వైఎస్‌ఆర్‌సీపీలో జంగా గుబులు
పల్నాడు ప్రాంతంలో బీసీ నాయకుడిగా జంగాకు గుర్తింపు ఉంది. ఇది వైఎస్‌సీపీ అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపే చాన్స్ ఉంది.
వైఎస్‌ఆర్‌సీపీకి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గుబులు పట్టుకుంది. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన జంగా ఆ పార్టీ గెలుపు కోసం పని చేస్తుండటంతో వైఎస్‌ఆర్‌సీపీ నేతల్లో ఆందోళనలు నెలకొన్నాయి. జంగా కృష్ణమూర్తి బీసీ నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా పాపులారిటీ ఉన్నా, ప్రత్యేకించి పల్నాడు జిల్లా, నరసరావుపే పార్లమెంట్ నియోజక వర్గంలో ఆయన ప్రభావం ఎక్కువుగా కనిపిస్తోంది. జంగా కృష్ణమూర్తి పల్నాడు జిల్లా వాసి కావడం, గురజాల నుంచి గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, సుదీర్ఘకాలం పాటుగా ఆయన రాజకీయాల్లో ఉండటం వల్ల ఈ జిల్లాలో జంగా ప్రభావం ఎక్కువుగానే ఉంది. ప్రత్యేకించి వెనుకబడిన తరగతుల వర్గాల్లో అయితే జంగాకు మంచి గుర్తింపు, ఆదరణ ఉంది. సొంత నాయకుడుగా జంగాను బీసీలు అభిమానిస్తారు. ఇటీవలె ఆయన వైఎస్‌సీపీ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో జంగా ప్రభావం పల్నాడు జిల్లాలోని వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులపై ఉంటుందని ఆ పార్టీ నేతలు, శ్రేణులు అంచనా వేస్తున్నారు. టీడీపీలో చేరిన జంగా ఆ పార్టీ గెలుపు కోసం పని చేస్తుండటంతో వైఎస్‌ఆర్‌సీపీ నేతల్లో ఓటమి భయాందోళనలు నెలకొన్నాయనే టాక్ కూడా ఆ పార్టీ నేతల్లో ఉంది. ఇదే అంశం ప్రస్తుతం పల్నాడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులకు కునుకు లేకుండా చేస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు.