ఆ ముద్ర నుంచి పయ్యావుల బయట పడుతారా?

రాజకీయ వర్గాలు, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో సాగుతోన్న ఆసక్తికర చర్చ.

Update: 2024-04-22 14:06 GMT


సినిమాల్లో ఉన్నట్టే రాజకీయ పార్టీల్లో కొంత మంది ఐరన్‌ లెగ్‌లు ఉన్నారని ఎప్పటి నుంచో ఒక సరదా చర్చ ఉంది. ఆయా నియోజక వర్గాల్లో వారు గెలిస్తే ఆ ఎన్నికల్లో వారి పార్టీ ఓడి పోయి అధికారానికి దూరం కావడమే కాకుండా ప్రతిపక్షంలో ఉంటారని, వారు ఓడి పోతే వారి పార్టీలు గెలిచి అధికారంలోకి వస్తాయని ఎప్పటి నుంచో రాజకీయ వర్గాల్లో ఒక ఫన్నీ డిస్కషన్‌ ఉంది. కొంత మంది రాజకీయ నాయకులు కలిసినప్పుడు కూడా దీనిపై మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకోవడం చేస్తుంటారు. ఇలాంటి టాపిక్‌లు అసెంబ్లీలోను, అసెంబ్లీ లాబీల్లోను చోటు చేసుకుంటుంటాయి. వారిలో ప్రధానంగా ఇద్దరి నేతల పేర్లు వినిపిస్తుంటాయి. ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సీపీలో మంత్రిగా ఉన్న ఆర్కే రోజా ఒకరు కాగా, మరొకరు తెలుగుదేశం పార్టీకి చెందిన ఉరవకుండ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌. ఆర్కే రోజా 2014లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలవడంతో వైఎస్‌ఆర్‌సీపీ ఓడిపోయిందని, దీంతో వైఎస్‌ జగన్‌ అధికారానికి దూరం కావడంతో పాటు ప్రతిపక్షంలో కూర్చున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. సోషల్‌ మీడియాలో కూడా అలాంటి కామెంట్లు అప్పట్లో వైరల్‌గా మారాయి. అయితే 2019 ఎన్నికల్లో ఆమె గెలవడం, వైఎస్‌ఆర్‌సీపీ కూడా అధిక స్థానాలు కైవసం చేసుకోవడం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఆర్కే రోజా ఐరన్‌ లెగ్‌ అనే ముద్ర నుంచి బయట పడ్డారని అప్పట్లో చర్చ కూడా జరిగింది.

సరదా సెంటిమెంట్‌ చర్చ
అయితే పయ్యావుల మాత్రం ఇంకా ఆ ముద్ర నుంచి బయట పడలేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. పయ్యావుల కేశవ్‌ గెలిచిన ప్రతి సారి తెలుగుదేశం పార్టీ ఓడి పోతుందని, ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని అనే సరదా సెంటిమెంట్‌ చర్చ రాజకీయ వర్గాల్లోనే కాదు ఆ పార్టీ శ్రేణుల్లో కూడా సాగుతోంది. పయ్యావుల కేశవ్‌ టీడీపీ సీనియర్‌ నేతల్లో ఒకరు. ఆయన 2004, 2009 ఎన్నికల్లో ఉరవకొండ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అయితే ఈ రెండు సార్లు తెలుగుదేశం పార్టీ ఓడి పోయింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేక పోయారు. తిరిగి 2019లో పయ్యావుల గెలిచారు. మళ్లీ తెలుగుదేశం పార్టీ ఓడి పోయింది. చంద్రబాబు నాయుడు ప్రతిక్ష నేతగా మిగిలి పోయారు. 2014 ఎన్నికల్లో పయ్యావుల ఓడి పోయారు. తెలుగుదేశం పార్టీ గెలిచింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అంతకు ముందు 1999లో పయ్యావుల ఓడిపోయారు. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారని ఒక ఫన్నీ టాక్‌ ఆ పార్టీలో ఉంది. ఇలా పయ్యావుల గెలుపోటములకు తెలుగుదేశం పార్టీ గెలుపోటములకు లింక్‌ పెడుతూ సరదాగా చర్చించుకోవడం చేస్తుంటారు.
అసెంబ్లీ లాబీల్లో సరదా డిస్కషన్‌
గతేడాది మార్చిలో జరిగిన బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాల్లో ఒక ఆసక్తికర సన్నివేశం జరిగింది. బడ్జెట్‌పై గవర్నర్‌ ప్రసంగం తర్వాత ఎమ్మెల్యేలంతా లాబీల్లోకి వచ్చి సరదాగా కబుర్లాడుతున్నారు. ఇదే సమయంలో ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావు కేశవ్, మచిలీపట్నం వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పేర్ని నానిలు ఎదురుపడ్డారు. బాగున్నారా అని పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. 2024 ఎన్నికల్లో కూడా ఉరవకొండ నుంచి మీరే గెలవాలని పయ్యావుల కేశవ్‌ను పేర్ని నాని ఆకాంక్షించారు. ఎందుకని పయ్యావుల అడిగితే మీరు గెలిస్తే టీడీపీ ఓడిపోతుంది కాబట్టి అని అనడంతో ఇద్దరి మధ్య నవ్వులు చిగురించాయి. అయితే వెంటనే తేరుకున్న కేశవ్‌ అలాంటి సెంటిమెంట్‌ 2024లో పని చేయదని, 1994లో ఉరవకొండలోను, రాష్ట్రంలోను టీడీపీ గెలిచిందని, ఈ సారి కూడా ఇదే సీన్‌ రిపీట్‌ అవుతుందని, వైసీపీ నేతలు అలాంటి ఆలోచనలు, ఆశలు పెట్టుకోవద్దని అనడంతో అందరూ నవ్వుకుంటా ఎవరి దారిన వారు వెళ్లి పోయారు.
తాజాగా తెరపైకి
తాజాగా 2024 ఎన్నికల నేపథ్యంలో ఇది మళ్లీ తెరపైకి వచ్చింది. అటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోను, ఇటు రాజకీయ వర్గాల్లోను సరదాగా చర్చించుకుంటున్నారు. అయితే ఇవన్నీ పట్టించుకోని చంద్రబాబు నాయుడు తిరిగి పయ్యావులకే 2024 ఎన్నికల్లో ఉరవకొండ టీడీపీ టికెట్‌ ఇచ్చారు. ఈ ఎన్నికల్లోనైనా పయ్యావుల ఆ ముద్ర నుంచి బయటపడుతారేమో చూడాలని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News