హైదరాబాద్ సీపీగా మళ్లీ సీవీ ఆనంద్, కొత్తకోటని ఎందుకు మార్చినట్లు...
హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు.నగరంతో మంచి అనుబంధం ఉన్న ఆనంద్ శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు.
By : Shaik Saleem
Update: 2024-09-07 12:06 GMT
హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్థానంలో సీవీ ఆనంద్ శనివారం నియమితులయ్యారు.1991వ సంవత్సరం బ్యాచ్‌కు చెందిన ప్రముఖ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి సీవీ ఆనంద్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో కీలక అధికారిగా పనిచేశారు. సీవీ ఆనంద్ పనిచేసిన ప్రాంతాల్లో సంస్కరణలు అమలు చేయడం,పోలీసు కార్యకలాపాలను ఆధునీకరించడంలో పేరొందారు.ఈయన 2013 నుంచి 2016వ సంవత్సరం వరకు సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా పనిచేశారు.ఆనంద్ సీసీటీవీ వ్యవస్థలను ప్రవేశపెట్టడం, కేంద్రీకృత ట్రాఫిక్ నిర్వహణతో సహా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పట్టణ పోలీసింగ్ పనితీరును మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషించారు.
హైదరాబాద్ సీపీ టు ఏసీబీ
సీవీ ఆనంద్ 2021వ సంవత్సరం డిసెంబర్ నుంచి 2023 అక్టోబర్ వరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో హైదరాబాద్ సీపీగా ఉన్న ఆనంద్ పై ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీవీ ఆనంద్ ను తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా బదిలీ చేసింది.
హైదరాబాద్ తో అనుబంధం...
సీవీ ఆనంద్ సమర్ధ పోలీసు అధికారిగా పేరుంది. క్రికెటర్ అయిన సీవీ ఆనంద్ హైదరాబాద్ నగరంలోనే చదువుకున్నారు. నగరంతో మంచి అనుబంధం ఉన్న సీవీ ఆనంద్ ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యాక నిజామాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేశారు. తన పదవీ కాలంలో శాంతిభద్రతలను పరిరక్షించడంతోపాటు, మత సామరస్యాన్ని కాపాడారు. ఆపరేషన్ రోప్ (అబ్స్ట్రక్టివ్ పార్కింగ్,ఆక్రమణల తొలగింపు) వంటి ట్రాఫిక్ నిర్వహణ కార్యక్రమాలను అమలు చేశారు. మాదకద్రవ్యాలు, సైబర్ క్రైమ్‌లకు వ్యతిరేకంగా పలు కేసులు పెట్టారు.ఆనంద్ పనితీరు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను స్థాపించడానికి దారితీసింది.
విజిలెన్స్ డీజీగా కొత్తకోట
కొత్తకోట శ్రీనివాస రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ప్రభుత్వం, సాధారణ పరిపాలన శాఖ ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు.ఆనంద్ స్థానంలో విజయ్ కుమార్‌ను అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేశారు. ఆయన ఇంతకుముందు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్)గా బాధ్యతలు నిర్వర్తించారు.ప్రస్తుతం అదనపు జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్)గా పనిచేస్తున్న మహేశ్ ఎం భగవత్‌కు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (పర్సనల్ అండ్ వెల్ఫేర్) పదవికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
పాత బస్తీలో రాత్రివేళ యువకుల సంచారంపై కొత్తకోట కొరడా
పాత నగరంలో అర్దరాత్రి వేళ యువకుల సంచారంపై గత సీసీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి కొరడా ఝళిపించారు. పాత బస్తీలో దుకాణాలు రాత్రి పన్నెండు గంటల లోపు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాత్రివేళ పోలీసులతో తనిఖీలను ముమ్మరం చేయడంతోపాటు నేరస్థుల పట్ల కొత్తకోట గట్టిగానే వ్యవహరించారు. సంఘవ్యతిరేక శక్తులు, గూండాలపై గత సీపీ ఉక్కుపాదం మోపారు.
ఎంఐఎం నేతల ఒత్తిడితోనే...
ఎంఐఎం నేతల ఒత్తిడితోనే సీపీ శ్రీనివాసరెడ్డిపై ప్రభుత్వం బదిలీవేటు విధించిందని చెబుతున్నారు. రాత్రివేళ ఆవారాగా తిరుగుతున్న యువకులపై పోలీసులు కేసులు పెట్టడంతో పాటు వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగిన ఫోన్ ట్యాపింగ్ బాగోతంపై గత సీపీ శ్రీనివాసరెడ్డి దర్యాప్తు సాగించారు. కొత్తకోట బదిలీతో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. మజ్లిస్ ఎమ్మెల్యేలు సీపీకి ఫోన్ చేసినా స్పందించలేదని చెబుతున్నారు. మజ్లిస్ యువకులపై అక్రమంగా కేసులు పెట్టారని, అందుకే మజ్లిస్ నేతలు పాత సీపీ కొత్తకోటను బదిలీ చేయాలని పట్టుబట్టినట్లు చెబుతున్నారు. సౌత్ జోన్ పరిధిలో పోలీసులు నిఘా పెంచడంతోనే మజ్లిస్ నేతలు సీపీ వైఖరిని వ్యతిరేకించారని సమాచారం.