జన్వాడ ఫామ్‌హౌస్ వ్యవహారంపై రఘునందన్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణను డ్రగ్ రహిత రాష్ట్రం చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, కానీ హైదరాబాద్‌లో వీకెండ్ వస్తే రేవ్ పార్టీలు, రావుల పార్టీలు జరుగుతున్నాయని రఘునందన్ అన్నారు.

Update: 2024-10-27 11:10 GMT

జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజీపడ్డారని ఆరోపించారు. మరోవైపు ఈ కేసులో ఏ1 గా ఫామ్ హౌస్ మేనేజర్ కార్తీక్‌ను, ఏ2 గా రాజ్ పాకాలను చేర్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

ఒకవైపు తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని, కానీ హైదరాబాద్‌లో వీకెండ్ వచ్చిందంటే రేవ్ పార్టీలు, రావుల పార్టీలు జరుగుతున్నాయని రఘునందన్ అన్నారు. రాజులు, యువరాజులు కూర్చుని విదేశీ మాదకద్రవ్యాలు, కొకైన్, ఇతర డ్రగ్స్ తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాజ్ పాకాల ఫామ్ హౌస్‌కు సంబంధించి రేవంత్ రెడ్డి, కేటీఆర్ కుమ్మక్కయిపోయారని ప్రచారం జరుగుతోందని చెప్పారు. ఇది నిజం కాకపోతే డీజీపీ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఎస్ఓటీ పోలీసులు రైడ్ సమయంలో ఫామ్ హౌస్ లోపల, చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను వెంటనే బయటపెట్టాలని, ఆలస్యం చేస్తే ఎడిటింగ్ కార్యక్రమాలు మొదలవుతాయని అన్నారు.

జన్వాడ ఫామ్ హౌస్‌పై సీఎమ్ ఎలాంటి చర్యలూ తీసుకుంటున్నట్లుగా కనిపించటంలేదని రఘునందన్ చెప్పారు. ముఖ్య నాయకులు, వారి పిల్లలను బయటకు పంపించిన తర్వాత కొంతమంది అమాయకులను అరెస్ట్ చేసినట్లుగా కనిపిస్తోందని అన్నారు. నిన్నరాత్రి జన్వాడ ఫామ్ హౌస్‌లో ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దొరికిన దొంగలను నూటికి నూరుశాతం శిక్షించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు, ఈ వ్యవహారం కేటీఆర్‌ను ఇరికించే ప్రయత్నంగా బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ ఆరోపించారు. దీపావళి సందర్భంగా రాజ్ పాకాల తన బంధువులకు పార్టీ ఇచ్చారని, అంతే తప్ప రేవ్ పార్టీ నిర్వహించారనటం సరికాదని అన్నారు. సీఎమ్ ఆదేశాలతో కేటీఆర్‌పై కుట్రకు ప్రయత్నం జరిగిందని, పార్టీ జరిగింది ఫామ్ హౌస్‌లో కాదని, ఇంట్లోనని చెప్పారు. ప్రజా సమస్యలనుంచి జనం దృష్టి మళ్ళించే ప్రయత్నం ఇది అని సుమన్ అన్నారు.

Tags:    

Similar News