శ్రీశైలం 'రీల్స్' వివాదం..దేవస్థానం అప్రమత్తం

ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరికలు జారీ చేశారు.

Update: 2025-12-20 04:29 GMT

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీసే చర్యలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. క్షేత్ర పరిధిలో అన్యమత ప్రార్థనలు చేయడం, బోధనలు నిర్వహించడం మరియు వ్యక్తిగత రీల్స్ చేయడంపై కఠిన నిషేధం విధిస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎస్. శ్రీనివాసరావు ప్రకటించారు.

అన్యమత ప్రచారాలపై ఉక్కుపాదం

శ్రీశైలం క్షేత్ర పవిత్రతను కాపాడటంలో భాగంగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అన్యమత కార్యకలాపాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని ఈవో స్పష్టం చేశారు. అన్యమతాలకు సంబంధించిన కరపత్రాలు పంచడం, పుస్తకాలు పంపిణీ చేయడం. అన్యమత ప్రార్థనలు లేదా ప్రచారాలు నిర్వహించడం వంటి పనులకు పాల్పడితే దేవాదాయ ధర్మాదాయ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రీల్స్, వీడియోలపై ఆంక్షలు

సోషల్ మీడియా పిచ్చితో ఆలయ ప్రాంగణాల్లో ఇష్టానుసారంగా వ్యవహరించే వారిపై అధికారులు దృష్టి సారించారు. దేవస్థాన అధికారుల ముందస్తు అనుమతి లేకుండా వీడియోలు తీయడం, డ్రోన్లు ఎగురవేయడం పూర్తిగా నిషేధం విధించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత రీల్స్‌ను ప్రచారం చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని, అటువంటి పనులు చేయవద్దని హెచ్చరించారు. 

అసాంఘిక కార్యకలాపాలపై నిఘా

క్షేత్ర పరిధిలో ధూమపానం, మద్యపానం, జూదం ఆడటం, మాంసాహార సేవనం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం నేరమని ఈవో హెచ్చరించారు. భక్తులందరూ ఈ నిబంధనలను పాటించి క్షేత్ర పవిత్రతను కాపాడటంలో దేవస్థానానికి సహకరించాలని కోరారు.

వివాదమే నేపథ్యం..

ఇటీవల ఒక యువతి శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో చేసిన రీల్స్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవ్వడం, సదరు యువతి క్షమాపణలు కోరుతూ వీడియో విడుదల చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. మరెవ్వరూ కూడా ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా ఉండేందుకు ఈ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News