పిఠాపురంలో పవన్‌ పట్టు సాధించేనా?

ఒక పార్టీకీ అధినేతైన పవన్‌ కల్యాణ్‌ ఇంత వరకు గెలుపు ఖాతా తెరవ లేదు. 2019 రెండు చోట్ల పోటీ చేసినా ఓటమి తప్ప లేదు.

Update: 2024-04-20 13:25 GMT

అందరి చూపులు ఇప్పుడు పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గంపైనే ఉన్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడు, ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇక్కడ నుంచి పోటీ చేస్తుండటంతో ఈ సారి ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గానికి అంత ప్రాచుర్యం ఏర్పడింది.

రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల అధినేతలు రాజకీయాల్లో కాకలు తీరిన వారే. తెలుగుదేశం పార్టీ అధినే చంద్రబాబు నాయుడు దాదాపు 45 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 1978లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చంద్రబాబు ఒక సారి తప్ప గెలుస్తూ వస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఓటమి ఎరుగని నాయకుడిగా ఉన్నారు. 2009లో ఎంపీగా గెలిచిన ఆయన తర్వాత పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా విజయ ఢంకా మోగిస్తూ వస్తున్నారు. చంద్రబాబు, జగన్‌మోహన్‌రెడ్డిలిద్దరూ ముఖ్యమంత్రులుగా, ప్రతిపక్ష నేతలుగా ఉన్నారు. దీంతో పాటు వేలాది ఓట్ల మెజారిటీతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు.
ఖాతా తెరవని పవన్‌ కల్యాణ్‌
అయితే జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ మాత్రం ఇంత వరకు గెలుపు ఖాతానే తెరవ లేదు. ఒక పార్టీకి అధ్యక్షుడై ఉండి ఇంత వరకు గెలవ లేదనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించారు. తర్వాత రెండు ఎన్నికలు జరిగాయి. 2014లో తెలుగుదేశం, బిజెపీల విజయం కోసం ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో తమ అభ్యర్థులను పోటీలో దింపారు. స్వయంగా పవన్‌ కల్యాణ్‌ కూడా రంగంలోకి దిగారు. ఏకంగా రెండు స్థానాల నుంచి పోటీ పడ్డారు. భీమవరం, గాజువాక నుంచి బరిలోకి దిగారు. కానీ ఒక్క చోట కూడా ఓటర్ల ఆదరణ చూరగొన లేక పోయారు. భీమవరంలో 62,285 ఓట్లు రాగా గాజువాకలో 58,539 ఓట్లు సంపాదించుకున్నారు కానీ విజయం దక్కించుకోలేక పోయారు. పార్టీ అధ్యక్షుడిగా, సినీనటుడుగా అగ్ర స్థానంలో ఉండి మంచి ప్రేక్షక ఆధరణ కలిగి ఉండి కూడా విజయ పతాకాన్ని ఎగువర వేయలేక పోయారు.
2019లో గెలిచిన వైఎస్‌ఆర్‌సీపీ
తెలుగుదేశం, బిజెపీ పార్టీలతో పొత్తులు, సీట్లు కేటాయింపుల అంశాలు పక్కన పెడితే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున 20 అసెంబ్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపారు. రెండు పార్లమెంట్‌ స్థానాల్లో కూడా జనసేన అభ్యర్థులు పోటీకి పెట్టారు. ఇంత మందిని బరిలోకి దింపిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్వయంగా పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైఎస్‌ఆర్‌సీపీ గెలిచింది. 14వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఆ పార్టీ అభ్యర్థి దొరబాబు విజయం సాధించారు. ఇదే ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన మాకినీడి శేషుకుమారి మూడో స్థానం దక్కించుకున్నారు. ఆమెకు 28,011 ఓట్లు మాత్రమే లభించాయి. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఎస్‌విఎస్‌ఎన్‌ వర్మ అనూహ్యంగా విజయం సాధించారు. 2019ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వర్మ రెండో స్థానంలో నిలచారు.
2024 జనసేన అభ్యర్థిగా పవన్‌ కల్యాణ్‌
2024 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ రంగంలోకి దిగారు. కాకినాడ సిట్టింగ్‌ ఎంపీ వంగా గీత వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీలోకి దిగారు. పవన్‌ కల్యాణ్, వంగా గీంత ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. ఇక్కడ కాపు సామాజిక వర్గం ప్రభావం చాలా ఎక్కువుగా ఉంటుంది. తక్కిన సామాజిక వర్గాలతో పోల్చితే కాపు సామాజిక వర్గం గెలుపు ఓటములపై ప్రభావం చూపుతుంది. ఈ అసెంబ్లీ నియోజక వర్గంలో 2.28లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.14లక్షలు మహిళలు, 1.13లక్షలు పురుషుల ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో సుమారు 80వేలకు పైగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. తూర్పు కాపులు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. దాదాపు 10 నుంచి 15 శాతం వరకు తూర్పు కాపులు ఉంటారు. సుమారు 20 శాతం మాల సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు, 12 శాతం శెట్టిబలి, 10 శాతం చేనత సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. వీరితో పాటు మత్స్యకారులు, రెడ్డి, యాదవ, మాదిగ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు కూడా ప్రముఖంగానే ఉన్నారు. వీరిలో చాలా మంది జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు. అయితే ఎలాగైనా పవన్‌ కల్యాణ్‌ను ఓడించాలనే లక్ష్యంతో సీఎం జగన్‌ వ్యూహాలు పన్నుతున్నారు. అందులో భాగంగా పిఠాపురంలోని జనసేన నాయకులకు గాలం వేశారు. దీంతో పాటుగా మాజీ మంత్రి, ప్రముఖ కాపు నేత ముద్రగడ పద్మనాభంతో పాటు సిట్టింగ్‌ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే దొరబాబును కూడా రంగంలోకి దింపారు. తమ పరిచయాలను ఉపయోగించి జనసేన సానుభూతిపరులు, నేతలను తమ వైపు తిప్పుకునే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో ఈక్వేషన్స్‌ మారే అవకాశం ఉందని స్థానికులు అంచనా వేస్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే వర్మ పవన్‌ కల్యాణ్‌కు సహకారం అందిస్తున్నా ఇతర టీడీపీ నేతలు, బిజెపీ నేతలు ఇంకా రంగంలోకి దిగలేదనే టాక్‌ స్థానికుల్లో నడుస్తోంది. ఈ నేపథ్యంలో పోటీ తీవ్రంగానే ఉంటుందని 2024 ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ గెలుపు అంత సులువు కాదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Tags:    

Similar News