్యారంగానికి నాలుగేళ్లలో వివిధ కార్యక్రమాల కోసం రూ.60 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఇంతవరకు సరే. కావాల్సింది.. ఇది ఒకటే కాదు. "నిర్ణయాలు తీసుకునే ముందు ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడకుండా ఏకపక్షంగా వ్యవహరించారు" అని వ్యాఖ్యానించారు. "అమ్మ ఒడి అందరికీ వస్తుంది అని గత ప్రభుత్వం చెప్పగానే" పోలో మంటూ చాలా మంది వెళ్లిపోయారు. ఆ తత్వం ప్రభుత్వం జారీ చేసి నంబర్ 117 జివో విద్యారంగాన్ని దెబ్బతీసింది" అని మధుసూధన్ తెలిపారు. " మూడు కిలోమీటర్ల లోపు పాఠశాలల రద్దు నిర్ణయం శరాఘాతంగా మారింది. 3,4,5 తరగతులను మ్యాపింగ్ చేసి, సమీప హైస్కూళ్లలో విలీనం చేశారు. చిన్నపిల్లలు అంతదూరం వెళ్లగలరా? అని కూడా ఆలోచన చేయలేదు. ఇది కాస్తా, వారందరినీ ప్రైవేటు బడులకు మళ్లీంచేలా చేసింది" అని ఆయన జరిగిన నష్టాన్ని వివరించారు.
గత ప్రభుత్వం జారీ చేసిన 117 జీవో సవరిస్తే మినహా, ప్రభుత్వ విద్యారంగం బలోపేతం అయ్యే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు.

Similar News