ఔను.. వారిద్దరూ రాజీ పడ్డారు..! ఎమ్మెల్యే ఆదిమూలంకు విముక్తి

రాసలీల వ్యవహారంలో ఎమ్మెల్యేకు సాంత్వన లభించింది. ఫిర్యాదు చేసిన టీడీపీ మహిళా నేతతో రాజీ కుదిరింది. దీంతో ఈ కేసును హైకోర్టు కొట్టివేసింది.

Update: 2024-09-20 15:36 GMT

చిత్తూరు జిల్లా సత్యవేడు ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీల వ్యవహారం కూడా రాష్ట్రంలో ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎమ్మెల్యే ఆదిమూలం తనపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అని అదే ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకురాలు వీడియోలు విడుదల చేసిన విషయం తెలిసిందే. నెలపాటు సాగిన ఈ ఆరోపణలు అనేక మలుపులు తిరిగాయి. తాజాగా వారిద్దరి పక్షాన వకాల్తా పుచ్చుకున్న మహిళా న్యాయవాదులు "ఇద్దరు రాజీ పడ్డారు" అని కోర్టుకు నివేదించడంతో కేసు కొట్టివేశారు. దీంతో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు క్లీన్ చిట్ లభించింది.

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అని ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ మహిళా నాయకురాలు ఈనెల 5వ తేదీ హైదరాబాదులో మీడియా ముందు చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఆ తరువాత ఆ టీడీపీ మహిళా నాయకురాలు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మొదట వైద్య పరీక్షలకు అంగీకరించలేదు. ఆ తర్వాత గత బుధవారం తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మరో 15 రోజుల్లో ఆ నివేదికలు అందుతాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారధిరెడ్డి కూడా ప్రకటించారు. ఇదిలా ఉండగా,
ఆస్పత్రిలో ఎంఎల్ఏ
అదేసమయంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చెన్నై ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. తిరుపతిలో తనపై ఆరోపణలు, ఫిర్యాదు చేసిన మహిళ వైద్య పరీక్షలు చేయించుకునే సందర్భంలోనే.. కోనేటి ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ లేకుండా కేసు నమోదు చేశారు. ఆ కేసు కొట్టేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలావుండగా,
మహిళకు సంబంధించి వైద్య పరీక్షల నివేదికలు వచ్చిన తరువాత కోనేటి ఆదిమూలంను పోలీసులు విచారణ చేయడానికి కూడా సంసిద్ధమయ్యారు. ఈ వ్యవహారం అంతా సరిగ్గా వారం క్రితం జరిగింది. అదే రోజు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం "ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్" ప్రతినిధితో కూడా మాట్లాడారు.
"ఇందులో నా తప్పు ఏమీ లేదు. అకారణంగా మానసిక వేదనకు గురి చేశారు. గుండె సంబంధిత వ్యాధితో నాకు స్టంట్ కూడా వేశారు. అని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వేదన చెందారు.
టీడీపీ దృష్టి
ఈ రాసలీల వ్యవహారంపై టీడీపీ అధిష్టానం కూడా తనకున్న మార్గాల్లో సమాచారం, నివేదిక కూడా తెప్పించుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే, "తనకు ఈ పరిస్థితి కల్పించడం వెనక రాజకీయ కుట్ర ఉంది" అని కూడా మొదటి నుంచి కోనేటి ఆదిమూలం సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అధికార టీడీపీ ఎమ్మెల్యే కావడం, ఆరోపణల తీవ్రతను పరిగణణలోకి తీసుకున్న పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
వైసీపీలో తీరే వేరు...
వైసిపి అధికారంలో ఉండగా, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, అనంతపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, విశాఖ జిల్లాకు చెందిన అవంతి శ్రీనివాస్ పై ఇదే తరహా ఆరోపణలే కాదు. వాయిస్ రికార్డింగ్ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. వారిపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా దేవాదాయ శాఖ అధికారిణి వ్యవహారంలో రాజ్యసభ సభ్యుడు, వైసీపీలో నంబర్ టూగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబకథా చిత్రంలా వ్యవహారం నేపథ్యంలో కూడా పార్టీ నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం.
వారికి భిన్నంగా..
అధికార టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలం పై ఆరోపణలు రావడమే తరువాయి, నిజానిజాలు నిలకడపై తెలుస్తాయి అని భావించినట్లు ఆయనపై టీడీపీ సస్పెన్షన్ వేటు వేసింది. అంటే తమ పార్టీలో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తాం అని సీఎం చంద్రబాబు చెప్పకనే చెప్పినట్లు కనిపిస్తుంది.
హనీ ట్రాప్ వేశారా?
సత్య వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హనీ ట్రాప్ గురయ్యారని మాట కూడా వినిపించింది. ఆయన కూడా అదే సందేహం వ్యక్తం చేశారు. రాజకీయ కుట్ర కోణం ఉందనే సందేహాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం భీముని చెరువు గ గ్రామం దళిత కాలనీ చెందిన కోనేటి ఆదిమూలం 1981లో ఆ గ్రామ సర్పంచ్ గా ఎంపికై రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 1988 లో నారాయణవనం మండలం వైస్ ఎంపీపీగా, 1995లో ఎంపీటీసీగా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2001లో టీడీపీలో చేరడం ద్వారా జెడ్పీపీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి అదే పార్టీలో కొనసాగిన ఆయన సత్యవేడు నియోజకవర్గంలో నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేశారు.
వైసీపీలో చేరిన ఆదిమూలం 2014 సత్యవేడు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ రెండు సార్వత్రిక ఎన్నికల్లో కోనేటి ఆదిమూలం వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ కు విధేయుడుగానే కాకుండా, చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషించే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి సన్నిహితంగా వెలిగారు.
2024 ఎన్నికలు సమీపించే సమయంలో "సర్వే నివేదికల్లో కోనేటి ఆదిమూలం పనితీరు బాగాలేదు" అంటూ టికెట్ ఇవ్వడానికి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఆయన ధిక్కారస్వరం వినిపించారు. "సర్వే నివేదికల పేరుతో పెద్దిరెడ్డి ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేశారు. ఇందులో మరో ముగ్గురి పాత్ర కూడా ఉంది" అని ఆరోపణలు చేశారు. అంతటితో ఆగని ఆయన మాజీ మంత్రి పెద్దిరెడ్డి సహజ వనరులను కొల్లగొట్టారు. నా నియోజకవర్గంలో ఇసుక మట్టి గ్రావెల్ అక్రమంగా తరలించారు" అని కూడా అన్నారు. "సర్వేలు దళితులకు మాత్రమేనా? రెడ్డి వర్గాలకు కాదా? అని ఏకంగా వైసీపీ అధ్యక్షడు వైఎస్. జగన్ పైనే విమర్శల బాణాలు సంధించారు.
"ఇవన్నీ మనసులో ఉంచుకున్న కొందరు నాయకులే తనను హనీ ట్రాప్ లో ఇరికించారు " అని గత పది రోజులుగా కోనేటి ఆదిమూలం ఆరోపిస్తూనే ఉన్నారు. ఈ వ్యవహారంపై వైసీపీ నాయకులు స్పందించకపోవడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి.
కేసు ఉపసంహరణ
తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు చేసిన మహిళ వైద్య పరీక్షలు నివేదికలు వారంలో రానున్నాయి. తిరుపతి ప్రసూతి వైద్యశాలకు అందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైకోర్టులో ఆ మహిళ కేసు ఉపసంహరించుకోవడం వల్ల ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బయటపడ్డారు. రాజకీయ పరిభాషలో చెప్పాలంటే కడిగిన ముత్యంలో వచ్చారు. దీంతో టీడీపీ ఆయనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తుందా? ఎలా వ్యవహరిస్తుందనేది వేచి చూడాలి.


Tags:    

Similar News