చంద్రబాబు వచ్చువేళ.. తిరుమల బ్రహ్మోత్సవాలలో అపశృతి

Update: 2024-10-04 08:39 GMT


తిరుమల బ్రహ్మోత్సవాల ప్రారంభం ముందు అపశ్రుతి చోటు చేసుకుంది. ధ్వజస్తంభంపై ఇనుప కొక్కి విరిగింది. సాయంత్రం నిర్వహించే ధ్వజారోహణలో ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని ఈ కొక్కి ద్వారానే అర్చకులు ఎగుర వేయాల్సి ఉంది. అర్చకులు ఈ కొక్కిని ఏర్పాటు చేసే పనులు ప్రారంభించారు. కాగా తొమ్మిది రోజుల పాటు ధ్వజస్తంభంపై ఈ గరుడ పతాకాన్ని ఉంచుతారు. బ్రహ్మోత్సవాల ముగింపు చిహ్నంగా చివరి రోజు పతాకాన్ని అవనతం చేస్తారు.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు తిరుమలలో నేటి నుంచి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సాయంత్రం 5 .45 గంటలకు మీనలగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 9 గంటలకు నిర్వహించే పెద్దశేష వాహన సేవతో వాహన సేవలు మొదలవుతాయి. వైదిక కార్యక్రమాలన్నింటినీ శాస్త్రోక్తంగా నిర్వహించేలా టీటీడీ చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6.20 గంటలకు సీఎం చంద్రబాబు తిరుమల చేరుకుంటారు. స్వామివారికి ప్రభుత్వం తరఫున సీఎం దంపతులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. రేపు టీటీడీ డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించి, వకుళమాత వంటశాలను ప్రారంభిస్తారు. తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు నేడు మీన లగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానం పలుకుతూ ధ్వజ పటం ఎగురవేస్తారు. దీంతో మలయప్ప స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈరోజు రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహన సేవతో శ్రీవారి వాహన సేవలు మొదలవుతాయి. అక్టోబర్ 11న ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రికి అశ్వ వాహనంతో వాహన సేవలు ముగుస్తాయి. 12న శ్రీవారి పుష్కరిణిలో చక్రత్తాళ్వారుకు జరిగే స్నపన తిరుమంజనంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి


Tags:    

Similar News