Panchami Theertham || పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె.. !
By : Dinesh Gunakala
Update: 2024-12-06 05:11 GMT
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె సమర్పించారు.
ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.
ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2.30 నుండి పరిమళాన్ని(నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం) విమాన ప్రాకారంలో ఊరేగింపు చేపట్టారు. అనంతరం శ్రీవారి వక్షఃస్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించారు.
ఆ తరువాత ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణంతో కూడిన సారె ఊరేగింపు మొదలైంది. ఈ సారెను గజాలపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించి అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళ్లారు.