Tirumala || టీటీడీకి భారీ విరాళం.!
టీటీడీలోని వివిధ ట్రస్టులకు రూ.1.40కోట్లు విరాళం.;
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. శ్రీవారి సేవలో పాల్గొని తరిస్తూ ఉంటారు. కొంతమంది శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటే. మరికొంతమంది దాతలు టీటీడీకి భారీ విరాళాలు అందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే టీటీడీలోని వివిధ ట్రస్టులకు గురువారం రూ.1.40కోట్లు విరాళంగా అందింది. అమెరికాలోని బోస్టన్ కు చెందిన ఎన్అర్‌ఐ దాత భాగవతుల ఆనంద్ మోహన్ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ.1,00,01,116, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కు రూ.10,01,116, ఎస్వీ విద్యాదాన ట్రస్ట్ కు రూ.10,01,116, ఎస్వీ వేదపరిరక్షణ ట్రస్ట్ కు రూ.10,01,116, ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్ కు రూ.10,01,116 లు విరాళం అందజేశారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్. నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు. ఈ సందర్భంగా దాతను చైర్మన్ అభినందించారు.