గోవా నైట్‌క్లబ్ అప్డేట్: ఇద్దరు మేనేజర్లకు బెయిల్..
బిర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్‌లో డిసెంబర్ 6న జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 25 మంది..
గోవా(Goa) నైట్‌క్లబ్(Night club) మేనేజర్లు రాజ్‌వీర్ సింఘానియా, ప్రియాంషు ఠాకూర్లకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. డిసెంబర్ 6వ తేదీ అర్ధరాత్రి బిర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం(Fire Accident)లో 20 మంది సిబ్బంది, ఐదుగురు పర్యాటకులు సహా మొత్తం 25 మంది చనిపోయిన విషయం తెలిసిందే. మూడో మేనేజర్ వివేక్ సింగ్ బెయిల్ దరఖాస్తును జడ్జి డివి పాట్కర్ తిరస్కరించారు.
ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలోని నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాద ఘటనల తర్వాతి నుంచి ఇప్పటివరకు 8 మందిని అరెస్టు చేశారు. దుర్ఘటన తర్వాతి రోజే (డిసెంబర్ 7న) ముగ్గురిని అరెస్టు చేశారు. క్లబ్ యజమానులు గౌరవ్ లూత్రా సౌరభ్ లూత్రా సోదరులు థాయిలాండ్‌లోని ఫుకెట్‌కు పారిపోయిన విషయం తెలిసిందే. అయితే భారత పోలీసుల సూచనమేరకు థాయ్‌లాండ్ పోలీసులు వారిని అరెస్టు చేశారు. లూత్రా సోదరులు అక్కడ ఉండగానే ఢిల్లీ రోహిణి కోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేశారు. అయితే న్యాయమూర్తి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు.
మరో యజమాని అరెస్టు..
నైట్‌క్లబ్‌లో స్లీపింగ్ పార్ట్‌నర్‌గా ఉన్న అజయ్ గుప్తాను పోలీసులు ఇటీవల ఢిల్లీలో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గుప్తాను ఢిల్లీలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వినోద్ జోషి ముందు హాజరుపరిచి అనంతరం ట్రాన్సిట్ రిమాండ్‌పై ఢిల్లీ నుంచి గోవాకు తీసుకువెళ్లారు.
సింఘానియా, ఠాకూర్ తరపు న్యాయవాది వినాయక్ పరాబ్ మాట్లాడుతూ.. ‘‘ఇద్దరికి బెయిల్ మంజూరయ్యింది. అయితే సాక్షులను ప్రభావితం చేయరాదని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని పేర్కొంది. కేసు దర్యాప్తు అధికారులకు అందుబాటులో ఉంటూ దర్యాప్తునకు సహకరించాలని, అలాగే ప్రతినెల మొదటి బుధవారం పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని కోర్టు ఆదేశించింది’’ అని చెప్పారు.