కాకినాడ సెజ్ భూములు తిరిగి రైతుల పేరుపై రిజిస్ట్రేషన్
రిజిస్ట్రేషన్ రుసుములు, స్టాంప్ డ్యూటీ మినహాయించి కాకినాడ సెస్ భూములు రిజిస్ట్రేషన్.
కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) పరిధిలోని భూములను తిరిగి రైతులకు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ భుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా సాగుతున్న రైతుల పోరాటానికి ఫలితాన్ని అందించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించారు. దీంతో 2,180 ఎకరాల భూములను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుములను మినహాయించడం ద్వారా, తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లోని సుమారు 1,551 మంది రైతులకు భారీ ఊరట కలిగింది. ఈ నిర్ణయం తీర ప్రాంత వాసుల జీవనోపాధిని బలోపేతం చేస్తూ, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గత ప్రభుత్వాల్లో కాకినాడ సెజ్ కోసం స్వాధీనం చేసుకున్న భూములు, రైతులకు తిరిగి ఇచ్చే ప్రక్రియలో ఆలస్యం జరిగింది. 2021లో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం భూముల తిరిగి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. జీఓ నెం.12 విడుదలైనా, రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భూములు తమ పేరిట లేకపోవడంతో రైతు భరోసా వంటి ప్రభుత్వ పథకాల లబ్ధి అందుకోలేకపోయారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందడం, పిల్లల చదువులు, పెళ్లిళ్లకు భూములను ఉపయోగించడం సాధ్యం కాలేదు. ఈ సమస్యలను గతంలో పవన్ కల్యాణ్ కు రైతులు నివేదించగా ఆయన హామీ ఇచ్చి, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో దానిని సాకారం చేశారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలతో ఈ ప్రక్రియ వేగవంతమైంది.
ఈ నిర్ణయం తీర ప్రాంత వాసులకు ఎలాంటి ఉపయోగాలు కలిగిస్తుందో విశ్లేషిస్తే ముందుగా రైతుల ఆర్థిక స్వావలంబన పెరుగుతుంది. కాకినాడ తీరం వెంబడి ఉన్న తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాలు వ్యవసాయం, చేపలవేట పై ఆధారపడిన ప్రాంతాలు ఉన్నాయి. భూములు తిరిగి రైతుల పేరిట రిజిస్టర్ అయ్యేందుకు రుసుముల మినహాయింపు ద్వారా లక్షల రూపాయలు ఆదా చేసుకోగలరు. ఇది కేవలం రైతులకు మాత్రమే కాకుండా, స్థానిక ఆర్థిక చక్రాన్ని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు భూములు చేతికి వచ్చిన తర్వాత రైతులు వ్యవసాయాన్ని మరింత ఆధునికీకరించవచ్చు, ఉత్పత్తిని పెంచవచ్చు. ఇది స్థానిక మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల లభ్యతను పెంచి, ధరల స్థిరత్వాన్ని తెస్తుంది.
తీర ప్రాంతంలో మత్స్యకారులు, చిన్న వ్యాపారులు కూడా పరోక్షంగా లబ్ధి పొందుతారు. రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడటంతో స్థానిక వ్యాపారాలు, సేవలు పెరుగుతాయి. ఉదాహరణకు భూములపై రుణాలు పొంది రైతులు కొత్త పంటలు, సాంకేతికతలు అవలంబించవచ్చు. ఇది ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. అంతేకాకుండా గతంలో భూములు సెజ్ పేరుతో స్వాధీనం కావడంతో స్థానికుల్లో అసంతృప్తి పెరిగింది. ఇప్పుడు ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది. రాజకీయ స్థిరత్వానికి దోహదపడుతుంది.
ఇటీవల శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ ఈ సమస్యను ప్రస్తావించడం, రైతుల వ్యధను సభ ముందుంచడం ఈ నిర్ణయానికి మార్గం సుగమం చేసింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సహకారంతో ఈ ప్రక్రియ వేగవంతమైంది. మొత్తంగా ఈ నిర్ణయం తీర ప్రాంతంలో సామాజిక-ఆర్థిక సమతుల్యతను పెంచుతూ, రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తుంది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని సరిచేస్తూ, కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ ఘటన స్పష్టం చేస్తోంది. రైతులు ఇప్పుడు తమ భూములను స్వేచ్ఛగా ఉపయోగించుకుని, మెరుగైన జీవితాన్ని ఆశించవచ్చు.