‘హైడ్రా’కు అభినందనల వెల్లువ,మాకు కావాలంటున్న జిల్లా ప్రజలు
కబ్జాదారుల భరతం పడుతున్న ‘హైడ్రా’కు ప్రజలు,స్వచ్ఛంద సంస్థల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మాకు కూడా హైడ్రాను ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
By : Shaik Saleem
Update: 2024-08-27 12:57 GMT
హైదరాబాదు నగరంలో ఆక్రమణలకు గురైన చెరువుల పునరుద్ధరణ కోసం హైడ్రా చేపడుతున్న చర్యలను ఫోరం ఫర్ గుడ్ గవర్సెన్స్ అభినందించింది. హైడ్రాకు పూర్తి మద్ధతు ఇస్తామని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి చెప్పారు. హైడ్రా చేస్తున్న పనిని ప్రజలందరూ అభినందిస్తున్నారని, జిల్లాలకు కూడా హైడ్రా లాంటి సంస్థలను ఏర్పాటు చేయాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పక్షాన తాను హైడ్రా ఛైర్మన్, తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు పద్మనాభరెడ్డి చెప్పారు.
జిల్లాల్లోనూ చెరువుల కబ్జా
వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి పలు జిల్లాల్లో చెరువులు ఆక్రమణలకు గురవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చెరువుల కబ్జాల నేపథ్యంలో జిలాల్లోనూ హైడ్రా వంటి సంస్థ ఏర్పాటు చేయాలని జిల్లాల ప్రజలు కోరుతున్నారు.ప్రస్థుతం హైడ్రా పరిధి కేవలం జీహెచ్‌ఎంసీతోపాటు నగర శివార్లకే పరిమితమైంది. అదీకాక హైడ్రా ఒక జి.ఓ. ద్వార ఏర్పాటు చేయబడింది.హైడ్రాను తెలంగాణ రాష్ట్రం మొత్తానికి విస్తరిస్తూ టి.జి.ఆర్.ఏ.ఏ.(తెలంగాణ డిసాస్టర్ రెస్పాన్స్ అంట్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీగా) చట్టం ద్వారా ఏర్పాటు చేయాలని యం పద్మనాభరెడ్డి సీఎంను కోరారు. రాష్ట్ర స్థాయిలో హైడ్రాను విస్తరించి చట్ట బద్ధత కల్పించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వ ఆస్థులు ఆక్రమణలకు గురి కాకుండా కాపాడే వీలుంటుందని సీఎంకు సూచించారు.
సామాన్యులను ఆదుకోండి
హైడ్రా కూల్చివేతల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు నష్టపోయిన వారికి, తగిన రీతిన మానవతాధృక్పథంతో సహాయం చేయాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరింది. హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేసినప్పుడు సామాన్యులకు కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయని యం పద్మనాభరెడ్డి చెప్పారు.ప్రభుత్వ భూముల ఆక్రమణ, చెరువు ఆక్రమణ ఇంత తీవ్రరూపం దాల్చడానికి సంబంధిత శాఖ అధికారుల పాత్రపై కూడ ఆలోచించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫోరం సూచించింది.
కొనుగోలుదారులు జర జాగ్రత్త
చెరువులు, కుంటలు, నాలాలు, పార్కు స్థలాల్లో నిర్మించిన భవనాలను హైడ్రా కూల్చివేస్తున్న నేపథ్యంలో భవనాల కొనుగోలుదారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి ప్రజలను కోరారు.
- బిల్డర్లు ఇళ్లు, ఫ్లాట్లు కట్టి అమ్ముతున్నప్పుడు ఖరీదుదారు సరైన అనుమతులు చూసుకొని కొనాలి.చాలా సందర్భాల్లో బ్యాంకుల నుంచి అప్పు కూడా తీసుకుంటారు.బ్యాంకులు భవన నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతులు పరిశీలించి అప్పు ఇస్తారు.
- ఇల్లు, ప్లాటు కొన్న తర్వాత 10 సంవత్సరాలకు ఇప్పుడు సదరు ఆస్థి చెరువులోపల కబ్జా భూమి అని కూలగొడుతున్నారు.ఏమైనా కబ్జాలు, అక్రమనిర్మాణాలను కూలగొట్టవలసిందే, అయితే అమాయకులైన పేదలు, మధ్యతరగతి ప్రజలు అధికారుల అలసత్వం, బిల్డర్‌తో కుమ్మక్కై అమాయకులకు తీరని నష్టం కలిగిస్తున్నారు.అక్రమ కట్టడాలు కూల్చినప్పుడు బిల్డర్ నుంచి బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇప్పించాలి.అలా కాని పక్షంలో దగ్గరలోని ప్రభుత్వ భూమిని కేటాయించి ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటి వాటిని నిర్మించి ఇవ్వాలి.
- ఇళ్ళు కట్టాలంటే బిల్డర్ మొదట భూమి కొని దానిని రిజస్టర్ చేయించాలి.ఇందుకు రిజిస్ట్రేషన్ వారు 8శాతం ఫీజు తీసుకొని సదరు భూమిని బిల్డర్ లేదా అతనికి సంబంధించిన కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు.రిజిస్ట్రేషన్ చేసిన దస్తావేజులను ఒక లే అవుట్ దారు బిల్డర్, హెచ్.యం.డి.ఏ. వారికి సమర్పించగా వారు ఫీజు తీసుకొని లేఅవుట్ మంజూరు చేస్తారు.
విచారణ జరిపించాలి
బిల్డర్లతో కుమ్మక్రై తప్పుడు అనుమతులు ఇచ్చిన రిజస్ట్రేషన్, హెచ్.యం.డి.ఏ., జి.హెచ్.యం.సి. అధికారులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ డిమాండ్ చేసింది.