నామినేషన్‌కు సైకిలెక్కి వచ్చారు

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే ఏమి చేసినా వెరైటీనే. ఆయన చేసే హడావుడి ఎప్పుడూ వైరల్‌ అవుతూ ఉంటుంది. ఇదే కోవలో నామినేషన్‌ ప్రక్రియలో కూడా చూపించారు.

Update: 2024-04-19 13:55 GMT

సాధారణంగా ఎన్నికలంటే నామినేషన్‌ వేసిన తొలి రోజునే బల నిరూపణకు సర్వశక్తులు ఒడ్డుతారు. నామినేషన్‌ ఘట్టాన్ని భారీ జన సమీకరణతో సత్తా చాటుకుని అటు ప్రత్యర్థులకు సవాలు విసరడం.. ఇటు తటస్తులను సానుకూలంగా మలచుకోవడం.. సొంత క్యాడర్‌లో ఆత్మ స్తైర్యం నింపడం చేస్తుంటారు. ఇందు కోసం లక్షలు కుమ్మరించి కార్ల కాన్వాయ్‌లు.. జెండాల రెపరెపలు.. జేజేలు కొట్టే అభిమానులు.. వారికి అవసరమైన విందు మందు వంటి ఏర్పాట్లకు కొదవ ఉండదు. ఇందుకు భిన్నంగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాత్రం తన పార్టీ గురై్తన సైకిల్‌పైనే వెళ్లి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయనను అనుసరించిన వాళ్లు కూడా పెద్ద ఎత్తున సైకిళ్లపైనే రావడం మరో విశేషం.

రాజకీయాల్లో ఎంత ఒదిగితే అంత ఎదుగుతారనే పెద్దల మాటను రామానాయుడు బాగా వంటబట్టించుకున్నట్లున్నారు. అందుకే నామినేషన్‌ వేసేందుకు బయలు దేరే ముందే పాలకొల్లు పెద్ద తలకాయల ఆశీస్సులు తీసుకొని వారి వద్ద మార్కులు కొట్టేశారు. రాష్ట్ర మాజీ మంత్రి, ప్రస్తుత కాపు సేవా సమితి అధ్యక్షులు చేగొండి వెంకట హరిరామ జోగయ్య, రాష్ట్ర మాజీ మంత్రి టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు అల్లు వెంకట సత్యనారాయణ, త్సవటపల్లి సత్యనారాయణ మూర్తి(డాక్టర్‌ బాబ్జీ)లకు కాళ్లు మొక్కి పాదాభి వందనం చేసి వారి ఆశీస్సులు తీసుకోవడం విశేషం.
పొలిటికల్‌ లీడర్‌ బట్‌ పబ్లిసిటీ ఈవెంట్‌
గతంలో గ్రాడ్యుయేట్ల నియోజక వర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి పరాజయం పాలైన నిమ్మల రామానాయుడు 2014, 2019 ఎన్నికల్లో రెండు పర్యాయాలు టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడో సారి హ్యాట్రిక్‌ సాధించే దిశగా పోటీకి సిద్ధమయ్యారు. ఆయన అవకాశమున్న ప్రతి కార్యక్రమాన్ని ఒక ఈవెంట్‌లా నిర్వహించి పొలిటికల్‌ మైలేజీ కోసం రామానాయుడు తనదైన స్టైల్‌లో అటు వార్తల్లోను.. ఇటు జనంలోను నానుతుంటారు. గతంలో శ్మసానంలో రాత్రి నిద్ర.. కాలువలో జలదీక్ష.. ఇసుక, నిత్యావసర ధరలపై తోపుడు బండితో నిరసన.. ప్రజా సమస్యలపై సైకిల్‌ యాత్ర వంటి కార్యక్రమాలతో హడావుడి చేశారు. అందుకే ఆయనను నచ్చిన వారు మా రామానాయుడని అని కితాబిస్తే.. నచ్చని వారు డ్రామా నాయుడని వెటకారమాడుతుంటారు.
Tags:    

Similar News