ఆంధ్ర పౌరులకు నమస్కారం, అందరూ బాగున్నారా?
శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో తెలుగులో మాట్లాడిన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్
By : The Federal
Update: 2025-12-20 02:07 GMT
భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మూడ్రోజుల పర్యటనలో భాగంగా డిసెంబర్ 20న శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. జ్ఞానేశ్ కుమార్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకోగా, అధికారులు సంప్రదాయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శనం కల్పించారు.
జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామివారిని, శక్తి స్వరూపిణి అయిన భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకోవడం తమ అదృష్టమని, ఇది గొప్ప అనుభూతిగా భావిస్తున్నట్లు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అన్నారు. పరమశివుడు, అమ్మవారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపారు. అనంతరం ఆయన ‘జై భారత్ – జై హింద్’ అంటూ ముందుకు సాగారు.
భ్రమరాంబ అతిథి గృహం వద్ద ఘన స్వాగతం
శుక్రవారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దర్శనార్థం శ్రీశైలం చేరుకున్న జ్ఞానేశ్ కుమార్‌కు భ్రమరాంబ అతిథి గృహం వద్ద రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు సహా పలువురు అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు.
ప్రత్యేక పూజలు, అభిషేకం
అనంతరం జ్ఞానేశ్ కుమార్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి మల్లికార్జున స్వామివారికి అభిషేకం, భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన సహా పలు ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఈసీ, “ఆంధ్రప్రదేశ్ పౌరులకు నమస్కారం.. అందరూ బాగున్నారా” అని తెలుగులో సంబోధించడం విశేషంగా నిలిచింది.
తెలుగు రాష్ట్రాల్లో మూడ్రోజుల పర్యటన
మూడ్రోజుల పర్యటనలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జ్ఞానేశ్ కుమార్ పర్యటిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి ఆయన దంపతులు చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి సహా పలువురు ఎన్నికల అధికారులు సీఈసీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డుమార్గాన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలానికి చేరుకున్నారు.
డిసెంబర్ 20న ఉదయం శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో మహాహారతి కార్యక్రమంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.
డిసెంబర్ 21న హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో తెలంగాణ బూత్ లెవల్ ఆఫీసర్లతో సీఈసీ సమావేశం కానున్నారు. ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల నమోదు సహా పలు అంశాలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. మూడో రోజు పర్యటన అనంతరం ఆయన ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.