ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గిరిపుత్రుల పట్ల చూపుతున్న ఉదారత రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇతర నేతలకు భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఒకింత ఆసక్తికరంగా ఉంటోంది. ఎనిమిది నెలల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లాలో అడవి తల్లి బాట కార్యక్రమంలో పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ ఆదివాసీ గిరిజనుల కాళ్లకు చెప్పులు లేకపోవడాన్ని గమనించారు. పర్యటన ముగించుకుని వెళ్లిన వెంటనే కొత్త చెప్పులు కొని పంపించారు. ఆ తర్వాత పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు గిరిజనులకు రగ్గులు కొనివ్వాలని సంకల్పించారు. కొద్ది రోజుల్లోనే కొన్ని కుటుంబాలకు వాటిని పంపిణీ చేశారు. తాజాగా ఇద్దరు గిరిజన అంధ మహిళా క్రికెటర్లకు విలువైన ఇంటి, వంట సామగ్రిని, టీవీ, కుర్చీలను. వస్త్రాలను సమకూర్చారు. వీరికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున తన సొంత సొమ్మును అందజేశారు. ఆ పేద కుటుంబాలకు ఆసరాగా నిలిచారు. ఇలా రాజకీయాల్లో విభిన్న శైలితో గిరిపుత్రుల మదిని దోచుకుంటున్నారాయ.
పవన్ పంపిన చెప్పులను ధరించిన అల్లూరి జిల్లా ఆదివాసీలు
అంధ మహిళా క్రికెటర్ల కుటుంబానికి అండగా..
టీ–20 అంధ మహిళల ప్రపంచ కప్‌ను గెలిచాక భారత అంధ మహిళల క్రికెట్ జట్టు సభ్యులు ఈనెల 12న మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలిశారు. వీరిలో రాష్ట్రానికి చెందిన భారత జట్టు అంధ మహిళా క్రికెటర్లు దీపిక (కెప్టెన్), పాంగి కరుణ కుమారిలున్నారు. వీరిద్దరూ గిరిజన తెగలకు చెందిన కడు పేదరికంతో ఉన్న వారే. ఈ సందర్భంగా ఈ మహిళా క్రికెటర్ల కుటుంబాల ఆర్థిక స్థితిగతులను పవన్ అడిగి తెలుసుకున్నారు. దీనికి చలించిన ఆయన.. తక్షణమే వారి ఇళ్లకు గృహోపకరణాలు పంపించాలని నిర్ణయించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం జనసేన పార్టీ నాయకుల ద్వారా వాటిని వారి కుటుంబాలకు అందజేశారు. ఇలా ఈ క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక సొంతూరు శ్రీసత్యసాయి జిల్లా తంబలహట్టి తండాలో ఉంటున్న ఆమె కుటుంబ సభ్యులకు, అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్లమామిడిలో ఉంటున్న కరుణ కుమారి కుటుంబానికి వంట సామాగ్రి, ఎల్‌ఈడీ టీవీ, టేబుల్ ఫ్యాన్, మిక్సర్, గ్రైండర్, కుర్చీలు, చాపలు, స్టీల్ ప్లేట్లు, ప్రెషర్ కుక్కర్, ఎల్‌ఈడీ బల్బులు, ఇస్త్రీ పెట్టె, పాత్రలు, దుప్పట్లు, దిండ్లు, ఇంటిల్లపాదికీ కొత్త దుస్తులు పంపించారు. దీపిక కుటుంబానికి హిందూపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ వరుణ్, జనసేన నేత పొదిలి బాబూరావులు, కరుణకుమారి కుటుంబానికి ఏపీ జానపద కళలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్ వి.గంగులయ్య, విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమితులైన వన్నెంరెడ్డి సతీష్‌కుమార్‌లు వీటిని అందజేశారు. క్రీడాకారుల కోటా కింద కొత్త గృహాలు నిర్మించి ఇచ్చేలా పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక అవసరమైన గృహోపకరణాలు సమకూర్చాలని నిర్ణయించారు.
అంధ క్రికెటర్ కరుణకుమారి కుటుంబానికి సామగ్రిని అందజేస్తున్న జనసేన నాయకులు
దీపిక ఊరికి తక్షణమే రోడ్డు మంజూరు..
పవన్‌తో భేటీ అయినప్పుడు దీపిక తన గ్రామానికి (తంబళ్లహట్టికి) రోడ్డు సదుపాయం కల్పించాలని కోరగా పవన్ వెనువెంటనే స్పందించారు. ఆయన ఆదేశాలతో ఆ సాయంత్రానికే రోడ్డు మంజూరు చేసేలా ఆ జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. పవన్ చొరవ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ బాగా ట్రోల్ అవుతోంది. అంతేకాదు.. అదేరోజు ఒక్కో అంధ మహిళా క్రికెటర్‌కు రూ.5 లక్షల చొప్పున పవన్ తన సొంత సొమ్మును చెక్కుల రూపంలో బహూకరించారు. వారికి పట్టుచీరలు, ఏపీ హస్తకళల జ్ఞాపికలు, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీ డబ్బాలను కూడా అందజేశారు.
పవన్ కల్యాణ్ పంపిన రగ్గులతో మన్యం గిరిజనులు
ఆదివాసీలకు చెప్పులు పంపిన పవన్..
ఈ ఏడాది ఏప్రిల్‌లో పవన్ కల్యాణ్ అడవి బాట కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు. తన పర్యటనలో ఆదివాసీ గిరిజనులు చెప్పులు లేకుండా తనను చూడడానికి రావడాన్ని గుర్తించారు. పర్యటనను ముగించుకుని వెళ్లాక డుంబ్రిగుడ మండలం పెదపాడు గ్రామస్తులకు 350 జతల చెప్పులను పంపించారు. అప్పట్లో ఇది కూడా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. కొన్నాళ్ల క్రితం తన తోటలో పండించిన సేంద్రియ మామిడి పండ్లను డుంబ్రిగుడ మండలం కురిడి గ్రామస్తులకు బహుమతిగా పంపారు. అలాగే శీతాకాలంలో గిరిజనులు చలిని తట్టుకోవడం కోసం తన సొంత సొమ్మును వెచ్చించి రగ్గులను కొనుగోలు చేశారు. వాటిని ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలోని 225 గిరిజన కుటుంబాలకు పార్టీ నాయకుల ద్వారా అందజేశారు. తాజాగా గిరిజన అంధ క్రికెటర్ల కోసం తీసుకున్న చొరవ, ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి కాకుండా తన సొంత నిధులతో వారికి అవసరమైన వస్తు సామగ్రిని వెనువెంటనే సమకూర్చడాన్ని గిరిజనులు ఎంతగానో సంతసిస్తున్నారు. ఇలా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తమపై చూపుతున్న ఉదారత, సానుకూల దృక్పథం పట్ల గిరిజనులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. గతంలో ఏ నేతలూ ఇలా వ్యవహరించలేదంటూ వీరు ఆనంద పరవశులవుతున్నారు.