డ్రగ్స్ నియంత్రణకు కొత్త వ్యూహం..ఇక యాంటీ డ్రగ్స్ కమిటీలు

తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కొత్త వ్యూహాన్ని రూపొందించింది.విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Update: 2024-07-06 15:09 GMT

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఆదేశాలతో మాదకద్రవ్యాలను నియంత్రించేందుకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. డ్రగ్స్ కు యువతీ, యువకులు బానిసలుగా మారకుండా చూసే ప్రయత్నంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పకడ్బందీ వ్యూహాలను అమలు చేస్తోంది.

డ్రగ్ కేసుల్లో పాత నేరస్థులపై నిఘా
తెలంగాణ రాష్ట్రం నుంచి మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించడానికి వీలుగా డ్రగ్ కేసుల్లో పాత నేరస్థులపై నిఘా వేయాలని నిర్ణయించారు. తెలంగాణలోని డ్రగ్స్ పెడ్లర్లు, సరఫరాదారులను లక్ష్యంగా చేసుకొని దాడులు ముమ్మరం చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్యా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడంతోపాటు ఇక నుంచి అన్ని సాధారణ డ్రగ్స్ సింథటిక్, నాన్-సింథటిక్ వినియోగదారుల కదలికలను ట్రాక్ చేయాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. డ్రగ్స్ రాకెట్ లో ప్రధానపాత్రధారులను పట్టుకోవడానికి తాము నిఘా వేయనున్నట్లు సందీప్ శాండిల్యా వివరించారు.

డ్రగ్స్ కేసుల్లో నేరస్థులకు శిక్షలు పెంపు
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఇటీవల పోలీసు కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ రవి గుప్తా, టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ సందీప్ శాండిల్యలతో జరిపిన సమావేశంలో డ్రగ్స్ నియంత్రణపై కీలక నిర్ణయం తీసుకున్నారు.యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు లాజిస్టిక్,టెక్నికల్ ఫైనాన్షియల్ సపోర్టు ఇస్తామని ప్రకటించారు. డ్రగ్స్ కేసుల్లో నేరస్థులకు శిక్షలను పెంచాలని నిర్ణయించారు.యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను దేశంలోనే అత్యుత్తమ పనితీరు గల ఏజెన్సీగా తీర్చిదిద్దేందుకు తాము చర్యలు తీసుకున్నామని సందీప్ శాండిల్యా చెప్పారు.

డ్రగ్స్ ను నియంత్రించకుంటే చట్టబద్ధంగా చర్యలు
ఉస్మానియా మెడికల్ కళాశాలలోనే మెడికోలు గంజాయిని సేవిస్తున్న నేపథ్యంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పాఠశాలలు,నివాస సంస్థలు, మాదకద్రవ్యాల వినియోగం ప్రబలంగా ఉన్న వాణిజ్య సంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేసి మాదకద్రవ్యాల వినియోగం లేకుండా నియంత్రించకుంటే తాము అధికారులకు సహకరించడానికి నిరాకరిస్తే లేదా వారి ప్రాంగణంలో మాదకద్రవ్యాల వినియోగాన్ని కొనసాగించడాన్ని కొనసాగించినట్లయితే, ఆయా సంస్థలను స్వాధీనం చేసుకునేందుకు, వారిని ప్రాసిక్యూట్ చేయడానికి తమకు చట్టబద్ధంగా అధికారం ఉందని సందీప్ శాండిల్య చెప్పారు.

డ్రగ్స్ స్మగ్లర్ల కదలికలపై నిఘా
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రగ్స్ పెడ్లర్లు, సరఫరాదారుల రికార్డులను సేకరించారు. డ్రగ్స్ స్మగ్లర్ల కదలికలను నిశితంగా పరిశీలించాలని నిర్ణయించారు. డ్రగ్స్ కేసులకు సంబంధించిన దోషులు, మాజీ ఖైదీలపై నిరంతరం నిఘా ఉంచాలని నిర్ణయించారు.కళాశాలలు, పాఠశాలలు, కళాశాలల్లోని యాంటీ డ్రగ్స్ కమిటీలు డ్రగ్స్ చీకటి కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కోరింది. స్థానిక పోలీసులు, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు, యాంటీ డ్రగ్స్ కమిటీల సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా ఇ-సిగరెట్లు, వేప్‌లు, చిన్న మద్యం సీసాలు, గంజాయి చాక్లెట్లు,గంజాయి సిగరెట్లను నియంత్రించేందుకు బ్యాగ్‌లు,లాకర్లను తనిఖీ చేస్తారని అధికారులు తెలిపారు.

పాత డ్రగ్స్ కేసుల కొట్టివేత
2017వ సంవత్సరంలో మేడ్చల్ జిల్లాల్లో నమోదైన డ్రగ్స్ కేసులను పోలీసులు కోర్టుల్లో నిరూపించలేక పోయారు. అప్పట్లో డ్రగ్స్ పెడలర్స్ తోపాటు 62 మంది డ్రగ్స్ వాడారని సిట్ బృందం విచారణ జరిపి, 12 కేసుల్లో చార్ఝ్ షీటు వేసింది. ఈ డ్రగ్స్ కేసులపై కోర్టుల్లో ఏడేళ్లుగా విచారణ జరిగినా చివరకు పోలీసులు డ్రగ్స్ నేరాలను నిరూపించలేక పోయారని కోర్టులు కొట్టివేశాయి. దీంతో డ్రగ్స్ నిందితులు బయటపడ్డారు. గతంలో లాగా జరగకుండా నార్కోటిక్స్ బ్యూరో అధికారులు డ్రగ్స్ కేసుల్లో దోషులకు శిక్ష పడేలా పకడ్బందీగా ఛార్జ్ షీట్లు వేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభ రెడ్డి తెలంగాణ సీఎంకు రాసిన లేఖలో కోరారు.

నాలుగు పోలీసు కమిషనరేట్లలో...
సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ, వరంగల్‌లోని పోలీసు కమిషనరేట్ ల పరిధిలోని నాలుగు యూనిట్లలో నార్కోటిక్స్ బ్యూరో త్వరలో పూర్తి స్థాయిలో డ్రగ్స్ నియంత్రణకు చర్యలు తీసుకోనుంది. డ్రగ్స్ రాకెట్‌ను నడుపుతున్న స్మగ్లర్లను ట్రాప్ చేయడానికి ప్రయత్నించనున్నారు. ఇతర దేశాలకు చెందిన పోలీసులతో సమన్వయం చేస్తూ డ్రగ్స్ సమాచారాన్ని సేకరించి దానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు.

యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కంట్రోల్ రూమ్‌
మాదకద్రవ్యాల వినియోగం లేదా సరఫరాలకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కంట్రోల్ రూమ్‌కు నివేదించాలని సందీప్ శాండిల్యా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కంట్రోల్ రూం ఫోన్ నంబరు 8712671111కు ఫిర్యాదు చేస్తే తాము చర్యలు తీసుకుంటామని సందీప్ శాండిల్యా వివరించారు.



Tags:    

Similar News