త్వరలో బీఎంసీ ఎన్నికలు.. ఏకమైన థాకరే సోదరులు..

ముంబై మేయర్ పీఠం మరాఠాలదేనని ప్రకటన..

Update: 2025-12-24 10:12 GMT
Click the Play button to listen to article

బీఎంసీ(Brihanmumbai Municipal Corporation)తో పాటు 29 మునిసిపల్ కార్పొరేషన్లకు జనవరి 15వ తేదీ ఎన్నికలు జరగనున్నాయి. మరుసటి రోజు (16వ తేదీ)న లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో ఠాక్రే సోదరులు శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) నాయకుడు రాజ్ థాకరే(Raj Thackeray) ఏకమయ్యారు. మున్సిపల్ ఎన్నికలలో కలిసి పోరాడతామని విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. ముంబై మేయర్ మరాఠీనే అవుతారు అని ధీమా వ్యక్తం చేశారు. అయితే రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT) 150 సీట్లలో పోటీ చేస్తుందని, రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) మిగిలిన 77 సీట్లలో అభ్యర్థులను నిలబెట్టనుందని సమాచారం.

బాలాసాహెబ్‌కు నివాళి..

విలేఖరుల సమావేశానికి ముందు ఉద్ధవ్, రాజ్ థాకరే సోదరులు కుటుంబసభ్యులతో కలిసి శివాజీ పార్క్‌ను సందర్శించి పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు. వారి వెంట శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య థాకరే, ఎంఎన్ఎస్ నాయకుడు అమిత్ థాకరే కూడా ఉన్నారు.


త్వరలో ప్రజా ఉద్యమం..

మున్సిపల్ ఎన్నికలలో పోటీచేసేందుకు సోదరులిద్దరూ కలిసి రావడంపై శివసేన (యూబీటీ) నాయకుడు ఆనంద్ దూబే హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఈ రోజు చారిత్రాత్మక రోజు. థాకరే సోదరులు ఏకమై ముంబైని కాపాడటానికి ఒకే వేదికపైకి వచ్చారు. ముంబైవాసుల కల నెరవేరింది. దోపిడీదారుల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు త్వరలో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక ముంబైతో పాటు 28 ఇతర మునిసిపల్ కార్పొరేషన్లలో శివసేన, ఎంఎన్ఎస్ సత్తా చాటడం ఖాయం’’ అని చెప్పారు.


ఇన్నేళ్లు ప్రజలను ఎందుకు విడదీశారు?

అయితే ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఈ పరిణామాన్ని చాలా తేలికగా తీసుకుంది. శివసేన ప్రతినిధి మనీషా కయాండే మాట్లాడుతూ.. సోదరులు కలిసి రావడం మంచిది. కాని గత 20 సంవత్సరాలుగా మరాఠీ మాట్లాడే ప్రజలను ఎందుకు విడదీశారన్నదే అసలు ప్రశ్న? దీనికి వారు సమాధానం చెప్పలేదు?" అని అన్నారు.

Tags:    

Similar News